Sunday, December 22, 2024

సగం నగరమే ఓటు వేసింది

- Advertisement -
- Advertisement -

ఓటు వేయాలంటే క్యూలో నిలబడాలి. క్యూలో నిలబడడం సామాన్యుని లక్షణం, అవసరం. విత్తనాలు, ఎరువుల బస్తాలు దొరకవేమోనని రైతు చెప్పులు, సంచులు క్యూలో పెడతాడు. అయిదు రూపాయల భోజనానికి నిరుద్యోగి వరుసలో నిలబడతాడు. ఉచిత దైవ దర్శనానికి బక్క ప్రాణి రేలింగ్ పట్టుకుని వేలాడుతుంటాడు. అందుకే ఓ కవి ‘నా పేరు సామాన్యుడు, చిరునామా రేషన్ షాప్ క్యూ’ అని రాశాడు. అన్ని సలక్షణంగా వున్న వారికి క్యూ అంటే నమోషు. ఓటేయడానికి ఎండ లో అంతసేపు నిలబడాలా అనే పట్టింపులేనితనం.నగరంలో ఓటింగ్ శాతం చూస్తుంటే కొంత మంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు అనే బదులు నగరంలో యువత అని మార్చాల్సి వస్తుంది. ఆన్‌లైన్‌లోనే కొనుగోళ్లు, ఫోన్ ద్వారా డాక్టర్ కన్సల్టేషన్లు, వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు, గంటల తరబడి యూట్యూబ్ వీక్షణలు, ఒటిటి సినిమాలు కలగలిసి యువత రూపురేఖలను, ఆలోచనా తీరును మార్చేశాయి. వారి కాళ్ళను, కదలికల్ని మొద్దుబారగొట్టాయి. వాళ్ళు కదలలేరు. డెలివరీ బాయ్ మాదిరి ఓటు కూడా వారి కాలింగ్ బెల్ కొట్టాలి మరి.

ఓటింగ్‌లో పాల్గొనండి అంటూ లక్షలు ఖర్చు చేసి ఎన్నికల కమిషన్ ప్రకటనలు జారీ చేసింది. ‘ఎన్నికల రోజు సెలవు దినం, బాధ్యతగా ఓటేసే పర్వదినం’ క్యాప్షన్ తో నిత్యం ప్రచారం చేసింది. ప్రముఖులను బ్రాండ్ అంబాసిడర్లుగా నియమించి యువతను పోలింగ్ స్టేషన్ రప్పించే ప్రయత్నం కొనసాగుతోంది. గత నెల రోజులుగా వివిధ ఓటరు చైతన్య యాత్రలు, వాహనాలపై అవగాహన ప్రచారాలు కూడా జరిగాయి. అయినా నగర ఓటరు కదలలేదు.ఈ లెక్కన గ్రామాల్లోని మూడు కాళ్ళ ముసలమ్మ కన్నా నగర ముప్పై ఏళ్ల యువత దిగదుడుపుగా కనిపిస్తోంది. మూడు జిల్లాల పరిధిగా విస్తరించిన మహానగరంలో ఓటింగ్ రోజున పోలింగ్ స్టేషన్ల వద్ద వరుసల్లో నిలబడ్డ వారిలో యాభై పైవయసున్నవాళ్ళే ఎక్కువ. 70 ఏళ్ళు పైబడినవారు కూడా ఓపిగ్గా క్యూలో నిలబడ్డారు. కాళ్ళు నొప్పెట్టి కొందరు చోటు కాపాడమని చెప్పి సమీపాన కూచున్నారు. శక్తి లేని వారిని వారిలో వారే ముందుకు పంపి తొందరగా ఓటేసే అవకాశాన్ని ఇచ్చారు. మీరు రావడమే గొప్ప అన్నట్లు సీనియర్స్‌కి సదుపాయాలు లభించాయి.

సొంత రవాణా సౌకర్యాలతో పొద్దునే 8 గంటలకే పోలింగ్ స్టేషన్‌కి వచ్చారంటే ఓటేసి రావాలి అని వారు ఇంట్లో ఎంత హడావిడి చేసి ఉండొచ్చు. గత ఎన్నికల్లో నగర ఓటింగ్ సరళి చూస్తే 2014లో 53%, 2018లో 49% ఉంది. ఈసారి మూడు జిల్లాల్ల లెక్కలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌లో 48%, మేడ్చల్‌లో 55%, రంగారెడ్డి 65% ఓట్లు పోల్ అయ్యాయని తెలుస్తోంది. పోలింగ్ రోజున గేటెడ్ కమ్యూనిటీ జనం కాలు గేటు దాటలేదని సర్వత్రా వినిపిస్తోంది. నగరంలో 18 నుంచి 21 వయస్కులు 25%, 21 35 మధ్యన 35% ఓటర్లు ఉన్నారు. అంటే ఓటరు పట్టికలో 60% వీరే అన్నమాట. వీరిలో 20% కూడా ఓటు వేయలేదని గణాంకాలు చెబుతున్నాయి. ఈ లెక్కన నగరంలో పడ్డ ఓట్లు అన్నీ సీనియర్ సిటిజన్లు వేసినవే అనుకోవాలి. ఏదో గుర్తింపు కార్డుగా పనికొస్తుందని ఓటర్ గా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్నారు తప్ప వీరికి ఓటేసే ఉద్దేశం లేదని అర్థమవుతోంది.

నగరంలో ఓటింగ్‌ను పెంచడానికి గేటెడ్ కమ్యూనిటీలలోనే పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేసేందుకు ఎన్నికల సంఘం ముందుకు వచ్చింది. సాధారణంగా ప్రతి పోలింగ్ కేంద్రంలో గరిష్ఠంగా 1400 మంది ఓటర్లు మాత్రమే ఉండాలి. ప్రతి రెండు కిలోమీటర్ల దూరానికి ఒక బూత్ ఏర్పాటు చేయాలి. అయితే హైదరాబాద్ వంటి నగరాల్లో గేటెడ్ కమ్యూనిటీల సంఖ్య పెరుగుతోంది. ఒక్కో దాన్లోనే 2000 మంది ఓటర్లు కూడా వుంటున్నారు. కాబట్టి వీరందరూ ఓటు హక్కు వినియోగించుకునేలా చేయాలి అంటే ఆ గేటెడ్ కమ్యూనిటీలోనే ఒక పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి అనేది కేంద్ర ఎన్నికల సంఘం ఆలోచన. అందుకోసం నగరం చుట్టూ రెండు వేల ఓటర్లు వున్న కొన్ని గేటెడ్ కమ్యూనిటీలను అధికారులు గుర్తించారు. వాటిలో పోలింగ్ బూతుల ఏర్పాటు విషయంపై అక్కడి ప్రతినిధులతో చర్చించారు. అయితే ఎన్నికల సంఘం ఏర్పరచిన బూత్ నిర్వహణ నిబంధనల ప్రకారం ఆ ప్రాంతాన్ని 48 గంటల పాటు పోలీసుల ఆధీనంలో ఉండాలి. వారి అవసరాలకు, ఆదేశాలకు అనుగుణంగా నడుచుకోవాలి.

ఇలాంటి ఒప్పందాలను కమ్యూనిటీ నేతలు అంగీకరించనందున ఇది కార్యరూపం దాల్చలేదని తెలుస్తోంది. డ్యూటీలో వచ్చే పోలీసులకు, ఎన్నికల అధికారులకు ఏర్పాట్లు, సౌకర్యాలు తాము కల్పించడం కుదరదని కూడా చెప్పారు. అంతేకాకుండా ఒక్కో కమ్యూనిటీ సమీపంలోని ఇతర బయటి ఓటర్లు ఈ బూత్‌లో ఓటేసేందుకు అభ్యంతరం చెప్పకూడదని అధికారులు అన్నారు. వీటన్నిటికీ ఒప్పుకున్న ఒక గేటెడ్ కమ్యూనిటీలో మాత్రమే ఈ ఎన్నికల్లో పోలింగ్ బూత్ ఏర్పాటుకు అంగీకారం కుదిరినట్టు తెలుస్తోంది. మరిన్ని గేటెడ్ ఆవాసాల సంఘ పెద్దలను ఒప్పించే క్రమంలోనే ఎన్నికల సంఘం పోలింగ్ కేంద్రాల వివరాలు అడిగినందున ఈ ప్రయత్నం ముందుకు సాగలేదు. పార్లమెంట్ ఎన్నికల నాటికి నగరంలో మరిన్ని గేటెడ్ కమ్యూనిటీలను ఇందుకు సంసిద్ధం చేస్తామని ఎన్నికల సంఘం అధికారులు చెబుతున్నారు.ప్రపంచంలోని 22 దేశాల్లో ఓటు వేయడం తప్పనిసరి. ఆస్ట్రేలియాలో ఓటు వేయని వారికి కారణం తెలపమని నోటీసు వస్తుంది. జవాబు సంతృప్తికరంగా లేకపోతే 20 డాలర్ల జరిమానా ఉంటుంది. మరోసారి వేయకుంటే ఆ జరిమానా రెట్టింపవుతుంది. ఓటు వేయని వారికి కొన్ని దేశాలు ప్రభుత్వ సౌకర్యాలపై కోత విధిస్తాయి.

అలా అవి ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు రప్పిస్తున్నాయి. మన దేశంలోని రాజకీయ పక్షాలకు పోలింగ్ పెరగాలనే ఆసక్తి లేదు. ఎంత పోలైనా, వాటిలో ఎక్కువ ఓట్లు వచ్చినవారు గెలిచినట్లు అనే విధానం వున్నందున ఇదే బాగు అన్నట్లు అవి వ్యవహరిస్తున్నాయి. సంక్షేమ పథకాల లబ్ధిలో నగర ఓటర్లు తక్కువ కాబట్టి వారి ఓట్ల శాతం పెరిగితే పాలక పక్షానికి నష్టమనే భయం కూడా ఉంది. ఎన్నికల్లో గెలుపుకి కనీస ఓటు శాతం వుండాలనే ఎన్నికల నిబంధనలేమీ లేవు. 2002లో జమ్మూ కశ్మీర్‌లోని అమీరాకదల్ అనే నియోజకవర్గంలో 3.06 % మాత్రమే ఓట్లు వేశారు. 74,442 మంది ఓటర్లలో 2280 మాత్రమే ఓటు హక్కు వాడుకున్నారు. అందులో 1163 ఓట్లు వచ్చిన కాంగ్రెస్ అభ్యర్థి గెలుపొందినట్లు ప్రకటించారు.
ఏ దేశంలోనైనా ఓటు వేయడానికి క్యూలో నిలబడవలసిందే. అయితే ఆ సమయాన్ని ఇలా వినియోగించుకోవాలో ముందే ప్లాన్ చేసుకుంటామని అమెరికన్లు అంటున్నారు. కొందరు ఇష్టమైన ఆహారాన్ని వెంట తీసికెళ్తామని, మరికొందరు పుస్తక పఠనానికి, సంగీత శ్రవణానికి వాడుకొంటామని అంటున్నారు. అమెరికా పట్ల ఎంతో ఆసక్తి చూపే మన యువత ఈ విషయాన్ని కూడా ఆచరిస్తే మంచిదే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News