Wednesday, January 22, 2025

రూ.50వేలు.. కోటి కష్టాలు!

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో పోలీసుల తనిఖీలతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. వివాహాది శుభకార్యాలకు వస్తువులు కొనుగోలు చేసేందుకు నగదును తీసుకుని వెళ్లేందుకు జంకుతున్నారు. ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో విస్కృతంగా వాహనాల తనిఖీలు చేపట్టాని ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. దీంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. తనిఖీల్లో భాగంగా పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు, బైక్‌లపై వెళ్తున్న వారిని కూడా వదలడంలేదు, వారి వద్ద లభిస్తున్న తక్కువ డబ్బులకు కూడా ఆధారాలు చూపించాలని కోరడంతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నికల నిబంధనలో భాగంగా ఎవరైనా రూ.50,000లకు మించి నగదు తీసుకుని వెళ్లరాదని పోలీసులు ఆదేశించారు. అంతకుమించి నగదు తీసుకుని వెళ్తే వాటికి ఆధారాలు చూపించాలని లేకుంటే నగదు, బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు సీజ్ చేస్తామని పోలీసులు స్పష్టం చేశారు.

ఆధారాలు చూపించని నగదును ఇన్‌కం ట్యాక్స్ అధికారులకు అప్పగిస్తామని, వారికి ఆధారాలు చూపించి నగదును తీసుకుని వెళ్లాలని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. ఒక వేళా నగదుకు ఆధారాలు చూపించకుంటే ఇన్‌కం ట్యాక్స్ అధికారులు కేసులు నమోదు చేస్తారని హెచ్చరిస్తున్నారు. ఇలాంటి నిబంధనలు విధించడం వల్ల ఎన్నికల్లో డబ్బులు ప్రభావం తగ్గించడం దేవుడెరుగు, తాము మాత్రం ఇబ్బందులు పడుతున్నామని సామాన్యలు గగ్గోలు పెడుతున్నారు. వచ్చేది పెళ్లీళ్ల సీజన్ అని తమకు తెలిసిన వారి వద్ద అప్పు చేసి వివాహాలు చేస్తున్నామని వాటికి ఆధారాలు చూపించాలని చెప్పడంతో ఏమి చేయాలో పాలుపోవడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో వివాహాల కోసం జూవెల్లర్స్‌లో బంగారు ఆభరణాలు, బట్టదుకాణాల్లో దుస్తులు కొనుగోలు చేసేందుకు వచ్చే వారు భయం భయంగా వస్తున్నారు. వీరి వద్ద ఎక్కువగా నగదు ఉండడంతో పోలీసులు ఎక్కడ పట్టుకుంటారోనని, ఆధారాలు ఎక్కడి నుంచి తీసుకుని వచ్చి వారికి చూపించాలని భయభ్రాంతులకు లోనవుతున్నారు. ఇప్పుడు ఉన్న ధరలకు రూ.50,000లకు తులం బంగారం కూడా రావడంలేదు, రెండు చీరులు కూడా వస్తలేవు. దీంతో బంగారం కొనుగోలు చేయాలన్నా,

దుస్తులు కొనుగోలు చేయాలన్నా లక్షల రూపాయలు తీసుకుని రావాల్సిందే, కానీ ఎన్నికల పేరుతో వీరిని కూడా ఆపి ఆధారాలు చూపించాలని కోరడంతో వివాహాలు చేస్తున్న వారు ఇబ్బందులు పడుతున్నారు. సామాన్యులు తమ కుమార్తె వివాహం చేయాలంటే ఎక్కడో ఒకదగ్గర అప్పు చేయాల్సిన పరిస్థితి ఉంది, అప్పు తెచ్చిన డబ్బులను పోలీసులు పట్టుకుంటే తామే అప్పు ఇచ్చామని ఎవరైనా ముందుకు వచ్చి ఒప్పుకుంటారా, తాము ఒప్పు కుంటే అంత డబ్బు నీకు ఎక్కడి నుంచి వచ్చిందని పోలీసులు ప్రశ్నించకుండా ఉంటారా ఇది సాధమయ్యే పనేనా. భారతదేశంలో ఇప్పటికి కూడా నగదు ఆధారిత చెల్లింపులే ఎక్కువగా జరుగుతున్నాయి, డిజిటల్ చెల్లింపులను ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నా కూడా ఇప్పటికీ నగదు లావాదేవీలు సింహభాగం ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో దసరాను ప్రతి ఒక్కరూ గ్రాండ్‌గగా చేసుకుంటారు, ఇంట్లోని వారు ప్రతి ఒక్కరూ కొత్త దుస్తులను కొనుగోలు చేసేందుకు వెళ్తారు. దుస్తుల ధరలు ఇప్పటికే ఆశం అంటాయి, రూ.50,000 తీసుకుని వెళ్తే ఎంతమందికి సరిపోతాయి, ఎక్కువ డబ్బులు తీసుకుని వెళ్తే పోలీసులకు ఏమని సమాధానం చెప్పాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు బట్టల దుకాణాలు, బంగారు ఆభరణాల దుకాల ఎదుట అడ్డా వేసి మరీ తనిఖీలు చేస్తున్నారు.

దీంతో వాటి వైపు చూసేందుకు సామాన్యులు భయపడుతున్నారు, రెండు రోజులు క్రితం టిఎస్‌ఎస్‌పి పోలీసులు ఏకంగా పంజాగుట్టలోని జూవెల్లర్స్ వద్ద వాహనాలను తనిఖీ చేపట్టడంతో బంగారు ఆభరణాలు కొనుగోలు చేసేందుకు వచ్చే వారు ఇబ్బందులు పడుతున్నారు. గతంలో ఎన్నికల సమయంలో కార్లను మాత్రమే తనిఖీలు చేసేవారు, ఇప్పుడు బైక్‌లను, స్కూటర్లను కూడా వదలడంలేదు. బైక్‌లపై తరలిస్తున్న లక్ష రూపాయలను కూడా స్వాధీనం చేసుకుని ఆధారాలు చూపించాలని కోరుతున్నారు. ఇప్పటి జీవన విధానంలో లక్ష రూపాయలు అనేది పెద్ద సమస్య లేకుండా ఉంది. కానీ ఎన్నికల పాత నిబంధనల వల్ల లక్ష రూపాయలకు కూడా తీసుకుని వెళ్లలేని పరిస్థితి. లక్ష రూపాయలు తీసుకుని వెళ్తే కనీసం రెండు తులాల బంగారం కూడా రావడంలేదు. వైద్య ఖర్చుల కోసం కూడా చాలామంది అప్పులు చేసి ఆస్పత్రులకు వస్తున్నారు, వీరు కూడా ఇబ్బందులు పడుతున్నారు. చాలా మంది మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు వస్తుంటారు, వీరు అప్పు చేసి డబ్బులు తీసుకుని రావాల్సి ఉంటుంది. వాటికి కూడా ఆధారాలు చూపించాలని చెప్పడంతో ఇబ్బందులు పడుతున్నారు. తమ వారిని ఆస్పత్రికి తీసుకుని వచ్చి చికిత్స చేయించాలా లేక చంపుకోవాల అని కన్నీటి పర్యంతమవుతున్నారు. ఎన్నికల కోసం డబ్బులను తీసుకుని వెళ్తున్న వారి నగదును సీజ్ చేయాలని, సామాన్యులను ఇబ్బందులు పెట్టవద్దని కోరుతున్నారు.

తగ్గిన వ్యాపారం …
ఎన్నికల పేరుతో పోలీసులు ఎక్కడ పడితే అక్కడ తనీఖీలు చేస్తుండడంతో వ్యాపారాలు తగ్గాయి. బంగారం, వాహనాలు, వెండి, దస్తులు తదితర వస్తువులు కొనుగోలు చేయాలను కునేవారు వెనుకడుగు వేస్తున్నారు. దీంతో ఒక్కసారిగా వ్యాపారాలు డల్ అయిపోయాయి. దీని వల్ల చాలామంది ఉపాధి లేక రోడ్డునపడే అవకాశం ఉంది. దేశంలో నగదు వ్యవహారాలే ఎక్కువగా జరుగుతుండడంతో ప్రజలు కూడా దానిని పాటిస్తున్నారు. కొందరు పోలీసు అధికారులు రిజిస్ట్రేషన్ ఆఫీసుల వద్ద కూడా నిఘాపెడుతున్నట్లు తెలిసింది. దీంతో ఎన్నికల పారదర్శకంగా నిర్వహించడం దేవుడెరుగు, ప్రభుత్వాలు ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News