హైదరాబాద్: బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కీర్తి ప్రతిష్టలను ప్రపంచస్థాయిలో చాటేలా హైదరాబాద్ నగరంలో 125 అడుగుల విగ్రహం ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుకు జిహెచ్‌ఎంసి మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ధన్యవాదాలు తెలిపారు. జూబ్లీహిల్స్ వార్డులో చింతల్ బస్తి ప్రేమ్ నగర్ లో రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీనవర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలవేసి మేయర్ ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ… ఆ మహనీయుడు దేశానికి చేసిన కృషి సాధించిన విజయాలు ఎంతో ఉత్తమమైనవని, భావితరాలు ఆయన ఆదర్శాలను స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు. ఇప్పటివరకు అంబేద్కర్ విగ్రహాల కెల్లా హైదరాబాదులో 125 అడుగుల విగ్రహం ఏర్పాటు చేయడంతో అంతర్జాతీయంగా ఖ్యాతి గడిచిందని మేయర్ తెలిపారు. బి.ఆర్. అంబేద్కర్ సంఘ సంస్కర్తగా, రాజకీయ వేత్తగా, మొదటి దేశ ఆర్థిక మంత్రిగా సేవలందించిన ఆయన దేశ ప్రజలకు ఆదర్శంగా నిలిచారని మేయర్ కొనియాడారు.