Monday, December 23, 2024

నగరంలో పాకిస్తాన్ వాసి అరెస్ట్..

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ, సిటిబ్యూరోః నగరంలో అక్రమంగా నివాసం ఉంటున్న పాక్తిస్తాన్ దేశస్థుడిని బహదూర్‌పుర పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడికి సహకరించిన అతడి అత్తామామ పరారీలో ఉన్నారు. నిందితుడి వద్ద నుంచి పాకిస్తాన్ పాస్‌పోర్టు, ఐఫోన్, పాక్ ఐడి కార్డు, బసర్త్ సర్టిఫికేట్, ఫ్లైట్ టిక్కెట్లు తదితరాలను స్వాధీనం చేసుకున్నారు. సౌత్‌జోన్ డిసిపి సాయిచైతన్య తన కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. పాకిస్తాన్ దేశం, ఖైబర్ పక్తున్‌కావా, షాంగల్ జిల్లా, స్వాత్ గ్రామానికి చెందిన ఫైజ్ మహ్మద్(24) బతుకు దెరువుకోసం 2018లో యూఏఈలోని షార్జ్, సైఫ్‌జోన్‌కు వెళ్లాడు.

అక్కడ డిసర్ట్ స్టూడియో గార్మెంట్స్ కంపెనీలో బట్టలు కుట్టే డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్నాడు. 2019లో హైదరాబాద్‌లోని కిషన్‌బాగ్‌కు చెందిన నేహాఫాతిమా(29)తో పరిచయం ఏర్పడింది. తను పనిచేస్తున్న కంపెనీలో ఫాతిమాకు టైలర్‌గా ఉద్యోగం ఇప్పించాడు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. దీంతో వీరు షార్జాలోనే వివాహం చేసుకోగా, వారికి మూడేళ్ల బాలుడు ఉన్నాడు. తర్వాత ఫాతిమా కుమారుడిని తీసుకుని ఇండియాకు వచ్చింది. నేహాఫాతిమా తల్లిదండ్రులు పాకిస్తాన్‌లో ఉన్న ఫైజ్‌మహ్మద్‌ను సంప్రదించారు.

ఇండియాకు రావాల్సిందిగా, తాము చూసుకుంటామని చెప్పారు. దీంతో ఫైజ్ నేపాల్ దేశానికి వచ్చాడు, అక్కడే ఫాతిమా తల్లిదండ్రులు జుబేర్ షేక్, అఫ్జల్ బేగం కలిశారు. అక్కడ కొందరిని సంప్రదించి నేపాల్ బార్డర్ నుంచి ఇండియాలోకి 2022, నవంబర్‌లో వచ్చి హైదరాబాద్, కిషన్‌బాగ్‌లోని ఫాతిమాతో ఉంటున్నాడు. ఈ క్రమంలోనే ఫైజ్ మహ్మద్ అత్తామామ కలిసి నిందితుడికి ఆధార్ కార్డు తీసుకునేందుకు యత్నించారు.

తమ కుమారుడు మహ్మద్ గౌస్ పేరుతో ఆధార్ కార్డు తీసుకునేందుకు మాదాపూర్‌లోని ఆధార్ సెంటర్‌కు వెళ్లారు. పాకిస్తాన్ వ్యక్తికి ఇండియా గుర్తింపు కార్డు తీసుకునేందుకు యత్నిస్తున్న విషయం పోలీసులకు తెలిసింది. వెంటనే దాడి చేసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేయగా, జుబేర్ షేక్, అఫ్జల్ ఫాతిమా పరారీలో ఉన్నారు. ఇన్స్‌స్పెక్టర్ అనిల్‌కుమార్, డిఐ శ్రీశైలం, ఎస్సై బిక్షం కలిసి పట్టుకున్నారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News