Wednesday, January 22, 2025

మెట్రో ఫ్రీ పార్కింగ్ త్వరలో ఎత్తివేత..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ప్రయాణికులకు మరో షాక్ ఇచ్చేందుకు హైదరాబాద్ మెట్రో రెడీ అవుతోంది. ఇప్పటికే డిస్కౌంట్ ఎత్తేసిన ఎల్ అండ్ టీ హైదరాబాద్ మెట్రో మరిన్ని కోతలకు సిద్ధమవుతోంది. మెట్రో పరిసరాల్లోని మాల్స్, మెట్రోకు కేటాయించిన కొన్ని స్థలాల్లో ఇప్పటి వరకు ఫ్రీ పార్కింగ్ సదుపాయాన్ని కల్పిస్తుండగా ఇక నుంచి దానిని ఉపసంహరించుకోవాలని భావిస్తోంది. అందులో భాగంగా ఇక నుంచి పార్కింగ్ ఫీజు వసూలు చేయాలని యోచిస్తోంది. ఇప్పటికే మెట్రో షాపింగ్ మాల్స్ వద్ద పార్కింగ్ ఫీజులకు సంబంధించిన బోర్డులను సైతం ఏర్పాటు చేసింది.

ఎల్ అండ్ టి మెట్రోకు రవాణా ఆధారిత అభివృద్ధి (టిఓడి)లో భాగంగా పలుచోట్ల గవర్నమెంట్ స్థలాలను కేటాయించింది.వీటిలో మాదాపూర్, పంజాగుట్ట, ఎర్రమంజిల్, మూసారాంబాగ్ ఏరియాల్లో మాల్స్ కట్టారు. అక్కడ ఫ్రీ పార్కింగ్ సదుపాయం కల్పిస్తున్నారు. వీటితో పాటు ఉప్పల్, మియాపూర్ డిపోల్లోనూ పార్కింగ్ సౌకర్యం ఉంది. ఈ ప్రాంతాల్లో మెట్రో ప్రారంభించిన తొలినాళ్లలో పార్కింగ్ ఫీజు వసూలు చేశారు. కరోనా తర్వాత మెట్రో ప్రయాణికుల సంఖ్య తగ్గిపోవడంతో ఫీజు వసూలు నిర్ణయాన్నిఉపసంహరించుకొని ఫ్రీ పార్కింగ్ సౌకర్యాన్ని తీసుకొచ్చారు.

పెరిగిన పార్కింగ్ వాహనాల సంఖ్య
ప్రస్తుతం మెట్రో ప్రయాణికుల సంఖ్య పెరిగింది. రోజుకు 4 లక్షలకు పైగా ప్రయాణికులు మెట్రోలో ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. దానికి తోడు పార్కింగ్ చేసే వాహనాల సంఖ్య పెరిగింది. దీంతో ఆదాయాన్ని పెంచుకునేందుకు మెట్రో సిద్ధమవుతోంది. 30 నిమిషాల లోపు వాహనాలు నిలిపితే ఫ్రీ పార్కింగ్ అనుమతించనున్నారు. 30 నిమిషాల నుంచి గంట వరకు టూ వీలర్‌కు అయితే రూ. 10లు, ఫోర్ వీలర్ అయితే రూ. 30లు వసూలు చేయాలని మెట్రో అధికారులు భావిస్తున్నారు.

గంట నుంచి 3 గంటల వరకు టూ వీలర్‌కు రూ. 15లు, ఫోర్ వీలర్‌కు రూ.45లు, 3 నుంచి 4 గంటల వరకు నిలిపితే టూ వీలర్‌కు రూ. 20లు, ఫోర్ వీలర్‌కు రూ. 60లు, నాలుగు గంటలు ఆపైన నిలిపితే టూ వీలర్‌కు రూ. 25లు, ఫోర్ వీలర్‌కు రూ.75 వసూలు చేసేందుకు మెట్రో అధికారులు సిద్ధమవుతున్నారు. 12 గంటలు దాటితే టూ వీలర్‌కు రూ. 75లు, ఫోర్ వీలర్‌కు రూ.150లు వసూలు చేసేందుకు మెట్రో అధికారులు యోచిస్తున్నారు. అందుకు సంబంధించిన బోర్డులను మాల్స్‌లో ఇప్పటికే అధికారులు ఏర్పాటు చేశారు.
త్వరలోనే చార్జీల పెంపు
కాంటాక్ట్ లెస్ స్మార్డ్ కార్డ్, డిజిటల్ క్యూఆర్ టికెట్స్‌పై ఉన్న 10 శాతం డిస్కౌంట్ ఆఫర్ ఏప్రిల్ 1 నుంచి మార్పులు చేశారు. గతంలో ఈ సీఎస్సీ, క్యూఆర్ టికెట్‌పై డిస్కౌంట్ ఉండేది. ఎల్బీనగర్ నుంచి మియాపూర్ వరకు రూ.60 ఛార్జీలు స్మార్ట్‌కార్డుపై రూ.6ల రాయితీ లభించేది. ఇప్పుడు పూర్తి ఛార్జీని వసూలు చేస్తున్నారు. ఉదయం 6 నుంచి 8 గంటల వరకు, రాత్రి 8 నుంచి 11 గంటల వరకు మాత్రమే ఆఫర్‌ను అమలు చేస్తున్నారు. ఇక సూపర్ సేవర్ ఆఫర్- రూ.59లు ఉండగా దానిని రూ. 99లకు మెట్రో పెంచింది.

మెట్రో ఇటీవలే ఐదేళ్లు పూర్తి చేసుకోవడంతో ఛార్జీలు పెంచాలని ఎల్ అండ్ టి హైదరాబాద్ మెట్రో ప్రభుత్వాన్ని కోరింది. మెట్రో యాక్ట్ ప్రకారం టికెట్ల పెంపుపై కేంద్ర ప్రభుత్వం ఫేర్ ఫిక్సేషన్ కమిటీ వేసింది. ఇప్పటికే వీరు నివేదిక అందజేయడంతో రాష్ట్ర ప్రభుత్వ ఆమోదంతో త్వరలోనే ఛార్జీల పెంపు ఉండే అవకాశం ఉందని మెట్రో అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News