గాయపడి మరో నలుగురు, ఇద్దరి పరిస్థితి విషమం
బీదర్‌లో కంటైనర్‌ను ఢీకొట్టిన కారు
దైవదర్శనానికి వెళ్లిన కుటుంబం
మనతెలంగాణ, హైదరాబాద్ : రోడ్డు ప్రమాదంలో నగరానికి చెందిన ఆరుగురు మృతిచెందిన కర్నాటక రాష్ట్రం బీదర్‌లో సోమవారం చోటుచేసుకుంది. మరో నలుగురు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసుల కథనం ప్రకారం…హైదారబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని సైబర్ క్రైంలో హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న గిరిధర్ కుటుంబంతోపాటు కర్నాటక రాష్ట్రానికి దైవదర్శనానికి వెళ్లారు. గిరధర్ కుటుంబం నాగోల్‌లో ఉంటోంది. గిరిధర్ కుటుంబ సభ్యులు పదిమంది ఎర్టిగా కారులో కర్నాటకలోని కలబురగి జిల్లా, గంగాపూర్‌లోని దత్తాత్రేయను దర్శించుకునేందుకు వెళ్లారు. దేవుడిని దర్శించుకునేందుకు హైదరాబాద్ నుంచి వెళ్తుండగా కర్నాటకలోని బీదర్ తాలూక, బంగూరు వద్ద జాతీయ రహదారిపై వీరు వెళ్తున్న కారు అదుపు తప్పి కంటైనర్‌ను వెనుక నుంచి ఢీకొట్టడంతో ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందారు, మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. మృతుల్లో గిరిధర్(45), ప్రియ(15), అనిత(30), మహేక్(2), డ్రైవర్ జగదీష్(35), మరొకరు ఉన్నారు. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతిచెందారు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మరో నలుగురు గీత, రజిత, ప్రభావతి, షాలిని, హర్షవర్దన్ జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతులను నగరానికి పంపించేందుకు కర్నాటక అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. బీదర్ తాలూక మన్నల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.