హైదరాబాద్: మేఘాలయతో జరుగుతున్న రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో హైదరాబాద్ కీలకమైన తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించింది. షిల్లాంగ్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో హైదరాబాద్ శుక్రవారం తొలి రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. హైదరాబాద్‌కు ఇప్పటికే 71 పరుగుల కీలకమైన తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. ఒక దశలో 43 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకున్న హైదరాబాద్‌ను రోహిత్ రాయుడె, చందన్ సహాని ఆదుకున్నారు.
ధాటిగా ఆడిన చందన్ సహాని 65 బంతుల్లో ఆరు ఫోర్లు, రెండు సిక్సర్లతో 52 పరుగులు చేశాడు. సమన్వయంతో బ్యాటింగ్ చేసిన రోహిత్ రాయుడు 54 పరుగులతో క్రీజులో ఉన్నాడు. అతనికి వికెట్ కీపర్ ప్రఘ్నయ్ రెడ్డి 32 (నాటౌట్) అండగా నిలిచాడు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన మేఘాలయ మొదటి ఇన్నింగ్స్‌లో 33.1 ఓవర్లలో కేవలం 111 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్ కిషన్ (51) ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. హైదరాబాద్ బౌలర్లలో సాయిరాం నాలుగు, మిలింద్, రవితేజ, త్యాగరాజన్ రెండేసి వికెట్లు తీశారు.