Monday, December 23, 2024

హైదరాబాద్@360 డిగ్రీలు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్:  కాంగ్రెస్ ప్రభుత్వమంటేనే ఫ్రెండ్లీ ప్రభుత్వమని, హైదరాబాద్‌ను 360 డిగ్రీలో అభివృద్ధి చేస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. మెట్రోను ఫేజ్-2లో అన్ని వైపులా విస్తరించడంతో పాటు హై దరాబాద్‌కు 30 కి.మీ పరిధిలో రిజర్వాయర్‌ను ఏర్పాటు చేసి తాగునీటికి డోకా లేకుండా చర్యలు చేపడుతున్నామని ఆయన తెలిపారు. హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో క్రెడాయ్ ప్రాపర్టీ షో -2024ను ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్ రెడ్డితో కలిసి మంత్రి పొంగులేటి శుక్రవారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ హైదరాబాద్‌కు బ్రాండ్ ఇమేజ్ రావడం లో నిర్మాణ సంస్థలు, బిల్డర్లు ప్రముఖపాత్ర పోషించాయని ఆయన తెలిపారు. ‘ధరణి’ ద్వారా ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారని, ఈ వ్యవస్థ వల్ల రియల్ ఎస్టేట్ కూడా ఇబ్బంది పడిందని ఆయన తెలిపారు. ఎన్నికల్లో చెప్పినట్లుగానే ’ధరణి’ని రద్దు  చేస్తామని, రెవెన్యూ లొసుగులను తొలగించి పారదర్శకంగా ప్రజలకు అందిస్తామని ఆయన చెప్పారు. ఇందుకోసం ఇప్పటికే కమిటీ వేసిన వేసినట్లు ఆయన తెలిపారు. రిజిస్ట్రేషన్ల వ్యవస్థను ప్రక్షాళన చేయాల్సి ఉందని, పారదర్శకత కోసం సూచనలు తీసుకుంటామని ఆయన తెలిపారు. హైదరాబాద్ ఈ స్థాయిలో ఉందంటే ‘ ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలోని అప్పటి సిఎం వైఎస్సార్ చేపట్టిన అభివృద్ధి పనులతోనేనని, దాంతో అంతర్జాతీయంగా హైదరాబాద్ క్రేజ్ పెరగడంతో పాటు సెక్యులర్, సెఫ్టీ సిటీగా రిజిస్ట్రర్ అయ్యిందని ఆయన తెలిపారు. హైదరాబాద్‌ను మరింత అభివృద్ధి చేసేలా సహకరించాలని బిల్డర్లు, రియల్టర్లను ఆయన కోరారు. హైదరాబాద్ పాటు పరిసర ప్రాంతాల్లో లింకు రోడ్లు, రేడియల్ రోడ్లు డెవలప్ చేసి మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ఆయన పేర్కొన్నారు.
నగరంలో రియల్‌రంగం ప్రోత్సాహకరంగా ఉంది : రాజశేఖర్ రెడ్డి
క్రెడాయ్ హైదరాబాద్ అధ్యక్షుడు వి. రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ రంగం పోత్సాహకరంగా ఉందన్నారు. నివాస, వాణిజ్య, రిటైల్ రియల్ ఎస్టేట్‌లో నిరంతర వృద్ధిని సాధిస్తోందన్నారు. ఫిబ్రవరిలో రాష్ట్రం నమోదైన ఆస్తుల సంఖ్య పరంగా 21 శాతం పెరుగుదలను నమోదు చేసిందన్నారు. గతేడాదితో పోలిస్తే నమోదైన ఆస్తుల విలువలో 42 శాతం పెరుగుదల కనిపించిందన్నారు. రూ.25-లక్షల నుంచి రూ. 50 లక్షల ధరల శ్రేణి గృహాలకు డిమాండ్ బాగుందన్నారు. నగరం, రాష్ట్ర సుస్థిర అభివృద్ధి పట్ల స్పష్టమైన దృక్పథం ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో స్థిరమైన ప్రభుత్వం కారణంగా రియల్ రంగానికి మరింత డిమాండ్ లభిస్తుందన్నారు. సిఎం ప్రకటించిన మెగా మాస్టర్ ప్లాన్ 2050 ద్వారా ఆయనకు ఉన్న దూరదృష్టిని చూపిస్తుందన్నారు. క్రెడాయ్ హైదరాబాద్ ప్రాపర్టీ షో 13వ ఎడిషన్ నగరంలో ఉత్తమమైన రెరా నమోదిత ప్రాజెక్ట్‌లను ప్రదర్శించడానికి ఇదే తగిన సమయమని రాజశేఖర్ రెడ్డి తెలిపారు. ఈ ప్రాపర్టీ షో గృహ కొనుగోలుదారులకు నగరం అందించే అత్యుత్తమ ప్రాజెక్ట్‌లను అన్వేషించడానికి అసాధారణమైన అవకాశాన్ని అందిస్తుందన్నారు.
కొనుగోలుదారులు, అమ్మకందారులకు అనువైన వాతావరణం: జైదీప్ రెడ్డి
ఎన్. జైదీప్ రెడ్డి – ప్రెసిడెంట్, ఎలెక్ట్, క్రెడాయ్ హైదరాబాద్ మాట్లాడుతూ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం ఒక ఆశాదీపంలా నిలుస్తుందన్నారు. కొనుగోలుదారులు, అమ్మకందారులు అభివృద్ధి చెందడానికి అనువైన వాతావరణం ఇక్కడ ఉందన్నారు. రాబోయే రెండేళ్లలో 35 నుంచి -38 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో అగ్రశ్రేణి వ్యాపార పార్కులను ఆవిష్కరించే ప్రతిష్టాత్మక ప్రణాళికలతో, నగరం అద్భుతమైన విస్తరణ, ఉద్యోగ కల్పనకు సిద్ధంగా ఉందన్నారు. క్రెడాయ్ హైదరాబాద్ ప్రాపర్టీ షో యొక్క 13వ ఎడిషన్ గృహ కొనుగోలుదారులకు ఒక అసమానమైన అవకాశంగా ఉద్భవించిందన్నారు. క్రెడాయ్ సభ్యులచే ఎంపిక చేయబడిన అత్యుత్తమ రెరా -నమోదిత ప్రాజెక్ట్‌లను పరిశోధించడానికి ఇది వారికి ఏకైక వేదిక అని ఆయన తెలిపారు. జనరల్ సెక్రటరీ బి. జగన్నాథ్ రావు మాట్లాడుతూ క్రెడాయ్ ప్రాపర్టీ షోతో హైదరాబాద్‌లో మరిన్ని అవకాశాలకు నిలయంగా మారుతోందన్నారు. నగరం స్థిరమైన వ్యాపార దృశ్యం, ప్రపంచ వ్యాప్తంగా పలు సంస్థలను ఆకర్షిస్తూ ఉందన్నారు. దాని ఆర్థిక వృద్ధికి తోడ్పాటును అందిస్తుందన్నారు. ముఖ్యంగా ఆకట్టుకునే రీతిలో దావోస్‌లో తెలంగాణకు రూ. 40 వేల కోట్ల పెట్టుబడుల ప్రతిజ్ఞ, ప్రపంచ వేదికపై హైదరాబాద్ స్థాయిని బలోపేతం చేయడం, దానిని భవిష్యత్‌లో విశ్వాసాన్ని నింపుతుందన్నారు. ఈ కార్యక్రమంలో క్రెడాయ్ హైదరాబాద్ సభ్యులు కొత్తపల్లి రాంబాబు, బి.ప్రదీప్ రెడ్డి, సి జి మురళీ మోహన్, ఎం.శ్రీకాంత్, మనోజ్ కుమార్ అగర్వాల్, కోశాధికారి, సంయుక్త కార్యదర్శులు క్రాంతి కిరణ్ రెడ్డి, జి. నితీష్ రెడ్డి, ప్రాపర్టీ షో నిర్వహణ కమిటీ సభ్యులు, కో-కన్వీనర్లు ఎం.శ్రీరామ్, ఎన్. వంశీధర్ రెడ్డి, ఎం.అరవింద్ ఆనందరావు, ధీరజ్‌లు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News