చక్రం తిప్పుతున్న హైదరాబాద్‌కు
చెందిన వ్యాపారవేత్త మ్యాచ్
ఫిక్సింగ్ కోసం ముమ్మర
ప్రయత్నాలు క్రీడాకారులతో
చెట్టపట్టాలు డబ్బు,
విలువైన కానుకలు ఎర
క్రిక్ బజ్ నివేదికలో వెలుగులోకి
సంచలనాలు ఫ్రాంచైజీలను
అప్రమత్తం చేసిన బిసిసిఐ
ఐపిఎల్‌ను వెంటాడుతున్న
ఫిక్సింగ్ భయం
మన తెలంగాణ/హైదరాబాద్: సాఫీగా సాగిపోతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) సీజన్ 2025కి మ్యాచ్ ఫిక్సింగ్ భయం పట్టుకుంది. హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యాపారవేత్త మ్యాచ్ ఫిక్సింగ్ కోసం ప్రయత్నాలు చేస్తున్నాడని..ఐపిఎల్ ఫ్రాంచైజీ ఓనర్లు, ఆటగాళ్లు, కోచ్‌లు అప్రమత్తంగా ఉండాలని భారత క్రికెట్ బోర్డు సూచించింది. ఈ మేరకు పది ఫ్రాంచైజీలకు బిసిసిఐ హెచ్చరికలు కూడా జారీ చేసినట్టు ప్రముఖ క్రికెట్ వెబ్‌సైట్ క్రిక్‌బజ్ పేర్కొంది. క్రిక్‌బజ్ నివేదిక ప్రకారం ఆ వ్యాపారవేత్తకు బుకీలతో సంబంధాలు ఉన్నట్టు బిసిసిఐ అవినీతి నిరోధక భద్రతా విభాగం (ఎసిఎస్‌యు) గుర్తించినట్టు సమాచారం. తెలుగు రాష్ట్రాల్లో ఈ వ్యాపారవేత్తకు ప్రముఖ సెలబ్రిటీగా పేరుంది. సినీ, క్రీడా ప్రముఖులతో చెట్టపట్టాలు వేసుకుని తిరగడం ఆయనకు అలవాటు. సచిన్ టెండూల్కర్ వంటి క్రికెట్ దిగ్గజంతో సైతం ఆయనకు మంచి స్నేహం ఉంది. హైదరాబాద్ వేదికగా జరిగే అంతర్జాతీయ మ్యాచుల్లో కూడా నానా హంగామా చేస్తుంటాడు.
అంతేగాక అంతర్జాతీయ క్రీడల్లో పతకాలు సాధించే క్రీడాకారులకు విలువైన బహుమతులు గిఫ్ట్‌గా ఇస్తుంటాడు. సైనా నెహ్వాల్, సానియా మీర్జా, పివి. సింధు, నిఖత్ జరీన్‌తో సహా పలువురు స్టార్ క్రీడాకారులకు విలువైన బహుమతులు ఇచ్చాడు. డబ్బే కాకుండా విలువైన వస్తువులు ఎరగా వేసి వార్తల్లో నిలుస్తుంటాడు. తాజాగా ఆ వ్యాపారవేత్త చాలా మంది క్రికెటర్లు, కోచ్‌లతో స్నేహం చేయడానికి ప్రయత్నిస్తున్నట్టు క్రిక్‌బజ్ తన నివేదికలో వివరించింది. ఈ నేపథ్యంలో ఆటగాళ్లు, ఫ్రాంచైజీలు, కోచ్‌లు అలర్ట్‌గా ఉండాలని బిసిసిఐ సూచించింది. ఆ వ్యక్తి ఎవరినైనా సంప్రదిస్తే తమకు సమాచారం అందించాలని బోర్డు కోరింది. బిసిసిఐ హెచ్చరిక నేపథ్యంలో ఒక్కసారిగా ఐపిఎల్ టోర్నమెంట్‌కు ఫిక్సింగ్ భూతం భయం పెట్టుకుంది. చాలా ఏళ్లుగా ఎలాంటి అడ్డంకులు లేకుండా పొట్టి క్రికెట్ సాఫీగా సాగిపోతోంది. కానీ ఓ వ్యాపారవేత్త ఫిక్సింగ్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టు వార్తలు రావడం సంచలనంగా మారింది. బిసిసిఐ హెచ్చరికల నేపథ్యంలో ఆయా ఫ్రాంచైజీలు కూడా అప్రమత్తమయ్యాయి.
ఆటగాళ్లు, కోచ్‌లు అలర్ట్‌గా ఉండాలని, అపరచిత వ్యక్తులతో స్నేహానికి దూరంగా ఉండాలని, మ్యాచ్‌లు ముగిసిన తర్వాత హోటల్ గదులకే పరిమితం కావాలని ఆయా ఫ్రాంచైజీలు యాజమాన్యాలు ఆటగాళ్లకు హుకూం జారీ చేసినట్టు సమాచారం. పది జట్లు పాల్గొంటున్న ఐపిఎల్ సీజన్ 2025 ఆసక్తికరంగా సాగుతోంది. ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన గుజరాత్, ఢిల్లీ, పంజాబ్, లక్నో వంటి జట్లు అద్భుత ఆటతో పాయింట్ల పట్టికలో ముందు వరుసలో కొనసాగుతున్నాయి. ఇక టైటిల్ ఫేవరెట్ జట్లుగా భావించిన సన్‌రైజర్స్, చెన్నై, ముంబై ఇండియన్స్ వంటి పెద్ద జట్లు పేలవమైన ప్రదర్శనతో అట్టడుగు స్థానంలో నిలిచాయి.