సిటీ బ్యూరో: తెలంగాణకు గుండెకాయలాంటి హైదరాబాద్ అభివృద్ధిలో ప్రగతి పథంలో దూసుకుపోతోంది. ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావానికి ముందు అప్పటి పాలకులు కేవలం వారి పెట్టుబడులను పెంచుకునేందుకు అనుగుణంగా మాత్రమే హైదరాబాద్‌ను అభివృద్ధి చేయగా, నేడు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు బహుముఖ వ్యూహాలతో ఈ భాగ్య నగరాన్ని విశ్వ నగరంగా తీర్చిదిద్దుతున్నారు. దీంతో నాడు కొన్ని ప్రాంతాలకే పరిమితమైన అభివృద్ధి నేడు నగరం నలు దిశల విస్తరించడంతో 400ఏళ్ల నాటి ఈ నగరం సరికొత్త రూపును సంతరించుకుంది. నాటి కట్టడాలైన చార్మినార్, గోల్కొండ కోటలాంటి కట్టడాలు భాగ్యనగర కంఠభరణాల జాబితాలో నేడు కొత్తగా దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి, డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ రాష్ట్ర నూతన సచివాలయంతో పాటు 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం, తెలంగాణ అమరవీరుల వీరత్వానికి చిహ్నంగా నిర్మిస్తున్న వీరుల అమర జ్యోతి స్తూప్తం వచ్చి చేరాయి. హైదరాబాద్ నగరంలో అంతర్జాతీయ నగరాలకు దీటుగా అభివృద్ధి చెందడంతో ఇప్పుడు సినిమా షూటింగ్‌లకు స్పాట్‌గా మారింది. అంతేకాకుండా దేశ విదేశాల పర్యాటకులకు కన్నువిందు చేసే అనేక పర్యాటక ప్రాంతాలు అభివృద్ధి చేయడంతో నగరానికి క్యూ కడుతున్నారు. నాడు ఇంటి నుంచి బయటికి వస్తే చాలు పద్మవ్యూహం లాంటి ట్రాఫిక్ చక్రబంధనంలో చిక్కుకుని ఎప్పుడు ఇంటికి వెళ్లుతామనే చెప్పలేని పరిస్థితులు నెలకొనగా నేడు నగర రోడ్లపై ప్రయాణిస్తుంటే అసలు ఇది హైదరాబాద్ నగరమా లేక విదేశాల్లో ఉన్నామా అని గుర్తు పట్టలేనంత అభివృద్దిపర్చారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు తన 9 ఏళ్ల దార్శనిక పాలనలో మౌలిక సదుపాయాల కల్పనతోపాటు సిటీ ఇమేజ్‌ను పెంచేందుకు అవసరమైన ప్రణాళికలను రూపొందించి అమలు చేస్తున్నారు. తద్వరా హైదరాబాద్ నగరం మౌలిక వసతుల కల్పన, శాంతి భద్రతల పరిరక్షణ సుస్థిర పాలనతో అభివృద్ధిలో దేశంలోనే అత్యత్త శరవేగంగా ముందుకు దూసుకువెళ్లుతోంది.
మెరుగైన ప్రజా రవాణా కోసం హైదరాబాద్‌లో ఎన్నో అద్భుత ప్రాజెక్టులు చేపట్టి నిర్మాణాత్మకమైన అభివృద్ధి సాధించడం ద్వారా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం దేశానికే రోల్ మోడల్‌గా నిలుస్తోంది. హైదరాబాద్ నగర చరిత్రలోనే తొలిసారిగా రూ.50 వేల కోట్లకు పైగా వ్యయంతో ఎస్‌ఆర్‌డిపి కింద ప్లైఓవర్లు, ఆర్‌యుబిలు, లింక్‌రోడ్లు , జంక్షన్ల అభివృద్ది, ఎస్‌ఎన్‌డిపి ద్వారా నాలాల అభివృద్ది, సిఆర్‌ఎంపి కింద అంతర్జాతీయ స్థాయి రోడ్ల నిర్వహణ, తదితర నిర్మాణ కార్యక్రమాలు జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయి. దీంతో ఉపాధి మెరుగై నిర్మాణరంగ ముడిపదార్థాలు, దాని అనుబంధ రంగాల్లో విస్తృతమైన పురోగాభివృద్ధి లభించింది. నగర అభివృద్ధికి తోడు ప్రపంచ దేశాల నుంచి అనేక బహుళ జాతి కంపెనీలు, పరిశ్రమలు పెట్టుబడులు పెట్టేందుకు ఇప్పటికే ముందుకు రాగా మరిన్ని సంస్థలు క్యూ కట్టడంతో హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం పక్కా ప్రణాళికలను రూపొందించి అమలు చేస్తోంది.
9 ఏళ్లలో హైదరాబాద్ అభివృద్ధి ఇలా
భౌగోళికంగా 627 చ.కిమిలో విస్తీర్ణం, 150 డివిజన్లలు, 67,39,158 మంది (అధికారిక లెక్కల ప్రకారం ) అనాధికారికంగా సుమారు కోటి మంది జనాభా, అన్ని విభాగాల రహదారులు కలిపి 9204 పైగా కిలోమీటర్ల మేర రోడ్లు ఉన్న గ్రేటర్ హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దడమే లక్షంగా ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇందులో భాగంగా కార్య మోడల్ మార్కెట్లు, మల్టీ పర్పస్ హాల్స్ నిర్మాణం, సామూహిక మరుగుదొడ్లు, స్మశాన వాటికలు, చెరువుల పునరుద్ధరణ, రోడ్ల పక్కన మురికి కుంటల నిర్మూలన, రోడ్ల పునరుద్ధరణ, క్రీడా కాంప్లెక్సులు, నైట్ షెల్టర్లు, ఫిష్ మార్కెట్ల నిర్మాణం తదితర ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది.
నగర ప్రజలకు నిరంతరాయ విద్యుత్ కోసం రింగ్ లైన్, మంచినీటి కొరత తీర్చేందుకు రెండు రిజర్వాయర్లు, ఐటీ, అర్బన్ ట్రాన్స్ పోర్టేషన్, మెట్రో రైలు విస్తరణ, నగరంలో బస్సుల సంఖ్య పెంపు, హరితహారం, పార్కుల అభివృద్ధి, హుస్సేన్ సాగర్ ప్రక్షాళన, చెరువుల సంరక్షణ, సినిమ సిటీ, ఫార్మా సిటీ, ఓఆర్‌ఆర్ జోనింగ్, మూసీ వెంట ఎలివేటెడ్ రహదారి, పోలీస్ వ్యవస్థ బలోపేతంలో భాగంగా పోలీస్ కమాండ్ అండ్ కంట్రోల్ భవనం, కొత్తగా రెండు రైల్వే టర్మినల్స్ ఇలా హైదరాబాద్‌లో ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టింది.