కర్ణాటకలోని హంపీ వద్ద తుంగభద్ర నదిలో స్విమ్మింగ్ కు వెళ్లి హైదరబాద్‌కు చెందిన ఓ మహిళా డాక్టర్ చనిపోయారు. ఆమె పేరు అనన్య మోహన్‌రావు. స్నేహితులతో కలిసి సరదాగా గడుపుదామని హంపీ వెళ్లారు. కానీ అక్కడ అనుకోకుండా జరిగిన ప్రమాదంలో చనిపోయారు. వివరాల్లోకి వెళితే… హైదరాబాద్ నాంపల్లిలోని ఓ ఆస్పత్రిలో పని చేసే ఇరవై ఆరేళ్ల అనన్య రావు మిత్రులతో కలిసి విహారయాత్రకు హంపీ వెళ్లారు. ఓ రిసార్టులో బస చేశారు. చూడాల్సిన ప్రదేశాలన్నీ చూసిన తర్వాత తుంగభద్ర వద్దకు వెళ్లారు. తుంగభద్ర నదిని చూసేందుకు వెళ్లిన సమయంలో ఆ నదిలో ఈతకొట్టాలని వారు భావించారు. అక్కడ తుంగభద్ర రాళ్ల మధ్యన ప్రవర్తిస్తూ ఉంటుంది. ఈత బాగా వచ్చిన అనన్య మోహన్ రావు తాను తుంగభద్రలోకి డైవింగ్ తరహాలో దూకి స్విమ్ చేస్తానని ఫ్రెండ్స్ కు చెప్పారు. అలా అనన్యరావు 25 అడుగుల ఎత్తు నుంచి కిందకు దూకారు. మిత్రులు ఆమె వీడియోను రికార్డు చేశారు.
అయితే అలా దూకిన ఆమె మళ్లీ కనిపించలేదు. స్విమ్మింగ్ చేస్తూ ఒడ్డుకు రాలేదు. దాంతో స్నేహితులు కంగారు పడి అంతా వెదికారు కానీ కనిపించలేదు. దాంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె దూకిన చోట కింద రాళ్లు ఉండి ఉంటాయని డైవింగ్ చేయగానే కింద రాళ్లు తగిలి ఉంటాయని ఆ తరవాత స్విమ్మింగ్ చేయలేక కొట్టుకుపోయి ఉంటారని భావి్తున్నారు. తుంగభద్రలో అనన్యరావు దూకుతున్న దృశ్యాలను స్నేహితులు వీడియో తీశారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. డాక్టర్ అనన్య మోహన్ రావు మరణంతో స్నేహితులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. తనతో వచ్చి సేఫ్ గా ఇంటికి వెళ్తారని అనుకున్న ఆమె తల్లిదండ్రులకు తాము ఏమి సమాదానం చెప్పాలని బాధపడుతున్నారు. ఎంత స్విమ్మింగ్ వచ్చినా కొండ రాళ్ల మధ్య ప్రవహించే నది విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరాన్ని ఈ ఘటన నిరూపిస్తోది.