న్యూఢిల్లీ : హైదరాబాద్‌కు చెందిన ఏడో తరగతి బాలిక 11 సంవత్సరాల ఆకర్షణ సతీష్ చదువుల తల్లి అని, ఆమె చిన్న వయస్సులోనే వేలాది పుస్తకాలు చదివిందని ప్రధాని మోడీ ప్రశంసించారు. ఆదివారం నాటి మన్ కీ బాత్‌లో మోడీ ఈ బాలిక పేరు ప్రస్తావిస్తాంచారు. హైదరాబాద్ బేగంపేటలోని పబ్లిక్‌స్కూలు (హెచ్‌పిఎస్) విద్యార్థిని అయిన ఆకర్షణ చిన్ననాట నుంచే పుస్తక పఠనం అంటే ప్రాణంగా భావిస్తూ వచ్చింది.
మూడేళ్ల ప్రాయంలోనే పఠనం తన ప్రపంచంగా పెరిగింది. తన తొమ్మిదో ఏటనే సొంతంగా ఓ లైబ్రరీని ఏర్పాటు చేయాలనే తపనతో ముందుకు సాగింది. పుట్టగానే వైద్యులు ఈ పాప హైపర్‌యాక్టివ్ అని తేల్చారు. చదవడంపై దృష్టి సారించేలా చేయాలని సూచించారు. ఆకర్షణ తండ్రి డాక్టర్ జె సతీష్ కుమార్ గతంలో ఏపిజె అబ్దుల్ కలాం ఆధ్వర్యంలో లీడ్ ఇండియా 2020 ఫౌండేషన్‌కు సమన్వయకర్తగా వ్యవహరించారు. తండ్రి ప్రోత్సాహంతో చిన్ననాటనే ఈ బాలిక వేయి పుస్తకాలతో తన వ్యక్తిగత లైబ్రరీ ఏర్పాటు చేసుకుంది.
కాగా ఇతరుల కోసం ఆరు లైబ్రరీలు ఏర్పాటు చేసింది. దేశంలో కోవిడ్, లాక్‌డౌన్ సమయంలో ఇతరుల నుంచి పుస్తకాల సేకరణ తన పనిగా పెట్టుకుంది. ఇప్పటివరకూ ఆరువేల వరకూ అమూల్య పుస్తకాలను సేకరించింది. కాగా రోగులకు మానసిక ఉల్లాసం తద్వారా సరైన ఆరోగ్య వికాసానికి మంచి పుస్తకాలు కావాలనే ఆలోచనతో ఆమె అరుదైన పుస్తకాలు సేకరించి ఎంఎన్‌జె క్యాన్సర్ హాస్సిటల్ ఇటువంటి నమూనా లైబ్రరీ ఏర్పాటు చేసింది.