దుండిగల్ మండల పరిధిలోని బాబాఖాన్ కుంట చెరువు ఆక్రమణ తీరును వివరిస్తున్న ఉపగ్రహ ఛాయా చిత్రాలు. మొదటి ఫొటో2014లో చెరువు పరిస్థితిని వివరిస్తున్నది. రెండో చిత్రంలో 2023 నాటికి కుదించుకుపోయిన చెరువు దుస్థితిని చూడవచ్చు
మన తెలంగాణ/సిటీ బ్యూరో : ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోని 561 చెరువులకు హద్దులను నిర్దారించడంపై హైడ్రా భారీగా కసరత్తులు చేస్తుంది. సమీక్షలు, సమావేశాలు, సందర్శనలు, తనిఖీలు వంటివి నిరంతరం చేపడు తూ చెరువులను కాపాడటం, వాటికి ఎఫ్‌టిఎల్, బఫర్‌జోన్ల హద్దులను నిర్ధారించడంపై హైడ్రా ప్రత్యేక పోకస్‌పెట్టింది. ఇందులో భా గంగానే ఓఆర్‌ఆర్‌లోపలి చెరువుల పునరుజ్జీ వం చేసేందుకు కర్ణాటక ట్యాంక్స్ కన్జర్వేషన్, డెవలప్‌మెంట్ అథారిటీ (కేటీసీడీఏ) అమలు చేస్తున్న పద్దతులను అధ్యయనం చేసేందుకు బెంగళూరుకు హైడ్రా అధికారుల బృందం వె ళ్లివచ్చింది. అక్కడ చెరువుల సుందరీకరణకు ప్రవేశపెట్టిన విధానాలపై కేటీసీడీఏ అధికారులతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రత్యేకం గా సమావేశం నిర్వహించారు. కేటీసీడీఏ యాక్ట్ 2014లోని మార్గనిర్దేశకాలను తెలుసుకున్నారు. చెరువుల విస్తీర్ణం, వాటి ఎఫ్‌టిఎ ల్, బఫర్ జోన్లతో పాటు, చెరువులకు చెరువులకు మధ్య లింక్‌గా ఉండే వరదనీటి కాలువలను ఖరారు చేసేందుకు పలు సాంకేతిక వ్యవస్థలను, రికార్డుల వివరాలను వినియోగించాలని హైడ్రా నిర్ణయించింది. చెరువుల తూములు, మత్తెడి(అలుగు)లను కూడా ఏర్పాటుచేసి భవిష్యత్తు తరాలకు నీటి వనరులను అందించేందుకు సన్నాహాలుచేస్తుంది.
చెరువుల నిర్ధారణ ఇలా..
1977 నుంచి 2024 నాటికి ఔటర్ లోపలివైపున ఉన్న చెరువులకు సంబంధించిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ, సర్వే ఆఫ్ ఇండియా, తెలంగాణ సర్వే విభాగం, రెవెన్యూ రికార్డుల్లోని వివరాలు, ఇరిగేషన్ విభాగం నుంచి సమాచారం, విలేజ్ మ్యాప్స్‌ల ఆధారంగా చెరువుల విస్తీర్ణాన్ని నిర్ధారించి, వాటికి ఎఫ్‌టిఎల్, బఫర్ జోన్‌లను ఖరారు చేయాలని హైడ్రా సిద్దమవుతోంది. చెరువులు ముఖ్యంగా గొలుసుకట్టు చెరువుల వ్యవస్థ దెబ్బ తినకుండా వాటిని పునరుద్దరించాలని ముందుగా 12 చెరువులను అభివృద్ది చేసేందుకు ఎంపిక చేసి ఆ చెరువుల మోడల్‌గా వాటి తరహాలోనే మిగతా వాటిని తీర్చిదిద్దాలనే దిశగా హైడ్రా సన్నాహాలు చేస్తుంది. చెరువుల పరిరక్షణ, జల, వాయు కాలుష్యములేని చెరువులు ఉండాలనే లక్ష్యంతో కాలుష్య నియంత్రణమండలి అధికారులతోనూ ఎప్పటికప్పుడు సమావేశమవుతూ.. చెరువుల్లోకి కాలుష్య రసాయణాలు, ఇతర కారకాలు చేరకుండా తగిన విధంగా చర్యలు తీసుకోవాలని, ఏర్పాట్లు చేయాలని హైడ్రా సిద్దమైంది. నాగపూర్ సీఎస్‌ఐఆర్- నీరి డైరెక్టర్ డిఆర్‌ఎఎన్ వైద్య, నీరి హైదరాబాద్ జోనల్ చీఫ్ సైంటిస్ట్ షేక్ బాషా తదితరులతోనూ కమిషనర్ రంగనాథ్ చర్చించారు.
పెరుగుతున్న పట్టణీకరణ..
ముఖ్యంగా తెలంగాణలో నగరీకరణ వేగంగా జరుగుతోందనీ, దేశంలో పట్టణీకరణ కంటే తెలంగాణలో 12 శాతం అధికంగా ఉందని హైడ్రా గుర్తించింది. ప్రస్తుతం తెలంగాణలో ఉన్న 47 శాతం పట్టణీకరణ 2050 నాటికి 75 శాతానికి చేరుకుంటుందని నిపుణులు సూచిస్తున్న నేపథ్యంలో ప్రకృతి వనరులను కాపాడటంపై రంగనాథ్ ఫోకస్ పెట్టినట్టు తెలిసింది. పట్టణీకరణలో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ నగరంలో ఇండ్ల స్థలాలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడిందనీ, భూమికి విలువ పెరిగిన కొన్ని చోట్ల చెరువులు కబ్జాకు గురవుతున్నట్టు హైడ్రా గుర్తించింది.
నగరంలో 61 శాతం చెరువులు ఇప్పటికే కనుమరుగయ్యాయనీ లెక్కలున్నాయి. మిగిలిన 39 శాతం చెరువులను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత రాష్ట్రంపై ఉందనేది వెల్లడిస్తూనే మరో 15 ఏళ్లకు నగరంలో చెరువులు కనిపించవనే ఉద్దేశ్యంతో హైడ్రా వేగంగా చర్యలకు శ్రీకారం చుట్టిందనేది అధికారుల అభిప్రాయం. ఎన్‌ఆర్‌ఎస్‌సిని లేక్ ప్రొటెక్షన్ కమిటీలో భాగస్వామి కావాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆహ్వానించారు. న్యాయపరమైన సమస్యలు ఎదుర్కొనేందుకు మాజీ న్యాయమూర్తులు, న్యాయవాదులతోనూ హైడ్రా ప్రత్యేక సమావేశం నిర్వహించి చెరువులను కాపాడే క్రమంలో హైడ్రాకు మద్దతుగా నిలువాలని కమిషనర్ రంగనాథ్ కోరడంతో వారు తమ మద్దతు ప్రకటించారు.