Sunday, December 22, 2024

వాసవికి వాత

- Advertisement -
- Advertisement -

కోమటికుంట బఫర్‌జోన్‌లోని జంట భవనాలకు అనుమతులు రద్దు?
హెచ్‌ఎండిఎకు హైడ్రా లేఖ రాసినట్టు సమాచారం
8,9 బ్లాక్‌లను కూల్చేందుకు సన్నాహాలు
కొనుగోలుదారులు నష్టపోకుండా చెరువుల్లో నిర్మాణాల అనుమతులపై నజర్
ఇటీవల జిహెచ్‌ఎంసికి హైడ్రా లేఖ 
త్వరలో శివారు మున్సిపాలిటీలకు, కార్పొరేషన్లకు లేఖలు 
అధికారుల అక్రమాలు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో చర్యలు

మన తెలంగాణ/సిటీ బ్యూరో: బాచుపల్లి కోమటికుంట బఫర్‌జోన్‌లో నిర్మితమవుతున్న వాసవి ట్విన్ టవర్స్ నిర్మాణాలకు అనుమతులను రద్దు చేయాల్సిందిగా హెచ్‌ఎండిఏకు హైడ్రా లేఖ రాసినట్టు సమాచారం. వీటితో మరో నాలుగు చెరువుల్లోని భవనాలకు సంబంధించిన నిర్మాణ అనుమతులను కూడా రద్దు చేయాల్సిందిగా హెచ్‌ఎండిఏను ఆ లేఖలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ కోరినట్టు అధికార వర్గాల ద్వారా తెలిసింది. అయితే, హెచ్‌ఎండీఏ ఆ లేఖకు స్పందించి వాసవి నిర్మాణాదారులకు షోకాజ్ నోటీసులు జారీచేస్తూ అనుమతులు రద్దు చేయకూడదంటే మీ వద్ద ఉన్న ఆధారాలను తెలియజేయాల్సిందిగా కోరినట్టు అధికారవర్గాల్లోని సమాచారం. అయితే, వా సవి బిల్డర్స్, హెచ్‌ఎండిఏలు ఈ విషయాన్ని దృవీకరించలేదు. అతి త్వరలోనే వాసవి ట్విన్ టవర్స్‌ను కూల్చేందుకు హైడ్రా సిద్దమైనట్టు తెలిసింది. ఇటీవల కోర్టులోని అంశం కూడా సమసిపోయిందని తెలుసుకున్న హైడ్రా బాచుపల్లి కోమటికుంటలోని 8, 9 బ్లాక్‌లను కూల్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి.

అనుమతులు వద్దంటూ లేఖలు..
ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోని చెరువుల్లోని భవనాలను హైడ్రా కూల్చివేస్తున్న నేపథ్యంలో ఆ భవనాలను కొనుగోలు చేసినవారు తీవ్రంగా నష్టపోతున్నారని గ్రహించిన రంగనాథ్ భవన నిర్మాణ అనుమతులను జారీచేసే సంస్థలపై ఫోకస్ పెట్టారు. చెరువుల ఎఫ్‌టిఎల్, బఫర్‌జోన్లలో బిల్డింగ్ పర్మిషన్లు సాంక్షన్ చేయకుండా చూడాలని రంగనాథ్ నిర్ణయించినట్టు తెలిసింది. ఈ క్రమంలోనే భవన నిర్మాణ అనుమతుల మంజూరు చేసే సంస్థలను అప్రమత్తం చేయడంలో భాగంగా ఆయా సంస్థలకు క్రమంగా లేఖలు రాస్తున్నట్టు అధికారుల్లోని అభిప్రాయం. ముందుగా జీహెచ్‌ఎంసికి కమిషనర్ రంగనాథ్ ఇటీవలనే లేఖ రాశారు. ఇప్పుడు హెచ్‌ఎండిఏకు ఆయన లేఖ రాసినట్టు సమాచారం. గత కొద్ది రోజుల క్రితమే హెచ్‌ఎండిఏ అధికారులతో రంగనాథ్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. బ్లూ గ్రీన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై హెచ్‌ఎండిఏ అధికారులతో చర్చలు జరిపిన ఆయన ఇప్పుడు చెరువుల్లో బిల్డింగ్ పర్మిషన్లపై హెచ్‌ఎండిఏకు లేఖ రాయడం ఆసక్తికరమైన చర్చకు తెరలేచింది.

శివారు మునిసిపాలిటీలకు..
చెరువుల ఎఫ్‌టిఎల్, బఫర్ జోన్లలో భవన నిర్మాణాల అనుమతులను నిలుపుదల చేసేందుకు జీహెచ్‌ఎంసి, హెచ్‌ఎండిఏ, శివారు మునిసిపాలిటీలు, మునిసిపల్ కార్పోరేషన్లపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ దృష్టిసారించారు. అనుమతులు మంజూరు చేసే సంస్థలకు లేఖలు రాయదాన్ని జీహెచ్‌ఎంసితో శ్రీకారం చుట్టారు. ఇటీవల గ్రేటర్‌కు లేఖ రాసిన రంగనాథ్.. గ్రేటర్ పరిధిలోని చెరువుల్లో అనుమతులు మంజూరు చేసినట్టు ఉంటే వాటిని పరిశీలించగలరనీ, అనుమతులను రద్దు చేసేందుకు తగిన చర్యలు తీసుకోగలరనీ, లేని పక్షంలో ఆ భవనాలపై హైడ్రా చర్యలు తీసుకుంటే కొనుగోలుదారులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదముందని ఆ లేఖలో జీహెచ్‌ఎంసికి వివరించినట్టు సమాచారం. అదే క్రమంలో హెచ్‌ఎండిఏను అప్రమత్తం చేయడంలో భాగంగా అథారిటీ పరిధిలోని చెరువుల్లో, నీటివనరుల్లో భవన నిర్మాణ అనుమతులు మంజూరు చేశారా..? పరిశీలించి అందుకు తగిన చర్యలు తీసుకోవాలని హెచ్‌ఎండిఏను కోరినట్టు తెలిసింది. అనంతరం ఔటర్ లోపలి వైపున ఉన్న మునిసిపాలిటీలు, మునిసిపల్ కార్పోరేషన్లకు కూడా రంగనాథ్ లేఖ రాయనున్నట్టు సమాచారం.

అధికారుల అక్రమాలు వెలుగులోకి
ఇటీవల నిజాంపేట్ మునిసిపల్ కార్పోరేషన్ పరిధిలోని ఎర్రకుంట చెరువులోని ప్రభుత్వ భూమిలో బిల్డింగ్ పర్మిషన్లు మంజూరు చేసినట్టు హైడ్రా కమిషనర్ గుర్తించారు. జీహెచ్‌ఎంసి పరిధిలోని చందానగర్ సర్కిల్‌లో ఈర్లచెరువులో భవననిర్మాణానికి అనుమతులు మంజూరును హైడ్రా గుర్తించింది. ఈ రెండు ప్రాంతాల్లోనూ భవననిర్మాణాలకు అనుమతులు మంజూరుచేసిన, చేయడానికి కారకులైన 6 మంది అధికారులపై సైబరాబాద్ పోలీసులకు రంగనాథ్ స్వయంగా ఫిర్యాదు చేశారు. అనంతరం అమీన్‌పూర్ పరిధిలోని కిష్టారెడ్డిపేటలో ప్రభుత్వ భూమి 800 చ.గ.లకు హెచ్‌ఎండిఏ నుం చి ఎల్‌ఆర్‌ఎస్ తీసుకున్నట్టు హైడ్రా గుర్తించింది. దీంతో హెచ్‌ఎండిఏకు కమిషనర్ రంగనాథ్ లేఖ రాసినట్టు సమాచారం. ముఖ్యంగా 5 చెరువుల్లో భవన నిర్మాణాలను అనుమతినిస్తే వాటిని రద్దుపరచాల్సిందిగా లేఖలో కోరినట్టు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News