హైదరాబాద్: అమెరికాలోని కన్సాస్‌లో విషిత స్టేట్ యూనివర్సిటీలో అనాలిసిస్‌లో మాస్టర్స్ డిగ్రీ చదువుతున్న హైదరాబాద్‌కు చెందిన 24 ఏళ్ల ప్రతీక్ష కున్వర్ అక్టోబర్ 15వ తేదీ రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. చెనీ లేక్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రతీక్ష మరణించినట్లు సెడ్‌గ్విక్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం ధ్రువీకరించింది. ఈ ఘటనలో కారు నడుపుతున్న 22 ఏళ్ల యువకుడు కూడా తీవ్ర గాయాలపాలయ్యాడు. కారులో ఉన్న మరో ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారు.
తన సోదరి ప్రియాంక, స్నేహితుడు సాయి తేజ, డ్రైవర్ వరుణ్‌తో కలసి ప్రతీక్ష కారులో ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు ప్రతీక్ష అక్క ప్రతిభా కున్వర్ తెలిపారు. స్టాప్ సిగ్నల్‌ను డ్రైవర్ గుర్తించకపోవడం ఈ ప్రమాదం జరిగిందని ఆమె తెలిపారు. రెండు వాహనాలు ఢీకొనడంతో ప్రతీక్ష అక్కడికక్కడే మరణించగా, వరుణ్ తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్సపొందుతున్నాడని ఆమె చెప్పారు. సాయి తేజ, ప్రియాంకకు స్వల్ప గాయాలయ్యాయని ప్రతిభ చెప్పారు.
ప్రతీక్ష మృతదేహాన్ని హైదరాబాద్‌కు తీసుకురావడానికి హూస్టన్‌లోని భారతీయ కాన్సులేట్ జనరల్ ను సంప్రదిస్తున్నట్లు ఆమె చెప్పారు. వచ్చే శుక్రవారం, లేదా సోమవారానికి ప్రతీక్ష మృతదేహం ఇక్కడకు రావచ్చని ఆమె అన్నారు. అమెరికాలో మాస్టర్స్ డిగ్రీ చదవడానికి ముందు ప్రతీక్ష హైదరాబాద్‌లోని హైందవి కాలేజ్‌లో అండర్‌గ్రాడ్యుయేషన్ చేశారు. ప్రతీక్ష కుటుంబం నారాయణగూడలో నివసిస్తోంది.