గత కొన్నేళ్లుగా ప్రతి సంవత్సరం నగరంలో జరుగుతున్న హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ ఈ యేడు జనవరి 26న మొదలై 28న ముగిసింది. హైదరాబాద్ నగరానికే వన్నెతెచ్చేలా నిర్వహించబడే ఈ ఉత్సవంలో కళలు, సాహిత్యం, సంస్కృతులపై ఎన్నో కార్యక్రమాలు ఏర్పాటవుతాయి. సృజనాత్మకతకు పెద్ద పీట వేసే కార్యక్రమంగా దీనిని పేర్కొనవచ్చు. వివిధ రాష్ట్రాల్లోని భారతీయులే కాకుండా విదేశాల నుండి కూడా వందమందికి పైగా రచయితలు, కళాకారులు, విద్యావేత్తలు, పండితులు, ప్రచురణకర్తలు పాల్గొనే వైవిధ్య, బహుభాషా వేదిక ఇది. 2010లో ప్రారంభమైన ఈ ఉత్సవం దేశంలోని సాంస్కృతిక రంగంలో ఒక ముఖ్యమైన కార్యక్రమంగా పేరొందింది. ఈ వేడుక ప్రతిసారి ఒక దేశాన్ని, మన దేశంలోని ఒక భాషను ఎంచుకొని వాటికి ప్రాధాన్యతనిస్తోంది. ఈ యేడు నార్వే దేశ సంస్కృతిపై, ఒడియా భాష సాహిత్యంపై ఉత్సవం కేంద్రీకృతమైంది. ఈసారి హైటెక్ సిటీలోని సత్వ నాలెడ్జ్ సిటీ ఈ వేడుకలకు వేదిక అయింది.
సాహిత్యం, కళల ప్రధానంగా సాగే హెచ్‌ఎల్‌ఎఫ్ 14వ వార్షిక ఉత్సవంలో సైన్స్, వాతావరణంపై దృష్టి సారించే చర్చలు, ప్రదర్శనలు జరిగాయి.ఒడియా జీవనసరళి, పౌరుల నడవడి, మహిళల గౌరవం, వన్యప్రాణి సంరక్షణ, జీవశాస్త్రవేత్తల పరిశోధనలు, ఆహార సంస్కృతులపై చర్చలు సాహిత్య ఉత్సవంలో భాగంగా జరిగాయి. ఈ వేడుకలో తాము పరిమిత అంశాలపై కాకుండా బహుళ, విభిన్న, వైవిధ్య కోణంలో వెళ్తామని ఉత్సవ నిర్వాహకులు చెప్పినట్లు ఎన్నో విధాల వేడుకల్ని, స్టాళ్లను ఏర్పాటు చేశారు. సాహిత్యం, కథలు చెప్పడం, పుస్తకపరిచయం, అంతరించిపోతున్న భాషలు, కావ్యధార, కదిలే బొమ్మలు, బాలల ఆసక్తికర విషయాలు ఇలా 15 విభిన్న అంశాలు అలరించాయి. నుక్కడ్, యంగిస్తాన్ నుక్కడ్, సైన్స్ అండ్ సిటీ, వేదికలపై చర్చలు, కార్యశాలలు, ఎగ్జిబిషన్‌లు మూడు రోజుల పాటు నిరంతరంగా కొనసాగాయి. 2022 -32 దశాబ్దాన్ని ఐరాస ‘అంతర్జాతీయ దేశీయ భాషల దశాబ్దం’గా ప్రకటించింది. స్థానిక, దేశీయ భాషలను వాడుకలో సజీవంగా ఉంచలేకపోతే 2100 నాటికి 50 % ఆ భాషలు అంతరించిపోయే ప్రమాదం ఉందని ఐరాస హెచ్చరించింది.
ఈ తీవ్రతను గ్రహించిన పండుగ పెద్దలు దానికి అనుగుణంగా పలు భాషావేత్తల ప్రసంగాలు ఏర్పాటు చేశారు. ఇందులో అండమాన్ ఆదివాసీ కవయిత్రి జసింతా కెర్కెట్టా, జర్నలిస్ట్ నిధి దుగర్ కుండలియా, సంతాలి రచయిత్రి దమయంతి బెష్రా, పాత్రికేయుడు కస్తూరి రే పాల్గొన్నారు. వీరితో పాటు గోండు కళాకారులు దుర్గాభాయ్ వ్యామ్ మరియు సుభాస్ వ్యామ్, సంతాలీ రచయిత హంసదా సౌవేంద్ర శేఖర్, అనేక మంది పఠనాలు ఆకట్టుకున్నాయి. తల్లి భాషను విస్మరిస్తే తాము ఎక్కడి నుంచి వచ్చామనే మూలాలు మరిచిపోయే ప్రమాదం ఉందని, అమ్మ భాష గొప్పదనాన్ని తెలిపే పుస్తకాలు పిల్లలతో చదివించాలని, విద్యాసంస్థల్లో కూడా ఈ ఏర్పాటు చేయాలనీ దమయంతి బెష్రా అన్నారు. ఇంతవరకు అతిథులుగా చైనా, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, బ్రిటన్ లాంటి దేశాలు ఆహ్వానించబడ్డాయి. ఆయా దేశాల సాహిత్యం, కళలు, సంస్కృతిపై విస్తృత చర్చలు నిర్వహించబడ్డాయి.చర్చనీయ దేశీయ భాషలుగా ఇప్పటిదాకా తెలుగు, హిందీ, ఉర్దూ, మరాఠి తదితర భాషల మూలాలు, అభివృద్ధి, సాహిత్యంపై ఆయా భాషల నిష్ణాతులతో ప్రసంగాలు నిర్వహించారు.
ఈసారి ఆదిమ, అంతరించిపోతున్న భాషలు, వాతావరణ సంరక్షణ, నగరంలో వైజ్ఞానిక అభివృద్ధి -దాని ప్రభావం అనేవి ప్రధాన అంశాలుగా చర్చలు, ప్రదర్శనలు జరిగాయి. 27న సి నారాయణరెడ్డి గజల్స్ గానంతో సాహితి వేడుక గుభాళించింది. బాలలకు పక్షుల సంరక్షణ గురించి తెలిసేలా, ఒక ప్రతిజ్ఞకు సంకేతంగా మట్టితో చేసిన పావురాలపై తెల్ల రంగును పూయించారు. సేవ్ రాక్ సొసైటీ ద్వారా పిల్లలకు గుట్టలు గుర్తుండేలా ప్రదర్శనలతో పాటు ఇష్టపడే వారికి రాళ్ల రూపంలో పచ్చబొట్లు వేశారు. బిజినెస్ స్టాళ్లలో సాంప్రదాయిక ఉత్పత్తులు, వస్త్రాలు, వాల్ పెయింటింగ్స్, తెలుగు, ఇంగ్లీష్ పుస్తకాలు పరిమితంగా ఉన్నాయి. హైదరాబాద్ ఆన్ వీల్స్ అనే బస్సులో ఏర్పాటు చేసిన ప్రదర్శనశాల ఆకట్టుకుంది. అందులో నగరంలోని వారసత్వ సంపదలైన చార్మినార్, గోల్కొండతో పాటు నగర ప్రకృతిని చూపే ఛాయాచిత్రాలు ఉన్నాయి. నల్ల, తెల్ల గొంగడులపై వేసిన గ్రామీణ చిత్రాలు కళాత్మకంగా ఉన్నాయి. ఆరు బయలులో వేదికలు, ప్రదర్శనలు, స్టాళ్లతో పాటు పైఅంతస్తుల్లోని హాళ్లలో తెరపై డాక్యుమెంటరీలు, సంగీత వాద్యాల, జానపద నృత్యాల ప్రదర్శనలు, బొమ్మల తయారీ శిక్షణ తదితరాలు ఏర్పాటు చేశారు.
ముందే అంశాలు నిర్ణయించి వాటికి తగిన వక్తలు ఎంపిక చేసి చర్చ వేదికలు, కార్యక్రమాలు నిర్వహించడం వల్ల ఆసక్తిపరులు కావాల్సినవి ఎంచుకొనే అవకాశం కలిగింది. ఉచితంగా ప్రవేశం గల ఈ ఉత్సవ ద్వారం వద్దే మూడు రోజుల కార్యక్రమాల వివరాలతో కూడిన పుస్తకం ఈయడంతో జాతరలో తిరిగినట్లు కాకుండా సమయానికి వేదిక వద్దకెళ్లే వెసలుబాటు దొరికింది. ఖరీదైన ఈ వేడుక నిర్వహణకు నగరంలోని పెద్ద సంస్థలు ఆర్థికంగా తోడు నిలిచాయి. దీనికి డా.రెడ్డీస్ సంస్థ ప్లాటినం స్పాన్సర్ కాగా గోథె జెంత్రం, సత్వ నాలెడ్జి సిటీ, ఎల్ అండ్ టి మెట్రో రైల్, నాక్టో లాంటి కొన్ని సంస్థలు ఖర్చులో ఇతోధికంగా తోడ్పడ్డాయి. దేశంలో జరుగుతున్న ఇలాంటి వంద సాహితీ కళా ఉత్సవాల్లో తొలి అయిదు స్థానాల్లో నిలుస్తున్న హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ నగరానికే తలమానికం. ఫెస్టివల్ డైరెక్టర్స్ అయిన అమిత దేశాయ్, డా.కిన్నెర మూర్తి, డా.టి.విజయ్ కుమార్ సమర్థవంతంగా నిర్వహించి ఈ వేడుకను విజయవంతం చేశారు. ఇంత గొప్పగా సాగే వేడుక ప్రభుత్వ ప్రమేయం లేకుండానే కొనసాగుతోంది.
ఇన్ని ఏర్పాట్లకు తగిన వేదికను ఎంచుకోవడం పెద్ద సమస్యగా మారిందని, ప్రభుత్వం ఉచితంగా శాశ్వత ప్రాతిపదికన ఈ వేడుక జరుపుకొనే తావును ఏర్పాటు చేస్తే నిర్వహణ భారం ఎంతో తగ్గుతుందని నిర్వాహకులు అంటున్నారు. మేధావి వర్గానికే పరిమితమైనట్లు జరుగుతున్న ఈ ఉత్సవం ప్రభుత్వ తోడ్పాటుతో మరిన్ని జన సమూహాలకు చేరువ కావాలి.