మరో 18 రోజులు తర్వాత 2025 సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. ఈ క్రమంలో న్యూఇయర్ ను గ్రాండ్ గా సెలబ్రేషన్స్ చేసుకోవాలని చాలామంది ఇప్పటి నుంచే ప్లాన్స్ వేసుకుంటుంటారు. అయితే అలాంటి వారికి పోలీసులు షాకిచ్చారు. ముఖ్యంగా హైదరాబాద్‌లో న్యూ ఇయర్ వేడుకలపై పోలీసులు ఆంక్షలు విధించారు. న్యూ ఇయర్ ఈవెంట్ నిర్వాహకులకు పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఈవెంట్స్‌లో సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఉండాలని, వేడుకల్లో అశ్లీల నృత్యాలు నిషేధించాలని చెప్పారు.
ఇక, ఔట్‌డోర్‌లో రాత్రి 10 గంటల తర్వాత లౌడ్ స్పీకర్లు బ్యాన్ చేస్తున్నట్లు తెలిపారు. పబ్‌లు, బార్లలో మైనర్లకు అనుమతి ఇవ్వొద్దని, న్యూ ఇయర్ వేడుకల్లో డ్రగ్స్ వినియోగిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. అలాగే, వాహనాదారులకు కూడా పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. తాగి వాహనం నడిపితే రూ.10 వేలు జరిమానా, 6 నెలలు జైలు విధించనున్నట్లు పోలీసులు స్పష్టం చేశారు.