హైదరాబాద్: బాలిక కిడ్నాప్ కేసును హైదరాబాద్ పోలీసులు ఇరవైనాలుగు గంటల్లో ఛేదించారు. కిడ్నాప్‌కు గురైన బాలికను వారి తల్లిదండ్రుల చెంతకు చేర్చారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ తన కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. జనగాంకు చెందిన సుడుగు అజయ్ పదేళ్ల క్రితం బతుకుదెరువు కోసం నగరానికి వచ్చాడు. ఐదేళ్ల క్రితం లక్ష్మిని వివాహం చేసుకున్నాడు. ఇల్లు లేకపోవడంతో ఫుట్‌పాత్‌మీదే జీవిస్తున్నాడు. భార్యభర్తలు చిత్తుకాగితాలు ఏరుకుని జీవిస్తున్నారు, వీరికి కూతురు అమ్ములు(2.6 ఏళ్లు) ఉన్న పాప ఉంది. గురువారం ఫుట్‌పాత్ మీద నిద్రిస్తుండగా తెల్లవారు జామున 3.30 గంటలకు గుర్తుతెలియని వ్యక్తి పాపను కిడ్నాప్ చేశాడు. కేసు నమోదు చేసుకున్న మలక్‌పేట పోలీసులు దర్యాప్తు చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా, బిజినేపల్లి మండలం, పాలెం గ్రామానికి చెందిన కాలవాలా శ్రావణ్‌కుమార్ ఆటోడ్రైవర్, పేయింటిగ్ పనిచేస్తున్నాడు. వ్యసనాలకు బానిసగా మారిన నిందితుడిపై కాచీగూడ, సరూర్‌నగర్, ఎల్‌బి నగర్ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి.
వ్యసనాలకు బానిసగా మారడంతో భార్య విడిచిపెట్టి తన నలుగురు పిల్లలతో కలిసి ఉంటోంది. గోల్నాకలో శ్రవణ్ మరో మహిళతో కలిసి ఉంటున్నాడు. నిందితుడు తరచూ అంబర్‌పేట, ముసారాంబాగ్ తదితర ప్రాంతాల్లో ప్రయాణికులను తీసుకుని వెళ్లేవాడు. ఈ క్రమంలోనే ఫుట్‌పాత్‌పై ఆడుకుంటున్న బాలికను చూశాడు. ఆటో నడుపుతుండగా వస్తున్న డబ్బులు సరిపోవడంలేదు. దీంతో బాలిక కిడ్నాప్ చేసి పిల్లలు లేనివారికి విక్రయిస్తే డబ్బులు వస్తాయని ప్లాన్ వేశాడు. ఈ నెల 27వ తేదీన కాచీగూడలో హోండా యాక్టివా బైక్‌ను చోరీ చేశాడు. దీనిపై ముసారాంబాగ్‌కు వచ్చాడు, బాలిక తల్లిదండ్రులు నిద్రలో ఉండగా కిడ్నాప్ చేసి తీసుకుని తన ఇంటికి వెళ్లాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సిసి టివి ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేసి నిందితులను పట్టుకున్నారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిన పోలీసులు బాలిక కోసంగాలింపు చేపట్టారు. బైక్‌పై వచ్చిన వ్యక్తి కిడ్నాప్ చేసినట్లు గుర్తించిన పోలీసులు అతడి ఆచూకీ కనిపెట్టారు. గోల్నాకలోని నిందితుడి ఇంట్లో బాలిక ఉండగా పట్టుకున్నారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు. 24గంటల్లో బాలిక ఆచూకీ కనిపెట్టిన పోలీసులను నగర సిపి అంజనీకుమార్ అభినందించారు.
ఆపరేషన్ ముస్కాన్…
కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆపరేషన్ ముస్కాన్‌ను చేపట్టామని నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. ఈ ఏడాదిలో 333మంది బాలురు,43మంది బాలికలు, మొత్తం 276మంది బాలకార్మికులు, చిన్నారులను కాపాడామని తెలిపారు. 2018 నుంచి ఇప్పటి వరకు 2,409మంది చిన్నారులను దర్పన్, ఆపరేషన్ ముస్కాన్ ద్వారా కాపాడామని తెలిపారు. చిన్నారుల మిస్సింగ్‌లపై ఇప్పటి వరకు 61 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశామని తెలిపారు. 277మంది చిన్నారులను వారి తల్లిదండ్రులకు అప్పగించారని అన్నారు. 99మంది చిన్నారులను రెస్కూ హోంకు తరలించామని తెలిపారు. గత కొద్ది రోజుల్లో చిన్నారులను కిడ్నాప్ చేసిన 64మంది నిందితులను అరెస్టు చేశామని తెలిపారు.