Saturday, December 21, 2024

అంతర్జాతీయ పరిశ్రమలకు వేదికగా మారిన హైదరాబాద్

- Advertisement -
- Advertisement -

పటాన్ చెరు: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగిన 9 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రం అంజర్జాతీయ పరిశ్రమలకు వేదికగా మారిందని మెదక్ ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డి చెప్పారు. తెలంగాణ అవతరణ దశాబ్ది దినోత్సవంలో భాగంగా మంగళవారం పటాన్‌చెరు జిఎంఆర్ ఫంక్షన్ హాల్‌లో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన పరిశ్రమల ప్రగతి ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ 14 సంవత్సరాలు పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం సిఎం కెసిఆర్ నాయకత్వంలో అన్నిరంగాల్లో అభివృద్ధి సాధించిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టాలంటే కార్యాలయాల చుట్టు తిరుగాల్సి ఉండేదన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో నూతన పారిశ్రామిక విధానాలతో పారిశ్రామిక వేత్తలు సంతోషంగా ఉన్నారన్నారు. విద్యుత్ కోతలు లేకపోవడంతో ఉత్పత్తులు పెరిగాయన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానల వల్ల పారిశ్రామిక రంగానికి ముప్పు వాటిల్లుతుందని ఆవేదన చెందారు.9 ఏళ్ళ పారిశ్రామిక ప్రగతిని ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ పటాన్‌చెరు ప్రాంతం కాలుష్య ప్రాంతంగా ఉండేదన్నారు. అటువంటి ప్రాంతాన్ని 9 ఏళ్ళలో కాలుష్యరహిత ప్రాంతంగా మార్చామన్నారు. సిఎం కెసిఆర్ తీసుకొచ్చిన మార్పుల కారణంగా 90 శాతం కాలుష్య రహిత పరిశ్రమలు ఈ ప్రాంతాని వచ్చాయన్నారు.

సుల్తాన్ పూర్‌లో ఏర్పాటు చేసిన కాలుష్యరహిత పరిశ్రమలతో ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్పారు. నూతన పరిశ్రమలు ఏర్పాటుకు ప్రభుత్వం కేవలం 15 రోజుల్లోనే అనుమతులు మంజూరు చేస్తుందన్నారు. టిఎస్ ఐపాస్ విధానం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. పరిశ్రమలు అందించే సిఎస్‌ఆర్ నిధులతో నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తున్నట్టుగా తెలిపారు. జిల్లా కలెక్టర్ శరత్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో పరిశ్రమలు వచ్చాయన్నారు. గతంలో పరిశ్రమల యాజమాన్యంతో సమావేశం నిర్వహిస్తే సమస్యల చిట్టా విప్పేవారన్నారు.ప్రస్తుత ప్రభుత్వ హయాంలో ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కావడం లేదన్నారు.

కొత్త పరిశ్రమల ఏర్పాటుకు ఔత్సాక పారిశ్రామిక వేత్తలు ఉత్సహం చూపుతున్నారని, ముఖ్యంగా మహిళలు పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వస్తున్నారని చెప్పారు. జిల్లాలో 2572 పరిశ్రమల్లో 1.88.191 మంది ఉపాధి పొందుతున్నారని తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు ప్రభాకర్, సుష్మశ్రీ వేణుగోపాల్ రెడ్డి, ప్రవీణ విజయభాస్కర్ రెడ్డి, సుప్రజా వెంకట్ రెడ్డి, దేవానంద్, మెట్టు కుమార్, పుష్ప నగేశ్, పాండు రంగారెడ్డి, లలిత సోమిరెడ్డి ,సర్పంచ్‌లు పార్టి నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News