ప్రయాణ సమయం తగ్గింది
వేగ పరిమితి గంటలకు 70 నుంచి 80 కెఎంపీహెచ్‌కు పెంపు
మూడు కారిడార్ల పరిధిలో గణనీయంగా సమయం ఆదా
హైదరాబాద్: గ్రేటర్ ప్రజలను నిత్యం వివిధ ప్రాంతాలకు చేరవేస్తున్న మెట్రో నేటి నుంచి స్పీడ్ పెరగనుంది. దీంతో రోజు వెళ్లే ప్రయాణికులు త్వరగా తమ స్వస్దలాలకు చేరుకునే అవకాశం ఉంది. దీంతో ప్రయాణికుల సంఖ్య పెరగవచ్చని మెట్రో సిబ్బంది భావిస్తున్నారు. ఎల్ అండ్ టీ మెట్రోరైల్ ఇటీవల తన సిగ్నలింగ్ సాప్ట్‌వేర్‌కు తగిన మార్పులు చేయడం ద్వారా తమ మెట్రో రైల్ పూర్తి వేగంతో నడిచేందుకు తగిన ఏర్పాట్లను చేసింది. ఈసాప్ట్‌వేర్ ఆధునీకరణ పనులను సీఎంఆర్‌ఎస్ జనక్‌కుమార్ గార్గ్ తనిఖీ చేశారు. మార్చి 28 నుంచి 30 వరకు ఈతనిఖీలు జరిగాయి. భద్రతా పరీక్షల్లో భాగంగా స్పీడ్ ట్రయల్స్‌ను నిర్వహించారు. భద్రతా ప్రమాణాలకనుగుణంగా ఈమార్పులు జరిగాయా లేదా అన్నది తనిఖీ చేసిన తరువాత ఈ ఆధునీకరించిన సిస్టమ్స్ సాప్ట్‌వేర్‌ను ఉపయోగించేందుకు సింఎఆర్‌ఎస్(కమిషనర్ ఫర్ మెట్రో రైల్ సేప్టీ) అనుమతించారు.
ఈ అనుమతిలతో ఎల్ అండ్ టీ ఎంఆర్‌హెచ్‌ఎల్ ఇప్పడు తమ రైళ్లను పూర్తి వేగంతో నడపగలదు. తద్వారా గంటలకు 70 కిమీ వేగంతో ప్రయాణిస్తోన్న రైళ్లు 80 కిమీ వేగం అందుకోగలవు. ఈవేగంతో కారిడార్ 3 (నాగోల్ నుంచి రాయదుర్గ) మధ్య ప్రయాణం సమయం 6 నిమిషాలు, కారిడార్ 1( మియాపూర్ నుంచి ఎల్బీనగర్) 4 నిమిషాలు, కారిడార్ 2 ( ఎంజీబిఎస్ నుంచి జెబీఎస్)లో 1.15 నిమిషాలు సమయం తగ్గుతుంది. ఈసందర్భంగా ఎల్ అండ్ టీ ఎంఆర్‌హెచ్‌ఎల్ ఎండీ కెవీబీరెడ్డి మాట్లాడుతూ సీఎంఆర్‌ఎస్ నుంచి ఈ ఆథరైజేషన్‌తో మేమిప్పుడు మెట్రో సిస్టిమ్స్‌ను పూర్తి వేగంతో నడపగలమన్నారు. తద్వారా టర్మినల్ స్టేషన్‌ల మధ్య సమయం ఆదా చేయగలమని, మెరుగైన ప్రయాణ అనుభవాలను అందించగలమని తెలిపారు. అనంతరం ఎల్ అండ్ టీ చీప్ ఆపరేటింగ్ ఆఫీసర్ సుధీర్ చిప్లుంకర్ వెల్లడిస్తూ ఈసిగ్నలింగ్ సాప్ట్‌వేర్ ఆధునీకరణ మాసామర్దాన్ని పూర్తి ఉపయోగించడానికి మాకు సహాయపడుతుందన్నారు.
మెట్రో ప్రయాణికులకు సూపర్ సేవర్ ఆఫర్ అందుబాటులోకి: మెట్రో రైలులో సూపర్ సేవర్ ఆఫర్ శనివారం నుంచి అందుబాటులోకి వచ్చింది. సెలవు రోజుల్లో రూ. 59తో రోజంతా ప్రయాణించే అవకాశం ఇటీవలే మెట్రో కల్పించింది. ఉగాది, ఆదివారం కావడంతో రెండు రోజులు ఆఫర్ వర్తించనుంది. సూపర్ సేవర్ కార్డులు మెట్రో రైల్ టిక్కెట్ కౌంటర్ల వద్ద అందుబాటులో ఉన్నాయి. ఈకార్డుతో హైదరాబాద్ జంట నగరాల్లోని 57 మెట్రో స్టేషన్ల మధ్య ఎన్ని సార్లైనా తిరిగే అవకాశం ఉంది. సంవత్సరంలో 100 సెలవు దినాల్లో మాత్రమే ఆఫర్ వర్తించనుంది. మొదటిగా రూ. 50తో కార్డు తీసుకుని రూ. 59 రీచార్జ్ చేసుకుంటే ఆఫర్ ప్రారంభమైతుందని మెట్రో సిబ్బంది పేర్కొంటున్నారు.