Monday, January 20, 2025

మెడికల్ టూరిజానికి హబ్‌గా మారిన హైదరాబాద్

- Advertisement -
- Advertisement -
క్రమంగా పెరుగుతున్న నగరానికి వచ్చే విదేశీ రోగులు
తక్కువ ఖర్చుతో అంతర్జాతీయ స్థాయి వైద్య సేవలు

హైదరాబాద్ : మెడికల్ టూరిజం ప్రధాన హబ్‌గా హైదరాబాద్ నగరం మారింది. కొవిడ్ పరిస్థితుల తర్వాత నగరానికి వచ్చే విదేశీ రోగులు క్రమంగా మళ్లీ పెరుగుతున్నారు. ఒకప్పుడు అమెరికా వంటి అగ్రదేశాలలోనే అత్యాధునిక చికిత్సలు, శస్త్రచికిత్సలు అందుబాటులో ఉండగా, ఇప్పుడు హైదరాబాద్ కేంద్రంలో అంతర్జాతీయ స్థాయి వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. బంగ్లాదేశ్, ఇరాక్ దేశాల నుంచి పెద్ద సంఖ్యలో రోగులు వైద్య చికిత్సల కోసం నగరానికి వస్తున్నారు. పలు దేశాల నుంచి నేరుగా సకాలంలో నగరానికి చేరుకునే సదుపాయం లేక ఢిల్లీ, ముంబై, బెంగళూరు నగరాల మీదుగా హైదరాబాద్‌కు చేరుకుంటున్నారు. మోకాలు మార్పిడి, నడుంనొప్పి, మెకాలు కొప్పి వంటి ఆరోగ్య సమస్యకు అత్యాధునిక వైద్య సేవలు నగరంలో లభిస్తున్నాయి. గుండె జబ్బులు, కాలేయ సంబంధిత వ్యాధులు, జీర్ణకోశ వ్యాధులకు అమెరికా, యూరోప్ దేశాల కంటే తక్కువ ఖర్చులతో నాణ్యమైన, మెరుగైన వైద్య సేవలు నగరంలోని కార్పోరేట్ ఆసుపత్రులు అందిస్తున్నాయి. దాంతో చాలా మంది నగరంలో పేరొందిన ఆస్పత్రులకు వస్తున్నారు. దీంతో హైదరాబాద్ మెడికల్ టూరిజానికి కేంద్ర బిందువుగా మారింది.
నగరం వైపు దేశ విదేశీ రోగుల చూపు
అత్యాధునిక వైద్య సేవలకు హైదరాబాద్ కేరాఫ్ అడ్రస్‌గా మారుతోంది. హైదరాబాద్ నగరంలోని ప్రముఖ ఆసుపత్రుల్లో నాణ్యమైన సౌకర్యాలు, అంతర్జాతీయ స్థాయి వైద్య సేవలు అందుబాటులో ఉండటంతో చాలా దేశాల ప్రజలు వైద్యం కోసం హైదరాబాద్ వైపు చూస్తున్నారు. కరోనా సమయంలో ఊపిరితిత్తులు పాడై చావు బతుకుల్లో ఉన్న బిహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి రోగులను ఎయిర్ అంబులెన్స్‌ల ద్వారా నగరానికి తరలించి ప్రాణాలు కాపాడిన సంఘటనలున్నాయి. దాదాపు 30 నుంచి -40 మంది రోగులకు నగర ఆసుపత్రుల్లో ఊపిరితిత్తుల మార్పిడి చేశారు. సాధారణంగా విదేశీ రోగులు నేషనల్ అక్రిడియేషన్ బోర్డు ఫర్ హాస్పిటల్స్ (ఎన్‌ఎబిహెచ్)లో ఉన్న ఆసుపత్రులకు వెళ్లేందుకు ఆసక్తి చూపుతుంటారు. ప్రస్తుతం నగరంలో నెలకు వందల సంఖ్యలో మోకాళ్ల మార్పిడి, నడుం నొప్పి, మోకాళ్ల నొప్పికి అంతర్జాతీయ స్థాయి చికిత్సలు, శస్త్రచికిత్సలు జరుగుతున్నాయి. అవయవ మార్పిడీల్లోనూ నగరం దూసుకుపోతోంది. అధునాతమైన ఆపరేషన్ థియేటర్లు, పరికరాలు, నిపుణులైన వైద్యులకు ఇక్కడ కొరత లేదు. విదేశాల్లో దశాబ్దాల అనుభవం ఉన్న వైద్యులు నగర ఆసుపత్రుల్లో అందుబాటులో ఉన్నారు. ఈ నేపథ్యంలో విదేశీ రోగులకు మరింత సేవలు అందేలా పలు కార్పొరేట్ ఆసుపత్రులు ట్రాన్స్‌లేటర్లను సైతం నియమిస్తున్నాయి.
నగరానికి ఏటా 50 వేల మంది విదేశీ రోగులు
వైద్య చికిత్సల కోసం ఏటా సుమారు 2 లక్షల మంది విదేశీ రోగులు దేశంలోని పలు ఆస్పత్రులకు వస్తుంటారు. వారిలో 50 వేల మందికి పైగా హైదరాబాద్‌కే వస్తున్నట్టు అంచనా. ఆఫ్రికా, ఇథియోపియా, నైజీరియా, ఒమన్, ఖతర్, కంబోడియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్, ఇరాన్, ఇరాక్, మస్కట్, దోహ, సౌదీ, సూడాన్, సింగపూర్, ఇండోనేషియా, థాయ్‌లాండ్, మాల్దీవులు తదితర దేశాల నుంచి రోగులు ఎక్కువగా నగరానికి వస్తారు. గత కొన్ని సంవత్సరాలుగా ఢాకా, బాగ్దాద్‌ల నుంచి వచ్చే రోగుల సంఖ్య పెరిగింది. విదేశాలలో లభించే వైద్య సేవలు హైదరాబాద్‌లోని ప్రముఖ ఆసుపత్రుల్లో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో లభిస్తుండటంతో నగరానికి వచ్చేందుకు దేశవిదేశాలకు చెందిన రోగులు ఆసక్తి కనబరుస్తున్నారు.
వైద్య పరికరాల ఉత్పత్తి కేంద్రంగా ‘మెడికల్ డివైజెస్ పార్క్’
రాష్ట్రాభివృద్ధికి ఉన్న అవకాశాలను గుర్తించడంలో, వాటిని అందిపుచ్చుకోవడంలో తెలంగాణ ప్రభుత్వం ముందుంటున్నది. భవిష్యత్ అవసరాలను గమనిస్తూ అవకాశాలున్న రంగాలను ప్రోత్సహిస్తున్నది. ఈ క్రమంలోనే వైద్య పరికరాల ఉత్పత్తిని విశేషంగా ప్రోత్సహిస్తున్నది. రాష్ట్రాన్ని వైద్య పరికరాల ఉత్పత్తి కేంద్రంగా మార్చేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ సారథ్యంలో మంత్రి కెటిఆర్ తీసుకుంటున్న చొరవతో సుల్తాన్‌పూర్‌లో రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ‘మెడికల్ డివైజెస్ పార్క్’ అంతర్జాతీయంగా పెట్టుబడులను ఆకర్షిస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్న వ్యాక్సిన్లలో హైదరాబాద్‌లోనే మూడో వంతు ఉత్పత్తి అవుతుండటం తెలంగాణకే గర్వకారణం. అయితే, వైద్య పరికరాల విషయంలో మాత్రం దిగుమతులపై ఆధారపడుతున్నది.

కొవిడ్ సమయంలో వైద్య పరికరాల దిగుమతి మరింత పెరిగింది. దీన్ని గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం వ్యాక్సిన్ల ఉత్పత్తికి కేంద్రంగా ఉన్న తెలంగాణ రాష్ట్రం, ఇక వైద్య పరికరాల ఉత్పత్తికి కేరాఫ్ అడ్రస్‌గా మారాలని సంకల్పించింది. ఇందులో భాగంగానే హైదరాబాద్ నగరానికి సమీపంలోని సుల్తాన్‌పూర్‌లో 302 ఎకరాల్లో మెడికల్ డివైజెస్ పార్కును ఏర్పాటు చేసింది. ఇది దేశంలోనే అతి పెద్ద మెడికల్ డివైజెస్ పార్కు. దేశానికి చెందిన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో పాటు అంతర్జాతీయ సంస్థలు కూడా ఇక్కడ కంపెనీలను స్థాపిస్తున్నాయి.వైద్య చికిత్సకు అయ్యే ఖర్చులో వైద్య పరికరాల వాటా ఎక్కువగా ఉంటుంది. మన దగ్గరే ఉత్పత్తులు ప్రారంభమై అందుబాటులోకి వస్తే నాణ్యమైన వైద్య పరికరాలు, డయాగ్నోస్టిక్ సాధనాలు తక్కువ ధరలకే లభిస్తాయి. దీంతో ప్రజలకు వైద్య చికిత్స ఖర్చు కూడా తగ్గి మేలు జరుగుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News