Monday, December 23, 2024

హైడ్రాకు అధికారాలివ్వండి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ మహానగర పురపాలక సంస్థ పరిధిలో ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు తగిన సహాయం చేసేందుకు, ప్రభుత్వ భూములు, చెరువులు, నాళాలు, కుంటలు, ఇతర ప్రభుత్వ ఆస్తులు సంరక్షణ కోసం హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మోనటరింగ్ అండ్ ప్రొటెక్షన్ (హైడ్రా) అనే సంస్థను ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతోనే ఈ హైడ్రా సంస్థ ఏర్పడడం విశేషం. హైడ్రా సంస్థ జిహెచ్‌ఎంసి పరిధితో పాటు హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు వరకు సుమారు రెండు వేల చదరపు కిలోమీటర్లు తమ బాధ్యతలు నిర్వర్తిస్తుంది. రాష్ట్ర, జాతీయ విపత్తు సంస్థల సమన్వయంతో జాతీయ విపత్తుల సంస్థ చట్టానికి అనుగుణంగా హైడ్రా పని చేస్తుంది.

హైడ్రా సంస్థకు ప్రత్యేకంగా నిధులు కల్పించడంతో పాటు మూడు వేల మంది అధికారులు, సిబ్బంది నియమించేందుకు సిఎం రేవంత్ రెడ్డి సూచనలతో ప్రభుత్వం ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. హైదరాబాద్ మహా నగరాన్ని విస్తరింపచేసి విశ్వనగరంగా తీర్చిదిద్ది ప్రపంచంలోని ప్రముఖ నగరాలలో ఒకటిగా తయారు చేయాలనే ఉద్దేశంతో సిఎం రేవంత్ రెడ్డి హైడ్రా సంస్థను ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లో చిన్నపాటి వర్షం కురిసినా రోడ్లు అన్నీ చెరువులను తలపిస్తాయి. అనేక ప్రాంతాల్లో వరద ఉధృతి కూడా తీవ్రంగా ఉంటుంది. పర్యవసానంగా అప్పుడప్పుడూ ఆస్తినష్టం, ప్రాణనష్టం జరుగుతూ ఉంటుంది. జిహెచ్‌ఎంసి పరిధిలోని చెరువులు, కుంటలు, నాళాలు 70% వరకు కబ్జాకు గురికావడమే దానికి ప్రధాన కారణం.

80కి పైగా చెరువులు పూర్తిగా అదృశ్యం అయినట్లు ఇటీవల అధికారులు గుర్తించారు. అదే విధంగా ప్రభుత్వ భూములు కూడా మహానగర పరిధిలో విచ్చలవిడిగా కబ్జాకు గురైయ్యాయి. ఈ పరిస్థితికి అడ్డుకట్టు వేస్తేనే హైదరాబాద్ మహానగరాన్ని విస్తరింప చేసి విశ్వనగరంగా తీర్చిదిద్దే అవకాశం ఉంటుందనేది నిర్వివాదాంశం. అందులో భాగంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైడ్రా సంస్థను ఏర్పాటు చేసి సమర్ధవంతమైన అధికారిగా పేరు గడించిన సీనియర్ ఐపిఎస్ అధికారి ఎ.వి. రంగనాథ్‌ను హైడ్రా కమిషనర్‌గా నియమించారు. హైడ్రా సంస్థ ఏర్పాటు చేసిన కొద్ది రోజులలోనే జిహెచ్‌ఎంసి పరిధితో పాటు యావత్ తెలంగాణ ప్రజల మనసు దోచింది. అందులో భాగంగానే హైడ్రాను తెలంగాణ వ్యాప్తంగా విస్తరింపచేయమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రజలనుంచి విజ్ఞప్తులు వస్తూ ఉండడం గమనార్హం.

గొప్ప సంకల్పంతో హైడ్రాను ఏర్పాటు చేసిన సిఎం రేవంత్ రెడ్డిపై, ఒత్తిళ్లకు తలొగ్గక నిష్పక్షపాతంగా, సమర్ధవంతంగా విధులు నిర్వహిస్తున్న కమిషనర్ రంగనాథ్‌లపై అన్ని వర్గాల ప్రజలనుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. అదే సమయంలో హైడ్రా సంస్థ అనతికాలంలోనే కబ్జాకోరులకు కంటి మీద కునుకు లేకుండా చేయడం గమనార్హం. కబ్జాకు గురైన ప్రభుత్వ ఆస్తుల గురించి ప్రతి రోజూ హైడ్రాకు అనేక ఫిర్యాదులు అందుతున్నాయి. హైడ్రా సంస్థ ఇప్పటికే కబ్జాకు గురైన ఇరవై చెరువులను స్వాధీనం చేసుకుని వంద ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమిని రికవరీ చేయడం గొప్ప పరిణామం. ఉస్మాన్ సాగర్ పరిధి బఫర్ జోన్‌లో ఓరో స్పోర్ట్ విలేజీలో గ్రీన్ కో సంస్థ అక్రమంగా నిర్మించిన కోట్లాది రూపాయలు విలువ చేసే 20 అక్రమ కట్టడాలను హైడ్రా నేలమట్టం చేసింది. అదేవిధంగా నిజాంపేటలోని బాచుపల్లి, ప్రగతినగర్‌లో అక్రమంగా నిర్మించిన బహుళ అంతస్తుల భవనాలు కొన్ని నేలమట్టం చేయడం జరిగింది.

జూబ్లీహిల్స్‌లోని నందగిరి హిల్స్‌లో అక్రమ నిర్మాణంగా గుర్తించి 1800 గజాల స్థలానికి నిర్మించిన ప్రహరీ గోడను హైడ్రా వారు కూల్చివేశారు. ఈ పరిణామాన్ని ఖైరతాబాద్ శాసన సభ్యులు దానం నాగేందర్ తీవ్రంగా వ్యతిరేకించారు. హైడ్రా చర్యలతో విభేదించిన దానం నాగేందర్ ఏకంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఆక్రమణదారులకు మద్దతు ఇస్తున్నారని హైడ్రా సంస్థ కూడా దానం నాగేందర్‌పై కేసు దాఖలు చేయడం గమనార్హం. దానం నాగేందర్, అరికెపూడి గాంధీ లాంటి అనేక మంది అధికార పార్టీ శాసన సభ్యులు హైడ్రా సంస్థ పని తీరుపై బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తుండడం చర్చనీయాంశం. కొంతమంది అధికార పార్టీ నేతలు ఏకంగా హైడ్రా సంస్థ ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఆ సంస్థ ను రద్దు చేయమని బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు. వీరంతా సిఎం రేవంత్ రెడ్డి సదుద్దేశాన్ని విస్మరించి హైడ్రా సంస్థపై విమర్శలు చేయడం ఆశ్చర్యకరం. ప్రభుత్వ భూములు, చెరువులు, నాళాలు, కుంటలు కబ్జా చేసిన వారిలో రియల్ ఎస్టేట్ వ్యాపారులే అధిక భాగం ఉంటారు. వారికి పార్టీల పట్ల తన, మన భేదాలు ఉండవు.

వారు ఏ పార్టీ అధికారంలో ఉన్నా వారి పనులు సులభంగా చక్కబెట్టుకుంటారు. అందులో భాగంగానే అధికార పార్టీ ప్రజాప్రతినిధుల నుండి నిష్పక్షపాతంగా బాధ్యతలు నిర్వర్తిస్తూ యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజల మనసు దోచిన హైడ్రా సంస్థ తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంది. పరిమితంగా అధికారాలు ఉండడంతో ప్రజా ప్రతినిదులు, కబ్జాకోరుల ఒత్తిడితో హైడ్రా సంస్థ అధికారులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. హైడ్రా సంస్థకు ప్రత్యేక చట్టం తేవడంతో పాటు ప్రత్యేక అధికారాలు కల్పించడం లేదా స్వయం ప్రతిపత్తి కల్పించినప్పుడే హైడ్రా నిర్భయంగా తమ బాధ్యతలు నిర్వర్తిస్తుంది అనేది నిర్వివాదాంశం. కనుక ఆ దిశగా చర్యలు చేపట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాను సంకల్పించినట్లు హైదరాబాద్ మహానగరాన్ని విస్తరింప చేసి విశ్వనగరంగా తీర్చిదిద్ది ప్రపంచ మహానగరాల సరసన నిలుపుతారని ఆశిద్దాం.

కైలసాని శివప్రసాద్
9440203999

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News