హైదరాబాద్: గత ఐదు వేల సంవత్సరాలలో జరిగిన నగరీకరణ రాబోయే 50 ఏళ్లలో జరుగుతుందని మంత్రి కెటిఆర్ తెలిపారు. టైమ్స్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో రీప్లానెట్ ఇపిషియేటివ్ కార్యక్రమంలో మంత్రి కెటిఆర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నగరీకరణతో పట్టణాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఏర్పడిందన్నారు. దేశంలో పట్టణీకరణ వేగంగా జరుగుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ముందు వరుసలో ఉందని ప్రశంసించారు. దేశంలోనే అత్యంత నివాసయోగ్యమైన ఉత్తమ నగరం హైదరాబాద్ కావడం మంచి పరిణామన్నారు.
విశ్వనగరం హైదరాబాద్‌కు ఎన్నో అంతర్జాతీయ అవార్డులు, గుర్తింపు దక్కాయని కెటిఆర్ ప్రశంసించారు. ప్రపంచంలోనే నెంబర్ వన్ ఏకో ఫ్రెండ్లీ నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దుతున్నామన్నారు. హైదరాబాద్‌లో ప్రతీ రోజు 6000 మెట్రిక్ టన్నుల వ్యర్థాలను సేకరిస్తున్నామని వివరించారు. వ్యర్థాలతో కరెంట్ ఉత్పత్తి చేసేందుకు విద్యుత్ ప్లాంట్‌ను ఏర్పాటు చేశామని కెటిఆర్ వివరించారు. తెలంగాణలో 142 మున్సిపాలిటీల్లో ఎఫ్‌ఎస్‌డిపి ప్లాండ్లను ఏర్పాటు చేయబోతున్నామని హామీ ఇచ్చారు. తెలంగాణకు జిడిపి 45 శాతంపైగా అర్బన్ సిటీ నుంచి వస్తుందన్నారు. హైదరాబాద్‌ను బెస్ట్ సిటీ ఆఫ్ ఇండియాగా మారుస్తామన్నారు. గ్రీనరీ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామన్నారు. వాతావరణంలో మార్పుల వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు.