Wednesday, January 22, 2025

విద్యార్థి ఆత్మహత్య…. కొన ఊపిరి ఉండగానే గదికి తాళం వేసిన వార్డెన్

- Advertisement -
- Advertisement -

ఇంటర్ ఫస్టియర్ విద్యార్థి ఆత్మహత్య

నార్సింగ్ లోని ఓ ప్రైవేటు కాలేజీలో దారుణం

విద్యార్థి పై కళాశాల యాజమాన్యం ఒత్తిడి – దాడి

ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న షాద్ నగర్ ప్రాంతానికి చెందిన విద్యార్థి

మృతుడిది కేశంపేట మండలం కొత్తపేట గ్రామం

పాఠశాల ప్రిన్సిపల్ వార్డెన్ పై బంధువుల దాడి – పోలీసుల రంగ ప్రవేశం

హైదరాబాద్: మంచి విద్యాబుద్ధులు నేర్చుకొని ప్రయోజకుడు అవుతాడని భావించిన తల్లిదండ్రులకు పుత్రశోకం తప్పలేదు. కళాశాల యాజమాన్య వేధింపులు ఒత్తిడి తట్టుకోలేక ఓ ముక్కు పచ్చలారని విద్యార్థి జీవితం బలయింది. హైదరాబాద్ లోని నార్సింగ్ ప్రాంతంలో ఓ ప్రైవేటు కాలేజీలో ఈ దారుణం చోటుచేసుకుంది. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం కేశంపేట మండలం కొత్తపేట గ్రామానికి చెందిన నాగుల రాజు అనే వ్యక్తి కుమారుడు నాగుల సాత్విక్ (16) తన క్లాస్ గదిలోనే ఆత్మహత్య చేసుకున్నాడు. ముక్కు పచ్చలారని ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థి క్లాస్ గదిలో ఉరివేసుకోవడం పట్ల విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కళాశాల ముందు ఆందోళన నిర్వహిస్తున్నారు.

కళాశాల ప్రిన్సిపల్ వార్డెన్ ఎక్కువ వేధింపులకు గురి చేశారని బాధితులు పేర్కొంటున్నారు. అదేవిధంగా రాత్రి 10 గంటలకు స్టడీ అవర్స్ అయిపోయాక విద్యార్థులందరూ హాస్టల్ గదికి చేరుకున్నారు. సాత్విక్ మాత్రం హాస్టల్ కు వెళ్లకుండా క్లాస్ గదిలోనే బట్టలు ఆరవేసే వైరుతో ఫ్యాన్ కు ఉరివేసుకున్నాడు. ఈ దారుణం గమనించిన కొంతమంది విద్యార్థులు గోల చేయగానే వార్డెన్ అక్కడికి వచ్చాడు. కొన ఊపిరితో ఉన్న సాత్విక్ ను రక్షించే ప్రయత్నం వార్డెన్ చేయలేదు. పైగా విద్యార్థులపై అరిచి వారిని అక్కడ నుండి వెళ్లగొట్టి గదికి తాళం వేశాడు. కొన ఊపిరితో ఉండగానే గదికి తాళం వేయడంతో దాదాపు పావుగంట ఆలస్యం అయింది.

సకాలంలో ఆసుపత్రికి తరలించి ఉంటే సాత్విక్ బ్రతికేవాడు. ఆ తర్వాత విద్యార్థులు రెచ్చిపోయి ఆందోళన చేపట్టడంతో వార్డెన్ గది తాళం తీశాడు. అప్పటికే ఇంకా సాత్విక్ కొనఊపిరితోనే ఉండడం గమనార్హం. వార్డెన్ రక్షించే ప్రయత్నం చేయకపోవడంతో సాత్విక్ మృత్యువాత పడ్డాడు. ఈ వ్యవహారం తెలుసుకొని మృతుడి బంధువులు వార్డెన్, ప్రిన్సిపల్ పై బుదవారం దాడికి దిగారు. కళాశాల యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కళాశాల వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రస్తుతం ఆందోళన కొనసాగుతోంది. కళాశాల యాజమాన్యం ఒత్తిడి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. రాత్రి 8 గంటలకే తండ్రి నాగుల రాజు తన కుమారుని చివరిసారిగా కలిసినట్టు చెప్పారు. పరీక్షలు అయిపోయాక ఇంటికి రావాలని కోరారు. అంతకుముందు విద్యార్థి సాత్విక్ ఇంట్లో తన నానమ్మకు తనపై ఒత్తిడి పెడుతున్నారని బాగా కొడుతున్నారని చెప్పి వాపోయినట్లు చెబుతున్నారు. సాత్విక్ ను పెద్ద ఎత్తున ఒత్తిడికి గురిచేయడం తిట్టడం, కొట్టడం వల్లే మనస్థాపాన్ని గురై ఆత్మహత్య చేసుకున్నాడని తోటి విద్యార్థులు చెబుతున్నారు. గత వారం రోజులుగా సాత్విక్ తోటి విద్యార్థుల ముందు ఉరి ఎలా వేసుకోవాలనే అనుమానాలను అడిగి తెలుసుకుంటున్నట్లు చెబుతున్నారు. యాజమాన్య వేధింపులు భరించలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడని, కళాశాల యాజమాన్యంపై అదే విధంగా ప్రిన్సిపాల్, వార్డెన్ పై హత్య కేసు నమోదు చేయాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు..

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News