చార్జీల సవరణకు ఫేర్ పిక్సేషన్ కమిటీ ఏర్పాటు
త్వరలో రూ. 60ల టిక్కెట్ ధర రూ. 100లకు పెరిగే అవకాశం
పెంపుపై ఆందోళన వ్యక్తం చేస్తున్న నగరవాసులు
ఉన్నత వర్గాలకే మెట్రో పరిమితమైతుందని వెల్లడి
మన తెలంగాణ, హైదరాబాద్ : గ్రేటర్ ప్రజలను పలు ప్రాంతాలకు చేరవేస్తున్న మెట్రో త్వరలో చార్జీలు పెంచేందుకు సమాయత్తమైంది. అందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం చార్జీల సవరణ కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసింది. రిటైర్డ్ జడ్జి గుడిసేవ శ్యామ్ ప్రసాద్ ఆధ్వర్యంలో ముగ్గురితో కమిటీ నియమించింది. కమిటీకి ఈనెల 15వ తేదీలో సలహాలు పంపించాలని నగర ప్రజలను కోరింది. దీంతో చార్జీల పెంపు పేద, మధ్యతరగతి ప్రజలకు భారంగా మారనుంది. ప్రస్తుతం కనిష్ట చార్జీల ధర రూ. 10లు, గరిష్ట ధర రూ. 60 వరకు వసూలు చేస్తున్నారు. ఈధరలు రెండింతలు పెరగనున్నట్లు రూ.60 నుంచి రూ. 100కు చేరుకుంటుందని మెట్రో అధికారులు పేర్కొంటున్నారు. అదే విధంగా ప్రతి ఏటా 05 శాతం పెంచేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నట్లు చెబుతున్నారు. ఈనిర్ణయంపై నగరవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వసూలు చేసే ధరలతో ఇబ్బందులు పడుతుంటే మళ్లీ పెంచితే మెట్రోలో సామాన్యులు ప్రయాణించడం కష్టమైతుందంటున్నారు.
ప్రభుత్వ ఉద్యోగులు, ఐటీ ఉద్యోగులకే పరిమితం కావాల్సి వస్తుందని, కరోనా తరువాత ప్రైవేటు ఉద్యోగులకు వేతనాల పెరగకపోవడం, దీనికి తోడు నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరగడంతో వచ్చే జీతం ఖర్చులు సరిపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత రెండు నెలల నుంచి ఆర్టీసీబస్సులు తగ్గడంతో నగరవాసులు దూర ప్రాంతం వెళ్లాలంటే మెట్రోలో గమ్యస్దానాలకు చేరుకుంటున్నారు. దీంతో మెట్రో ప్రయాణీకులతో కిక్కిరిసిపోతుంది. రోజుకు 4లక్షలమంది రాకపోకలు సాగిస్తున్నారు. తాజాగా చార్జీల పెంపుకోసం కమిటీ వేసి సవరణ చేయాలని ప్రభుత్వాన్ని కోరడంతో భవిష్యత్తులో మెట్రో ప్రయాణం ఉన్నతవర్గాలకే సాధ్యమైతుందని పేర్కొంటున్నారు.
సామాన్యులను దృష్టిలో పెట్టుకుని 10 నుంచి 15 శాతం పెంచాలని సూచిస్తున్నారు. ప్రస్తుత చార్జీలతో మెట్రో స్టేషన్లు రద్దీగా మారాయని, ధరలు పెంచితే స్టేషన్లు బోసిపోయినట్లు కనిపిస్తాయని,ఆర్టీసీ వైపు జనం మొగ్గు చూపక తప్పదంటున్నారు. క్యాబ్, ఆటోల ధరలకంటే ఎక్కువ ఉంటే ప్రయాణించరని, అందరికి అందుబాటులో ఉండే విధంగా ధరలు నిర్ణయించాలని కోరుతున్నారు. కరోనా తరువాత సర్వీసులు ప్రారంభించి నాణ్యమైన సేవలందిస్తూ ప్రజలను ఆకట్టుకుంటున్న సమయంలో చార్జీల పెంపు తెరమీదికి రావడంతో తమను గందరగోళంలో పడేసినట్లు ఉందని ప్రైవేటు ఉద్యోగులు పేర్కొంటున్నారు.