హైదరాబాద్ : ప్రతిష్టాత్మక ఏజియాస్ ఫెడరల్ లైఫ్ ఇన్సూరెన్స్ హైదరాబాద్ హాఫ్ మారథాన్ 2023 ఆదివారం నగరంలో జరిగింది. తెలంగాణకు చెందిన బి రమేష్ చంద్ర, మహారాష్ట్రకు చెందిన ప్రజక్తా గాడ్‌బోలే మారథాన్‌లో విజయం సాధించారు. రమేష్ చంద్ర 21.1 కిలోమీటర్ల దూరాన్ని ఒక గంట 13 నిమిషాల 10 సెకన్లలో పరుగుపెట్టి హాఫ్ మారథాన్ చాంపియన్‌గా నిలిచారు. సతీష్ కుమార్ (1.15:50), పీయూష్ మసానే (1.16:56)
ఈ విభాగంలో మిగిలిన రెండు స్థానాలను కైవసం చేసుకున్నారు. మహిళల్లో 28 ఏళ్ల ప్రజక్తా గాడ్‌బోలే హాఫ్ మారథాన్ ను ఒక గంట 23 నిమిషాల 45 సెకన్లలో అధిగమించారు. క్రికెట్ దిగ్గజం, ఏజియాస్ ఫెడరల్ లైఫ్ ఇన్సూరెన్స్ బ్రాండ్ అంబాసిడర్, సచిన్ టెండూల్కర్ తెల్లవారుజామున జెండా ఊపి హాఫ్ మారథాన్‌ను ప్రారంభించారు. ఈ రన్‌లో 8,000 మందికి పైగా రన్నర్‌లు పాల్గొన్నారు. ఈ రన్ ముగిసిన తరువాత సచిన్, భారత బ్యాడ్మింటన్ జట్టు చీఫ్ నేషనల్ కోచ్ పుల్లెల గోపీచంద్‌తో కలిసి హాఫ్ మారథాన్ విజేతలను సత్కరించారు.