మన తెలంగాణ/హైదరాబాద్: కరోనా నేపథ్యంలో ఈసారి ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపిఎల్) ట్వంటీ20 టోర్నమెంట్ వేదికలను కుదించారు. కేవలం ఆరు నగరాల్లోనే ఈసారి ఐపిఎల్ నిర్వహించాలని బిసిసిఐ నిర్ణయించింది. ముంబై, ఢిల్లీ, అహ్మదాబాద్, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు నగరాల్లోనే ఈసారి ఐపిఎల్ నిర్వహించేందుకు బిసిసిఐ అనుమతి ఇచ్చింది. అయితే ఈ నగరాలకు దీటుగా అత్యాధునిక సౌకర్యాలతో కూడిన స్టేడియం ఉన్నా హైదరాబాద్‌పై బిసిసిఐ చిన్నచూపు చూడడం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల జరిగిన ఐపిఎల్ వేలం పాటలో హైదరాబాద్‌కు చెందిన ఒక్క క్రికెటర్‌కు కూడా సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో చోటు దక్కలేదు. ఇది పెద్ద వివాదానికి దారి తీసింది.
తాజాగా ఐపిఎల్ వేదికల ఖరారులో కూడా హైదరాబాద్‌కు మొండిచూపు చూడడంతో ఇటు అభిమానులు, అటు తెలంగాణ ప్రభుత్వం కూడా బిసిసిఐపై గుర్రుగా ఉంది. హైదరాబాద్‌లో ఐపిఎల్ మ్యాచ్‌లు నిర్వహించాలని ఇంతకుముందే రాష్ట్ర మంత్రి కెటిఆర్ బిసిసిఐకి విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. హైదరాబాద్ క్రికెట్ సంఘం అధ్యక్షుడు అజారుద్దీన్ కూడా ఈ విషయం బిసిసిఐ పెద్దల దృష్టికి తీసుకెళ్లాడు. కానీ, ఐపిఎల్ పాలక వర్గం మాత్రం హైదరాబాద్ క్రికెట్ సంఘం విజ్ఞప్తిని పట్టించుకోలేదు. ఐపిఎల్ వేదికల ఖరారులో హైదరాబాద్‌పై చిన్నచూపు చూసింది. దీంతో తెలుగు రాష్ట్రాలకు చెందిన కోట్లాది మంది క్రికెట్ అభిమానులు ఎంతో నిరాశకు గురయ్యారు. ఇదిలావుండగా హైదరాబాద్ క్రికెట్ సంఘం యాజమాన్యం నిర్లక్ష్య వైఖరీ వల్లే హైదరాబాద్‌కు ఐపిఎల్ నిర్వహణ అవకాశం దక్కలేదని మాజీ ప్రతినిధులు విమర్శలు గుప్పిస్తున్నారు. చెన్నై, కోల్‌కతా, ఢిల్లీలతో పోల్చితే హైదరాబాద్ మెరుగైన వేదికగా ఉన్నా హెచ్‌సిఎ వైఫల్యం వల్ల టోర్నమెంట్ నిర్వహించే అవకాశం లేకుండా పోయిందని వారు ఆరోపిస్తున్నారు.
Hyderabad not selected for hosting IPL 14th Season