ఐపిఎల్18లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మూడో విజయం నమోదు చేసింది. శుక్రవారం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో ఐదు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. తొలుత బ్యాటింగ్ బ్యాటింగ్ చేసిన చెన్నై 19.5 ఓవర్లలో 154 పరుగులు చేసింది. తర్వాత లక్షఛేదనకు దిగిన హైదరాబాద్ 18.4 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుం ది. అభిషేక్ శర్మ (0) ఖాతా తెరవకుండానే ఔటయ్యాడు. అయితే వన్‌డౌన్‌లో వచ్చిన ఇషాన్ కిషన్‌తో కలిసి మరో ఓపెనర్ హెడ్ ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లాడు. హెడ్ 4 ఫోర్లతో 19 ప రుగులు చేశాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన ఇషాన్ 5 ఫోర్లు, సిక్స్‌తో 44 పరుగులు సాధించాడు. అనికేత్ వర్మ (19), కమిందు మెండిస్ 32 (నాటౌట్), నితీశ్ కుమార్ రెడ్డి 19 (నాటౌట్) అద్భుత బ్యాటింగ్‌తో జట్టును గెలిపించారు.
హర్షల్ మ్యాజిక్
అంతకు ముందు బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో హైదరాబాద్ బౌలర్లు సఫలమయ్యారు. సీనియర్ బౌలర్ షమి ఇన్నింగ్స్ తొలి బంతికే చెన్నై ఓపెనర్ షేక్ రషీద్‌ను ఔట్ చేశాడు. అయితే మరో ఓపెనర్ అయుష్ మాత్రె మాత్రం ప్రత్యర్థి టీమ్ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ స్కోరును ముందుకు తీసుకెళ్లాడు. వన్‌డౌన్‌లో వచ్చిన సామ్ కరన్ 9 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. ధాటిగా ఆడిన మాత్రె 19 బంతుల్లో ఆరు ఫోర్లతో 30 పరుగులు చేసి వెనుదిరిగాడు. జడేజా ఒక ఫోర్, సిక్స్‌తో 21 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. మరోవైపు డెవాల్డ్ బ్రెవిస్ కీలక ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకున్నాడు. అద్భుత బ్యాటింగ్‌ను కనబరిచిన బ్రెవిస్ 25 బంతుల్లో 4 సిక్సర్లు, ఒక ఫోర్‌తో 42 పరుగులు చేసి ఔటయ్యాడు. శివమ్ దూబె (12), కెప్టెన్ ధోనీ (6), అన్షుల్ కంబోజ్ (2) కూడా జట్టుకు అండగా నిలువలేక పోయారు. ఇక హైదరాబాద్ బౌలర్లలో హర్షల్ పటేల్ 28 పరుగులకే నాలుగు వికెట్లు తీశాడు. కమిన్స్, ఉనద్కట్ రెండేసి వికెట్లను తీశారు.