హైదరాబాద్: సామూహిక జాతీయ గీతాలాపనతో భాగ్యనగరం ఉప్పొగింది. ఏక కాలంలో లక్షలాది మంది జన గణ మన గీతాలాపనతో హైదరాబాద్ నగరం మారుమోగింది. స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా మంగళవారం ఉదయం 11.30 గంటలలకు ముఖ్యమంత్రి కెచంద్రశేఖరరావు మొదల్కొని మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, ఉద్యోగులు, విద్యార్థులు నగరవాసులు ఎక్కడికక్కడ సామూహిక జాతీయ గీతాలాపన చేశారు. నిమిషం పాటు నగరమంతా నిలబడిపోయింది. వజ్రోత్సవాలలో భాగంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు పిలుపుమేరకు సరిగ్గా ఉదయం 11.30 గంటలకు ఒక నిమిషం పాటు నగరంలో అన్ని ట్రాఫిక్ సిగ్నల్లో రెడ్ లైట్ పడింది. , బస్సులు, కార్లు, ద్విచక్రవాహనాల ఎక్కడికక్కడి నిలిపివేసి ఏకకాలంలో సామూహిక జాతీయ గీతాలాపన చేశారు. అదే వేళాలకు మెట్రో స్టేషన్లలో ఎక్కడి రైళ్లకు అక్కడే నిలిపివేసి జాతీయ గీతాలాపన చేశారు. జిహెచ్‌ఎంసి ప్రధాన కార్యాలయం, జోనల్, సర్కిల్, వార్డు కార్యాలయాల్లో ఉద్యోగులు, జిల్లా కలెక్టరేట్, ఆర్‌డిఓ, తహసిల్దార్లు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, విద్యా సంస్థలులో సామూహిక జాతీయ గీతాలాపన చేశారు.
మేయర్ విజయలక్ష్మిఆధ్వర్యంలో
స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా జిహెచ్‌ఎంసి మేయర్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో బంజారాహిల్స్ రోడ్డు పెన్షన్ ఆఫీస్ చౌరస్తా వద్ద సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మేయర్ విజయలక్ష్మి, టియుఎఫ్‌ఐడిసి ఛైర్మన్ విప్లవ్ కుమార్, వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులతో పాటు జిహెచ్‌ఎంసి ఉద్యోగులు, నగరవాసులు పాల్గొన్నారు. సరిగ్గా ఉదయం 11.30 గంటలకు రోడ్డుపై ఎక్కడి వాహనాలను అక్కడే నిలిపివేసి ప్రయాణికులతో పాటు వారంతా సామూహిక జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో పాటు జిహెచ్‌ఎంసి ఉద్యోగులు భారీ జాతీయ పతాకాన్ని ప్రదర్శించారు. విద్యార్థులు జాతీయ పతాకాలతో సందడి చేశారు.
నగర గ్రంథాలయ సంస్థ
హైదరాబాద్ నగర గ్రంథాలయ సంస్థ ఛైర్‌పర్సన్ ప్రసన్న రామ్మూర్తి ఆధ్వర్యంలో సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షులు ఎం.బి.కృష్ణయాదవ్, దేవేందర్, సత్యనారాయణ, బుచ్చయ్య గుప్తాతో పాటు ఉద్యోగులు, విద్యార్థులు పాల్గొన్ని జాతీయ గీతాన్ని ఆలపించారు.