మన తెలంగాణ/హైదరాబాద్: హిమాలయాల పాదాల దగ్గర ఉన్న అతి చిన్న దేశం అయిన నేపాల్‌లోని అందాలను చూడాలనుకునే పర్యాటకులకు ఐ.ఆర్.సి.టి.సి ప్రత్యేక సమ్మర్ టూర్ ప్యాకేజీని ప్రకటించింది. ’రాయల్ నేపాల్’ పేరుతో మే 29వ తేదీన ఈ టూర్ ప్రారంభం అవుతుంది. 5 రాత్రులు, 6 రోజుల గల ఈ టూర్ ప్యాకేజిలో నేపాల్‌లోని ఖాట్మండు, పోఖారా ప్రాంతాలను సందర్శించవచ్చు. ఈ యాత్రకు వెళ్ళే వారికి పాస్‌పోర్ట్ లేదా ఓటర్ ఐడీ కార్డు తప్పనిసరిగా ఉండాలని, అలాగే పర్యాటకులు నేపాల్ జారీ చేసిన గైడ్‌లైన్స్, ప్రోటోకాల్స్ తప్పనిసరిగా పాటించాలని, ఫ్లైట్ టికెట్స్, హోటల్‌లో బస, బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్, ఏసీ బస్సులో సైట్ సీయింగ్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ ఈ యాత్రలో కవర్ అవుతాయని ఐ.ఆర్.సీ.టీ.సీ అధికారులు తెలిపారు.
ఈ యాత్ర మొదటి రోజు హైదరాబాద్ లో ఉదయం 7 గంటలకు పర్యాటకులు ఫ్లైట్ ఎక్కి మధ్యాహ్నం 3:45 నిమిషాలకు నేపాల్ రాజధాని అయిన ఖాట్మండు చేరుకుంటారు. రాత్రికి అక్కడే బస ఏర్పాటు చేయబడుతుంది. రెండో రోజు ఉదయం పశుపతినాథ్ ఆలయం, బుద్ధనాథ స్థూపం, పఠాన్, దర్బార్ స్క్వేర్, టిబెటన్ రెఫ్యూజీ సెంటర్, స్వయంభునాథ్ స్థూపం తదితర విశేషమైన ప్రాంతాల సందర్శన ఉంటుంది. మూడో రోజు ఉదయం పోఖార ప్రాంతానికి బయల్దేరతారు. వెళ్ళే దారిలో మనకమన ఆలయ సందర్శన ఉంటుంది. నాలుగో రోజు తెల్లవారుజామున పర్యాటకులు సూరంగ్ కోట్‌కు బయలుదేరతారు.
అక్కడ సూర్యోదయం సమయంలో హిమాలయాల సందర్శన, లోకల్ సైట్ సీయింగ్ పూర్తయ్యాకా వింధ్యబాసిని మందిరం సందర్శన ఉంటుంది. అనంతరం డెవిల్స్ ఫాల్, గుప్తేశ్వర్ మహాదేవ్ గుహకు వెళతారు. ఐదో రోజు తిరిగి ఖాట్మండుకు బయల్దేరతారు. మరుసటి రోజు మధ్యాహ్నం వరకు అక్కడ గడిపే సమయం ఉంటుంది. ఆ రోజు సాయంత్రం 4.45 గంటలకు ఖాట్మండులో ఫ్లైట్ ఎక్కి రాత్రి 11.25 గంటలకు హైదరాబాద్ చేరుకోవడంతో ఈ టూర్ ముగుస్తుంది. ఐ.ఆర్. ‘రాయల్ నేపాల్’ టూర్ ప్యాకేజీ ధరలు పరిశీలిస్తే, ట్రిపుల్ ఆక్యుపెన్సీ ధర రూ.40,000/-., డబుల్ ఆక్యుపెన్సీ ధర రూ.41,000/-, సింగిల్ ఆక్యుపెన్సీ ధర రూ.49,650/- కు నిర్ణయించారు.