Friday, November 22, 2024

అఖిలప్రియను ప్రశ్నించిన పోలీసులు

- Advertisement -
- Advertisement -

Hyderabad Police questioning Akhila Priya

కిడ్నాప్ కేసులో మొత్తం 19 మంది నిందితుల గుర్తింపు
కుటుంబ సభ్యుల పాత్రపై ఆరా
గోవాలో ఇద్దరు, విజయవాడలో ఒకరి అరెస్ట్
భార్గవరామ్ కోసం నాలుగు రాష్ట్రాలలో వేట

హైదరాబాద్: బోయిన్‌పల్లి అపహరణ కేసులో అఖిలప్రియను ఆమె తరపు న్యాయవాది సమక్షంలో మంగళవారం నాడు బేగంపేట మహిళా పోలీస్‌స్టేషన్‌లో పోలీసులు విచారణ చేపట్టారు. బోయినపల్లి కిడ్నాప్ కేసులో అఖిలప్రియతో పాటుమొత్తం మరో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేయగా, ఈ కేసులో మొత్తం 19 మంది ప్రమేయం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కాగా ఈ కేసులో కీలక పాత్ర వహించిన నిందితులలో విజయవాడలో ఒకరిని, గోవాలో మరో ఇద్దరిని మంగళవారం అరెస్ట్ చేసి హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. ఇదిలావుండగా బోయిన్‌పల్లిలో అపహరణ జరిగిన సమయంలో అఖిలప్రియ ఎక్కడున్నారు, ప్రస్తుతం పరారీలో ఉన్న ఆమె భర్త భార్గవరామ్ ఎక్కడున్నారన్న అంశాంలతో పాటు అపహరణకు పథకం ఎవరు రచించారన్న కోణంలో అఖిలప్రియను పోలీసులు ప్రశ్నించారు. కాగా ఈ కిడ్నాప్ కేసులో ఏ-3గా ఉన్న భార్గవరామ్ కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నామని, అతని ఆచూకీ లభమైతే మరిన్ని విషయాలు బయటపడే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. బోయిన్‌పల్లిలో ప్రవీణ్‌రావు సోదరుల అపహరణ కేసులో ఎ1గా అఖిలప్రియ, ఎ2గా ఎవి సుబ్బారెడ్డి, ఎ3గా భార్గవరామ్ ఉన్న విషయం తెలిసిందే.

సంతకాల పత్రాల కోసం…

ప్రవీణ్‌రావు సోదరుల నుంచి బలవంతంగా సంతకాలు సేకరించిన పత్రాలు ఎక్కడ ఉన్నాయన్న కోణంలోనూ పోలీసులు ప్రశ్నల వర్షం కురింపించారు. హాఫిజ్ పేట భూముల విషయంలో కిడ్నాప్ కు ప్లాన్ చేసినట్టుగా గుర్తించిన పోలీసుఉల బాధితుల నుంచి సంతకాలు తీసుకున్న పత్రాలను సేకరించేందుకు యత్నాలు సాగిస్తున్నారు. మరోవైపు ఈ కేసులలో నిందితులు భార్గవ్ రామ్, గుంటూరు శ్రీనుల కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఏ క్షణం అయినా వారిని అరెస్టు చేసే అవకాశం ఉంది. భార్గవ్‌రామ్, గుంటూరు శ్రీనులు పథకం ప్రకారమే కిడ్నాప్ చేసినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు.

విజయవాడ టు గోవా… 

కిడ్నాప్ కేసులో కీలక నిందితుడు అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్ ఎక్కడ ఉన్నాడో గుర్తించేందుకు ఎపి, తెలంగాణ, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాలలో నాలుగు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. ఈ కేసులో అనేకమంది నిందితులను పోలీసులు గుర్తించారు. వీరికోసం గాలిస్తుండగా, కొంతమంది గోవాలో ఉన్నట్టు పోలీసులకు సమాచారం అందింది. విజయవాడలోని నిందితుల ఇళ్లకు పోలీసులు వెళ్లగా, అక్కడ కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు. కొందరు గోవాలో ఉన్నారని, తెలియడంతో అక్కడ కూడా పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గోవా ఇద్దరు, విజయవాడలో ఒకరిని అదుపులోకి తీసుకున్న ముగ్గురు నిందితులను మంగళవారం రాత్రికి హైదరాబాద్ తరలించనున్నారు.

అఖిలప్రియ సోదరుడి పాత్రపై…

బోయిన్‌పల్లిలో కిడ్నాప్ కేసులో బేగంపేట్ పోలీస్ స్టేషన్‌లో పోలీస్ కస్టడీలో ఉన్న అఖిలప్రియను డిసిపి కమలేశ్వర్ ప్రశ్నించారు. కిడ్నాప్ వ్యహహారంలో భూమా కుటుంబ సభ్యుల పాత్రపై పోలీసుల దర్యాప్తు చేపడుతున్నారు. అఖిలప్రియ సోదరుడు జగత్ విఖ్యాత్ కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. కిడ్నాప్ వ్యవహారంలో జగత్ విఖ్యాత్ ప్రమేయం ఉన్నట్టు కూడా అనుమానిస్తున్నారు.కిడ్నాప్ ప్రణాళిక అమలు చేయడానికి ముందు జగత్ కిడ్నాపర్లుతో మాట్లాడినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అఖిలప్రియ అరెస్టు సమయంలోనే జగత్ విఖ్యాత్ రెడ్డిని కూడా విచారించిన విషయం తెలిసిందే. తొలుత అతని నుండి వివరాలు సేకరించి వదలిపెట్టారు. తాజాగా అఖిలప్రియ సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డి డ్రైవర్ చెప్పే ఆధారాలతో మరోసారి అతన్ని విచారించనున్నట్లు పోలీసు అధికారులు వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News