కర్ణాటకాలో ముగ్గురు రాష్ట్ర వాసుల మృతి
మనతెలంగాణ/హైదరాబాద్ : కర్ణాటక రాష్ట్రానికి విహారయాత్రకు వెళ్లిన ముగ్గురు హైదరాబాద్ యువకులు ఆదివారం నాడు కొడగు జిల్లా మడికేరి తాలూకాలోని ముకోడ్లు సమీపంలోని కోటే అబ్బి జలపాతంలో ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మరణించారు. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ నగరంలోని నాచారం, సూర్యాపేట పట్టణానికి చెందిన 16 మంది బంధుమిత్రులు వారాంతపు సెలవులు కావడంతో విహారయాత్ర నిమిత్తం కర్ణాటకు వెళ్లారు. ఈక్రమంలో కుశాల్‌నగర్‌లోని ప్రైవేట్ హోమ్‌స్టేలో బస చేసిన పర్యాటకులు ఆదివారం నాడు కొడగు జిల్లా మడికేరి తాలూకాలోని ముకోడ్లు సమీపంలోని కోటే అబ్బి జలపాతాన్ని చూసేందుకు వెళ్లారు. సరదాగా నీటిలో ఈత కొట్టేందుకు దిగిన ముగ్గురు పర్యాటకులు ప్రమాదవశాత్తు గల్లంతయ్యారు. ఘటనా సమయంలో చుట్టుపక్కల ఎవరూ లేకపోవడంతో వారిని రక్షించడం సాధ్య పడలేదని స్థానికులు పేర్కొంటున్నారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
అలాగే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలిని పరిశీలించి గాలింపు చర్యలు చేపట్టారు. గంటల తరబడి గాలింపు చేపట్టిన అగ్నిమాపక సిబ్బంది ఎట్టకేలకు శ్యామ్, షాహీంద్ర శ్రీ హర్షల మృతదేహాలను బయటకు తీశారు. ఈక్రమంలో నీటి మునిగి మృతి చెందిన వారిని మృతులు శ్యామ్, షాహీంద్ర శ్రీ హర్షల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అప్పటి వరకు సంతోషంగా తమ మధ్యే ఉన్న తమ ఆత్మీయులు విగతజీవులుగా మారటంతో బంధుమిత్రులు ఒక్కసారిగా శోకసంద్రంలో మునిగిపోయారు. ప్రమాదంలో సూర్యాపేటకు చెందిన షాహింద్ర, శ్రీ హర్షలతో పాటు నగరంలోని నాచారానికి చెందిన శ్యామ్ మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ముగ్గురు యువకుల మృతదేహాలను నగరానికి పంపించేందుకు కర్ణాటక అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన కర్ణాటక పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.