గూగుల్ మ్యాప్స్‌ను నమ్ముకుని ప్రయాణిస్తున్న హైదరాబాద్‌కు చెందిన ఒక పర్యాటకుల బృందం వాగులో కొట్టుకుపోయింది. శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘటనలో బృందానికి చెందిన నలుగురు పర్యాటకులను కేరళ పోలీసులు కాపాడారు. దక్షిణ కేరళలోని కొట్టాయం జిల్లాలోని కురుప్పన్‌తరా సమీపంలో ఈ ఘటన జరిగింది. ఒక మహిళతోసహా నలుగురు సభ్యుల బృందం కారులో అలప్పుళ వెళుతోంది. భారీ వర్షం కారణంగా వాగు పొంగి నీరు రోడ్డుపై ప్రవహిస్తుండడంతో వారు ప్రవాహంలోనుంచే ముందుకు సాగారు. అయితే ఆ ప్రాంతంతో వారికి పరిచయం లేకపోవడంతో గూగుల్ మ్యాప్స్ ఆధారంగా ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించగా వారి కారు వాగులోకి వెళ్లిపోయింది.
సమీపంలోనే ఉన్న గస్తీ పోలీసులు స్థానకుల సహాయంతో వారిని వాగులో కొట్టుకుపోతున్న వారిని రక్షించారు. అయితే వారి కారు మాత్రం వాగులో పూర్తిగా మునిగిపోయింది. కారును బయటకు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని కడుతురుతి పోలీసు స్టేషన్ అధికారి ఒకరు తెలిపారు. కేరళలో ఇటువంటి ఘటనలు జరగడం కొత్తేమీ కాదు. గత ఏడాది అక్టోబర్‌లో ఇద్ద యువ డాక్టర్లు గూగుల్స్ మ్యాప్స్ ఆధారంగా కారు నడిపి నదిలో మునిగి మరణించారు. కాగా..వర్షాకాలంలో టెక్నాలజీని నమ్ముకుని ప్రయాణించవద్దని కేరళ పోలీసులు ప్రజలను హెచ్చరించారు.