ఫిరోజ్‌గూడ పుట్ ఓవర్ బ్రిడ్జిని ప్రారంభించిన మేయర్
హైదరాబాద్: రోడ్లపై పాదచారులు ప్రమాదాల భారిన పడకుండా వారి భద్రత కోసం నగర వ్యాప్తంగా అనేక పుట్ ఓవర్ బ్రిడ్జిలను నిర్మిస్తోందని జిహెచ్‌ఎంసి మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తెలిపారు. గ్రేటర్ వ్యాప్తంగా రూ. 76.65 కోట్ల వ్యయంతో 22 ఫుట్ ఓవర్ బ్రిడ్జి లను చేపట్టగా రూ. 23.10 కోట్ల వ్యయంతో 7 ఫుట్ ఓవర్ బ్రిడ్జి లను పూర్తి కాగా 5 అందుబాటులోకి వచ్చాయన్నారు. శుక్రవారం కూకట్ పల్లి జోన్ బాలానగర్ ఫిరోజ్ గూడ లో రూ. 3.25 కోట్ల వ్యయంతో చేపట్టిన ఫుట్ ఓవర్ బ్రిడ్జిని స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తో కలిసి మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ప్రారంభించారు.ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ నగరంలో ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నమన్నారు. ప్రజలకు మెరుగైన రవాణా కోసం ఫ్లైఓవర్‌లు, ఆర్‌ఓబిలు, ఆర్‌యుబి నిర్మాణం, సిఆర్‌ఎంపి, ఎస్‌ఆర్‌డిపి పనులు చేపట్టామన్నారు.
అంతేకాకుండా మెరుగైన వాతావరణం కల్పించేందుకు చెరువుల సుందరీకరణ, థీమ్ పార్కులు, సిటీ పార్కు లు, వర్టికల్ గార్డె, ఇంచు బై ఇంచు ఇతర కార్యక్రమాల ద్వారా నగరం పచ్చదనం పెంపొందింస్తున్నమని చెప్పారు. ఫిరోజ్ గూడ ఫుట్ ఓవర్ బ్రిడ్జిఅందుబాటులోకి రావడంతో ఫిరోజ్ గూడ, ఫతే నగర్, ఎయిర్ ఇండియా ట్రైనింగ్ స్టాఫ్, ఎంఎంటిఎస్ రైల్వే స్టేషన్ కు వెళ్లే వారికి రోజుకు 5వేల మందికి ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు. ఇప్పటి వరకు మదీనాగూడ, మియాపూర్, పంజాగుట్ట, సికింద్రాబాద్ సెంట్ ఆన్స్ స్కూల్ వద్ద చేపట్టిన ఫుట్ ఓవర్ బ్రిడ్జి లు అందుబాటులోకి వచ్చాయి. కూకట్ పల్లి నియోజక వర్షంలో శాసనసభ్యులు కోరిక మేరకు మూసాపేట్ బస్ స్టాప్(లేబర్ అడ్డ), షాపూర్ నగర్ ఎక్స్ రోడ్డు వద్ద ఫుట్ ఓవర్ బ్రిడ్జి మంజూరు చేస్తామని మేయర్ తెలిపారు.ఈ కార్యక్రమంలో బాలానగర్, ఫతే నగర్ కార్పొరేటర్లు ఆవుల రవీందర్ రెడ్డి, పడాల సతీష్ గౌడ్, జోనల్ కమిషనర్ మమత, ఎస్.ఇ చెన్నారెడ్డి, డిప్యూటీ కమిషనర్ రవి తదితరులు పాల్గొన్నారు.