నేడు హైదరాబాద్ స్థానిక సంస్థల
ఎంఎల్‌సి ఎన్నిక బలం లేకున్నా..
బరిలోకి దిగిన బిజెపి బిఆర్‌ఎస్,
కాంగ్రెస్ కార్పొరేటర్లకు తాయిలాల
వల కమలం వలలో ఎంత
మంది పడతారన్నది సందేహమే
మన తెలంగాణ/సిటీ బ్యూరో: స్థానిక సంస్థల కేటగిరిలోని హైదరాబాద్ ఎమ్మెల్సీ నియోజకవర్గానికి రేపు ఓటింగ్ జరగనున్నది. ఈ సీటును దక్కించుకునేందుకు ఎంఐఎం, బీజెపిలు తీవ్రంగా పోటీపడుతున్నాయి. గత మూడు టర్మ్‌లు ఎన్నికలు జరుగకుండా ఏకగ్రీవంగానే ఎమ్మెల్సీ ఎన్నిక జరిగింది. గతంలో ఎంఐఎం కాంగ్రెస్‌లు, ఎంఐఎం బీఆర్‌ఎస్‌లు అవగాహనతో ఉండి ఎమ్మెల్సీ సీ టును ఏకగ్రీవంగా ఎన్నిక జరిగేలా చూసేది. ఇ ప్పుడు కూడా ఎంఐఎం కాంగ్రెస్‌లు అవగాహనతోనే ఉన్నాయి. ఈమారు కూడా ఎమ్మెల్సీ ఎన్నిక ఏకగ్రీవంగానే జరగాల్సిన పరిస్థితులు ఉన్నాయి. కానీ, బీజెపి బరిలోకి దిగి పోటీకి సై అనడంతో ఏకగ్రీవం కావాల్సిన ఎన్నిక కాస్త ఓటింగ్ జరిగే పరిస్థితికి చేరింది. మొత్తం ఒటర్లు 112 ఉండగా వాస్తవానికి బీజెపికి ఓటర్ల బలం కేవలం 24(18 కార్పోరేటర్‌లు+ 6 మంది ఎక్స్‌అఫిషియో సభ్యు లు) మందే ఉన్నారు. ఎంఐఎంకు ఓటర్లు 50(41 మంది కార్పోరేటర్లు, 9 ఎక్స్‌అఫిషియో సభ్యులు) ఉన్నారు. విజయానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 57 ఓట్లు రావాలి.
ఈ నేపథ్యంలో ఈ రెండు పార్టీలకు కూడా ఎమ్మెల్సీ సీటును గెలుచుకునే పూర్తిస్థాయిలో బలం లేదు. కానీ, ఎంఐఎంకాంగ్రెస్ లు అవగాహనతో ఉన్నాయనీ, ఎంఐఎం గెలుపు లాంఛనమేనని, ఇది బీజెపికి తెలియందికాదని ప లువురు కార్పొరేటర్లు తేల్చేస్తున్నారు.ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం గెలుపు తథ్యమని తెలిసినా.. బీజెపి బరిలోకి దిగడం వెనుక బేరసారేలే కారణమని రాజకీయ వర్గాలు వెల్లడిస్తున్నాయి. గెలిచేందుకు కావాల్సిన 33 ఓట్ల కోసం ఈపాటికే బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన కార్పొరేటర్లను, కాంగ్రెస్‌లోకి చేరిన కార్పొరేటర్లను మచ్చిక చేసుకునే పనిలో బీ జెపి నిమగ్నమైనట్టు రాజకీయవర్గాల్లోని అభిప్రా యం. కార్పొరేటర్లకు, ఎక్స్ అఫిషియో సభ్యులకు పలు ఆఫర్‌లు చేసినట్టు కూడా ప్రచారంలోకి వ చ్చింది.ఈ ఆఫర్‌లను
నమ్ముకునే ఓటర్లు లేకున్నా..
ఇతర పార్టీల ఓటర్లపైనే ఆధారపడి బీజెపి రంగంలోకి దిగిందనేది రాజకీయ వర్గాల్లోని ప్రధాన విమర్శ. విద్యాసంస్థలకు చెందిన ఓ ఎమ్మెల్యే మధ్యవర్తిత్వం ద్వారా కార్పోరేటర్ల మద్దతును సాధించే ప్రయత్నాలను బీజెపి ముమ్మరం చేసినట్టు గ్రేటర్ కార్పోరేటర్లలోని అభిప్రాయం. బీజెపిలోని సీనియర్లు కూడా రంగంలోకి దిగి తమకున్న పరిచయాల మేరకు కార్పొరేటర్లతో సంప్రదింపులు జరుపుతున్నారనేది ప్రధానంగా రాజకీయవర్గాల్లోని టాక్. బీజెపి నుంచి బరిలోకి దిగిన అభ్యర్థి నేరుగా కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీల ఓటర్లతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నట్టు స్థానిక ప్రజాప్రతినిధుల్లోని చర్చ జరుగుతున్నది
బీఆర్‌ఎస్సే టార్గెట్..
రానున్న జీహెచ్‌ఎంసి ఎన్నికల్లో కాంగ్రెస్‌ను, బీఆర్‌ఎస్‌ను టార్గెట్ చేసే క్రమంలోనే ఈ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలోకి బీజెపి దిగినట్టు రాజకీయ వర్గాల్లోని అభిప్రాయం. జీహెచ్‌ఎంసి ఎన్నికల్లో ఈ పార్టీల తీరును విమర్శిస్తూ.. సాధ్యమైనన్ని డివిజన్లను కైవసం చేసుకునేందుకు ఇప్పుడు పోటీకి సై అన్నట్టు రాజకీయవర్గాల్లోని చర్చ. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటింగ్‌కు బీఆర్‌ఎస్ దూరముంటే.. ప్రజలచేత ఎన్నుకున్న ప్రజాప్రతినిధులకు స్వేచ్చగా ఓటు వేసే అవకాశం లేకుండా చేసి ప్రజలు కట్టబెట్టిన బాధ్యతలను కూడా హరించింది బీఆర్‌ఎస్ అని, అక్కడున్న నాయకులు, ప్రజాప్రతినిధులకు గాలం వేసే యోచనలో బీజెపి ఉన్నట్టు రాజకీయ వర్గాల్లోని భావన. కాంగ్రెస్‌తో బీఆర్‌ఎస్, ఎంఐఎం పార్టీలు మూడు ఒక్కటేనని ప్రచారం చేసే అవకాశంతో నగర ప్రజల దృష్టిని, మద్దతును కూడగట్టే క్రమంలోనే బీజెపి ఉన్నట్టు కార్పోరేటర్లలోని అభిప్రాయం. ముఖ్యంగా ఎంఐఎంను ముందుకు తీసుకొచ్చి, కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లను టార్గెట్ చేసేందుకు బీజెపి ఈ ఎమ్మెల్సీ ఎన్నికను ఒక చాన్స్‌గా తీసుకుని, గ్రేటర్‌లో తమ బలాన్ని పెంచుకునేందుకు యత్నిస్తున్నట్టు ప్రచారం సాగుతోంది.