హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత హైదరాబాద్ నగరం వేగంగా అభివృద్ధి చెందుతున్నదని రాష్ట్ర ఐటి పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ అన్నారు. చాలామంది సిటిజన్స్ హైదరాబాద్ అభివృద్ధిపై సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని తెలిపారు. నగర విస్తరణకు తగ్గ విధంగా మౌలిక వసతుల కల్పన కోసం ప్లాన్ చేస్తున్నామన్నారు. లేదంటే బెంగళూరు తరహాలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుందని సూచించారు. ట్రాఫిక్ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఎస్ఆర్డీపీ కార్యక్రమాన్ని తీసుకున్నామని చెప్పారు. 8వేల52 కోట్లతో 47 ప్రాజెక్టులు చేపట్టం, ఉప్పల్ ఎల్బీనగర్ ప్రాంతాల్లోనే 16 ప్రాజెక్టులు ఉన్నాయని పేర్కొన్నారు. రెండవ దశలో 12 ప్రాజెక్టులను చేపడుతున్నాం, మొత్తం 32 ప్రాజెక్టులు పూర్తికగా 16 ఫ్లై ఓవర్లు ఉన్నాయన్నారు. హైదరాబాదు నుంచి విజయవాడ వెళ్లే వారికి గతంలో చాలా ట్రాఫిక్ కష్టాలు ఉండేటివి ఇప్పుడు అవి తగ్గిపోయాయని వెల్లడించారు. ఎల్బీనగర్ నియోజకవర్గం 700 కోట్లకు పైగా ఖర్చు చేసి 9 ప్రాజెక్టులు పూర్తి చేశామని మంత్రి వివరించారు. రాబోయే నాలుగైదు నెలల్లో ఈ ప్రాంతంలోని ప్రాజెక్టులు అందుబాటులోకి వచ్చేలా చూస్తామని కెటిఆర్ తెలిపారు.
ఎల్బీనగర్ ప్రాంతంలో 600 కోట్లు ఖర్చు చేసి తాగునీటి సమస్య లేకుండా చేశామన్న మంత్రి హైదరాబాద్ నగరం భారత దేశంలో శరవేగంగా ఎదుగుతున్న నగరమన్నారు. భవిష్యత్ తరాలకు మెరుగైన వసతులు ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నాము. హరితహారంలో మనం తీసుకున్న చర్యల్లో భాగంగా ప్రపంచంలోనే చాలా నగరాలను వెనక్కి నెట్టి వరల్డ్ గ్రీన్ సిటీగా హైదరాబాద్ కు గుర్తింపు రావడం గర్వకారణం అన్నారు. మౌలిక వసతులతో పాటు దీర్ఘకాలంగా ఉన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామన్నారు. ఎల్బీనగర్ ప్రాంతంలో ఉన్న రిజిస్ట్రేషన్ల సమస్య పరిష్కారానికి పట్టాల సమస్య పరిష్కారానికి చర్యలు చేపడతామని మంత్రి కెటిఆర్ తెలిపారు. రెండు రోజుల్లో జీవో ఇచ్చి సమస్య పరిష్కారానికి కృషి చేస్తాం, రాజకీయాలు ఎన్నికల అప్పుడు చేద్దాం, ప్రజల అభివృద్ధి కోసం పార్టీలకు అతీతంగా పనిచేయాలని మంత్రి కెటిఆర్ పిలుపునిచ్చారు. ప్రజా ప్రతినిథిలందరూ కలిసి పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యమని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు.