హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి కౌలాలంపూర్ బయల్దేరిన మలేషియా ఎయిర్‌లైన్స్ విమానానికి పెను ప్రమాదం తప్పింది. బుధవారం అర్థరాత్రి దాటిన తరువాత సుమారు ఒంటి గంట సమయంలో ఫ్లైట్ టేకాఫ్ అయిన 15 నిమిషాలకే కుడివైపు ఇంజన్‌లో మంటలు వచ్చాయి. దీనిని గమనించిన పైలెట్ అప్రమత్తమయ్యాడు. వెంటనే ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కు అనుమతి ఇవ్వాలని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ రూంను కోరారు. అప్పుడే టేకాఫ్ అయిన ఫ్లైట్ కొద్ది నిమిషాల్లోనే ల్యాండింగ్‌కు అనుమతి కోరడంతో కొద్దిసేపు గందరగోళ పరిస్థితి నెలకొంది. విమానంలో ఇంధనం అధికంగా ఉండటంతో ల్యాండింగ్ సమయంలో మంటలు చెలరేగుతాయని భావించి సుమారు మూడు గంటలపాటు గాలిలోనే చక్కర్లు కొట్టించారు. అనంతరం ప్రమాద తీవ్రతను గుర్తించి మలేషియా ఎయిర్‌లైన్స్ విమానానికి ఎటిసి అధికారులు ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కు అనుమతి ఇచ్చారు.
అప్పటి వరకూ విమానంలో ఉన్న ప్రయాణికులు, సిబ్బంది తీవ్ర ఆదోళనకు గురయ్యారు. అసలు ఏం జరుగుతుందో తెలుసుకొని భయపడిపోయారు. అయితే ఎటిసి అధికారులు ల్యాండింగ్‌కు అనుమతి ఇవ్వడంతో మలేషియా ఎయిర్‌లైన్స్ విమానం సేఫ్‌గా ల్యాండ్ అయ్యింది. అప్పటి వరకూ ప్రాణాలను అరచేతిలో పట్టుకొని భయపడిన 130 మంది ప్రయాణికులు, విమాన సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. విమానం ఇంజన్‌లో మంటలు గుర్తించి ఎటిసి అధికారులను అప్రమత్తం చేసి తెల్లవారుజామున 3.58కి సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. విమానాన్ని ల్యాండింగ్ చేసిన పైలెట్‌కు ప్రయాణికులు కృతజ్ఞతలు తెలిపారు. దీంతో పెను ప్రమాదం తప్పినట్లు అయ్యింది. విమానం ఇంజన్‌లో మంటలు చెలరేగిన ఘటనను ప్రయాణికుడు ఒకరు వీడియో తీసి.. దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడా వీడియో వైరల్ అయ్యింది.