Wednesday, January 22, 2025

అమెరికాలో మరో ఘాతుకం!

- Advertisement -
- Advertisement -

అమెరికాలో తుపాకి స్వేచ్ఛ, ట్రిగ్గర్ విశృంఖలత్వం మరి ఎనిమిది మందిని కబళించింది. టెక్సాస్‌లోని ఒక షాపింగ్ మాల్‌లో శనివారం రాత్రి ఓ దుండగుడి విచ్చలవిడి కాల్పులకు అక్కడికక్కడే వీరు నేలకొరిగారు. మృతుల్లో హైదరాబాద్‌కు చెందిన తాటికొండ ఐశ్వర్య కూడా వున్నారు. అక్కడే ఎంఎస్ పూర్తి చేసుకొని ప్రాజెక్టు మేనేజర్‌గా పని చేస్తున్న ఐశ్వర్యకు పెళ్ళి సంబంధాలు చూస్తున్నారు. ఇంతలోనే ఈ ఘాతుకం జరిగిపోయింది. అమెరికాలో దుండగుల తుపాకి కాల్పులకు పిల్లలను, ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలు అసంఖాకంగా వున్నాయి. వీరిలో అమెరికా బయటి దేశాలకు చెందిన వారు కూడా గణనీయంగానే వుంటారు.

ఈ సంఖ్య ఇంకా పెరుగుతూనే వుంటుంది గాని, ఆగే అవకాశం బొత్తిగా లేదు. ఎందుకంటే తుపాకీల విచ్చలవిడి అమ్మకాన్ని ఏ ప్రభుత్వమూ నిషేధించజాలదు. ఆ వ్యాపార వర్గం అంతటి బలమైనది. 2022 మేలో టెక్సాస్‌లోని ఒక ప్రాథమిక పాఠశాలలో సంభవించిన కాల్పుల్లో 19 మంది పిల్లలు, ఇద్దరు పెద్దవారు దుర్మరణం పాలయ్యారు. అప్పుడు అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మాట్లాడుతూ రిపబ్లికన్ పార్టీ వల్ల, తుపాకీలమ్మి సొమ్ము చేసుకొంటున్న గన్ లాబీ వల్ల దేశానికి పక్షవాతం దాపురించిందని అన్నారు. శాండీహుక్ ఘటన జరిగిన పదేళ్ళ తర్వాత, బఫలో దుర్మార్గం సంభవించిన పది రోజుల పిదప ఇప్పటికీ దేశం నిస్సహాయ స్థితిలోనే వుందని అప్పట్లో ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

2012 డిసెంబర్ 14న శాండీహుక్ ప్రాథమిక పాఠశాలలో ఆడం లాంజా అనే 20 సంవత్సరాల యువకుడు జరిపిన కాల్పులకు 28 మంది బలయ్యారు, ఇద్దరు గాయపడ్డారు. మృతుల్లో 20 మంది పాఠశాల విద్యార్థులు. బఫలోలో 18 ఏళ్ళ యువకుడు జరిపిన కాల్పుల్లో 10 మంది నల్లవారు ప్రాణాలు కోల్పోయారు. ఇలా అమెరికాలో ఏటా కొన్ని పదుల సంఖ్యలో జరుగుతున్న ఉన్మాదుల కాల్పుల్లో లెక్కలేనంత మంది అమాయకులు మరణిస్తున్నారు. ఈ ఏడాది అమెరికాలో ఇంత వరకు 200 కాల్పుల సంఘటనలు సంభవించాయని, ప్రతి సంఘటనలోను కనీసం నలుగురు అంతకంటే ఎక్కువ మంది మరణించారని సమాచారం. గత మూడేళ్ళల్లో ఏటా 600 మూక హత్యల కాల్పుల ఘటనలు చోటు చేసుకొన్నాయి. ఒక్క 2021లోనే తుపాకి కాల్పులకు సంబంధించిన ఘటనల్లో అమెరికాలో 48,830 మంది మరణించారు. 2018లో సేకరించిన లెక్కల ప్రకారం అమెరికాలో ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో 39 కోట్ల తుపాకులున్నాయి. 20192021 మధ్య అదనంగా 75 లక్షల మంది తుపాకీలను సమకూర్చుకొన్నట్టు సమాచారం.

అమెరికాలోని మెజారిటీ ప్రజలు విచ్చలవిడి తుపాకి లైసెన్సుల విధానాన్ని వ్యతిరేకిస్తున్నారు. కాని వారి అభిమతం నెరవేరడం లేదు. డెమొక్రాటిక్ పార్టీకి చెందిన వారిలో అధిక సంఖ్యాకులు తుపాకీని అదుపులోకి తీసుకు రావలసి వుందని భావిస్తుండగా, రిపబ్లికన్లలో అత్యధికులు అందుకు విరుద్ధంగా వున్నారు. గత నెలలో తుపాకి వ్యాపారుల లాబీ నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఇండియానాపోలిస్‌లో జరుపుకొన్న వార్షిక సమావేశానికి అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఫ్లోరిడా గవర్నర్ హాజరయ్యారు. ఒకప్పుడు చిన్న ఔత్సాహిక రైఫిల్ షూటింగ్ సంస్థగా మొదలైన నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆ తర్వాత అతి పెద్ద తుపాకి తయారీదార్ల సంస్థగా మారి అమెరికా రాజకీయాలనే ప్రభావితం చేస్తున్నది. తుపాకీల వ్యాపారాన్ని అరికట్టాలని, పౌరులకు ఎటువంటి ఆంక్షలు లేకుండా తుపాకులను విక్రయించే విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేసే వారి నోరు మూయించడానికి ఈ సంస్థ విశేష ప్రాధాన్యమిస్తుంది. ఇందుకు అవసరమైన లాబీయింగ్ కింద నేషనల్ రైఫిల్ అసోసియేషన్ 2021లో 4.2 మిలియన్ డాలర్లు ఖర్చు పెట్టింది.

ఈ సంస్థకు వ్యతిరేకంగా బాధితుల తరపున ఏర్పాటైన సంస్థ కూడా రోజురోజుకీ బలపడుతున్నది. పాలకులను ప్రభావితం చేసి తుపాకి స్వేచ్ఛను అరికట్టడం కోసం వీరు 30 లక్షల మందిని సభ్యులుగా చేర్చుకోవాలని ప్రయత్నిస్తున్నారు. నేషనల్ రైఫిల్ అసోసియేషన్ మాత్రం అమెరికన్ పౌరులు విధిగా తుపాకీని కలిగి వుండడం అమెరికా ఔన్నత్యానికి, భద్రతకు నిదర్శనమని వాదిస్తుంటుంది. ఈ స్వేచ్ఛను అరికడితే తాను కాల్చుకొని చస్తానని అసోసియేషన్ నాయకుడొకరు గతంలో హెచ్చరించి వున్నాడు. ఘాతుక కాల్పులు జరుపుతున్న వారిలో ఎక్కువ మంది పిల్లలే. వారిని మానసికంగా వికృత పరుస్తున్న అంశాలేమిటో సరైన పరిశోధన జరగాలి. అమెరికా బతుకే ఆయుధాల మీద ఆధారపడి వుంది. దేశ దేశాలకు ఆయుధాలు అమ్మి సొమ్ము చేసుకొనే మృత్యుబేహారి అమెరికా. 2020లో దాని ఆయుధాల అమ్మకాల కిమ్మత్తు 285 బిలియన్ డాలర్లు. ఎంత గొప్ప ప్రజాస్వామ్యమని చెప్పుకొన్నా ప్రజల ప్రాణాలను బలి తీసుకొనే ఆయుధాల మీద ఆధారపడి బతకడం కంటే హేయమైనది ఏముంది?

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News