Monday, October 21, 2024

కూల్చివేతలపై హైడ్రా వెనక్కి

- Advertisement -
- Advertisement -

చెరువుల్లో, ప్రభుత్వస్థలాల్లో అనుమతులుంటే ఆందోళనవద్దు
నిన్నటి వరకు రాజీలేకుండా నేలమట్టం
ఇప్పుడేమో.. కూల్చివేయం
మరి అనుమతులున్నా కూల్చేసినవారి పరిస్థితేమిటి..?
రూ. 4.70 కోట్లు నష్టపోయానంటోన్న బాధితుడు

మనతెలంగాణ, సిటీబ్యూరో: కూల్చివేతల విషయంలో హైడ్రా వెనక్కి తగ్గింది. చెరువుల్లో అనుమతులున్న భవనాలను కూల్చివేయమని తేల్చేసింది. నిన్నటి వరకు చెరువుల్లో నిర్మించిన ఆక్రమణలను నిర్దాక్షిణ్యంగా కూల్చివేసి హడలెత్తించిన హైడ్రా.. ఇంతలోనే చేతులు ఎత్తేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇప్పటి వరకు చెరువుల్లో, బఫర్ జోన్లలో, ప్రభుత్వ స్థలాల్లోనూ నిర్మాణ అనుమతులు మంజూరైన వాటిని కూడా వదలకుండా నేలమట్టం చేసిన హైడ్రా.. ఇప్పుడు ఉన్నట్టుండి అనుమతులుంటే వాటిని కూల్చమని చెప్పడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

తమకు ఎల్‌ఆర్‌ఎస్ ఉందనీ, అనుమతులు కూడా ఉన్నాయనీ, పర్మిషన్‌లున్న ప్లాట్లను కొనుగోలు చేశామని ఎంత మొత్తుకున్నా.. వాటిని నేలమట్టం చేసిన హైడ్రా.. ఇప్పుడు అనుమతులుంటే కూల్చబోమని ప్రకటించడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. తాము కాగితాలు చూపిస్తూ తమకు అధికారిక అనుమతులు మంజూరయ్యాయని చెప్పితే….అందుకు స్పందించిన హైడ్రా..అవి ఎక్స్‌పైరీ అయ్యాయనీ, అధికారులను తప్పుదోవ పట్టించి అనుమతులు తీసుకున్నారనీ, తప్పుడు అనుమతులంటూ పేర్కొని కూల్చివేతలు చేపట్టింది విదితమే.

రెవెన్యూ నిర్లక్షంతోనే అనుమతులు..

మల్లంపేట్, కిష్టారెడ్డి పేట్, అమీన్‌పూర్ ప్రాంతాల్లో కూల్చివేసిన నిర్మాణాలకు అనుమతులు మంజూరైనట్టు కొందరు వెల్లడించినా హైడ్రా కూల్చివేసింది. తమకు ఎల్‌ఆర్‌ఎస్ కూడా ఉందని, ఎల్‌ఆర్‌ఎస్ ద్వారా బిల్డింగ్ పర్మిషన్ తీసుకున్నామని చెప్పినా మూడేసి అంతస్థుల భవనాలను నేలమట్టం చేసింది హైడ్రా. అయితే, అవి ప్రభుత్వ భూముల్లో ఉన్నాయని హైడ్రా పేర్కొన్నది. వాస్తవానికి అక్కడ ఎమ్మార్వో సూచన మేరకు, రెవెన్యూ అధికారులకు మద్దతుగానే హైడ్రా చర్యలు తీసుకున్నట్టు అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. నిర్మాణ అనుమతులు మంజూరు చేసిన అధికారులకు అది ప్రభుత్వ భూమి అని తెలియనప్పుడు బిల్డర్లకు ఎలా తెలుస్తుంది..? అధికారులే గుర్తించనప్పుడు నిర్మాణాదారులకేమి తెలుస్తుంది..?

కిష్టారెడ్డి పేట్‌లో మూడేసి అంతస్థులుగా బహిరంగంగానే నిర్మిస్తుంటే రెవెన్యూ అధికారులు ఏమి చేశారనేది ప్రధాన విమర్శ. ప్రభుత్వ భూమిలో అనుమతి కోసం వచ్చిన దరఖాస్తును అప్పుడే తిరస్కరిస్తే.. అనుమతులు మంజూరు చేయకుడా ఉంటే.. బిల్డర్‌లు అక్కడ నిర్మాణం చేసేవారు కాదు గదా..? ప్రభుత్వ భూమి ఏఏ గ్రామాల్లోని ఏఏ సర్వేనెంబర్లలో ఇన్ని ఎకరాలుగా ఉందనేది.. ఇటు హెచ్‌ఎండిఏ, మునిసిపల్, అటు గ్రామ పంచాయితీ అధికారులకు అరెవెన్యూ అధికారులు తెలియజేసినా.. ఓ నివేదిక అందజేసినా ఆయా సర్వే నెంబర్లలో ఇటు హెచ్‌ఎండీఏ, మునిసిపల్.. అటు గ్రామపంచాయితీలు బిల్డింగ్ నిర్మాణ అనుమతులు మంజూరు చేసే అవకాశాలు ఉండవు కదా..? అంటూ సర్వత్రా ప్రశ్నలు బలంగా వినిపిస్తున్నాయి. రెవెన్యూ అధికారుల పర్యవేక్షణ లోపం వల్ల నిర్మాణాలు వస్తున్నాయనీ, వారి బాధ్యతారాహిత్యం వల్లనే బిల్డింగ్ పర్మిషన్లు మంజూరు చేసే పరిస్థితి ఏర్పడుతుందనేది నిర్మాణాదారులు ఆగ్రహం.

అయోమయం..

చెరువుల్లో, ప్రభుత్వ స్థలాల్లో నిర్మాణ అనుమతులు మంజూరై ఉన్నాయి. కానీ, అవి ఎఫ్‌టిఎల్, బఫర్ జోన్లలో, ప్రభుత్వ స్థలాల్లో ఉన్నాయనేది ఇప్పుడు తేలింది. మరి వాటికి నివాసయోగ్యత దృవీకరణ పత్రం(ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఓసి) మంజూరు చేయాల్సి ఉంది. మరి ఎఫ్‌టిఎల్, బఫర్ జోన్లలో, ప్రభుత్వ స్థలాల్లో అనుమతులున్న భవనాలకు ఓసిలను విడుదల చేస్తారా..? లేదా..? అనేది వెల్లడించాల్సిన బాధ్యత అధికారులపై ఉన్నది. కూల్చివేయమని హైడ్రా వెల్లడించిన దరిమిలా.. మరి అనుమతులున్న వాటికి ఓసిని విడుదల చేస్తారా..? లేరా..? అనేది తెలపడంలేదు.

అనుమతులుంటే కూల్చమని చెప్పిన హైడ్రా.. లేదా ముఖ్యమంత్రి ప్రకటన బాగానే ఉన్నది. కానీ, అనుమతులున్న వాటికి ఓసిలను రిలీజ్‌చేస్తారా..? లేదా..? అనేది కూడా ప్రకటిస్తే బాగుండేదని, ఆ బాధ్యత ముఖ్యమంత్రిపై ఉన్నదని, ఎందుకంటే.. మునిసిపల్ శాఖ మంత్రి కూడా సిఎం రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. ఓసిల విషయాన్ని కూడా వెల్లడిస్తే బాగుంటుందనేది నిర్మాణదారులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

పరిహారమివ్వాలి..

భూమిని కొనుగోలు చేసి అభివృద్ది రుసుంలు చెల్లించి నిర్మాణ అనుమతుల తీసుకున్న వారి భవనాలు ప్రభుత్వ భూముల్లో ఉన్నాయని కూల్చివేసిన ప్రభుత్వం.. ఇప్పుడు అనుమతులుంటే కూల్చమని తేల్చేసింది. అయితే, అనుమతులు తీసుకున్నా.. కూల్చివేసిన భవనాలకు పరిహారం ఇవ్వాలనే డిమాండ్ తెరపైకి వస్తుంది. పర్మిషన్ తీసుకుని, నిర్మించిన భవనాలను కూల్చడంతో బిల్డర్లు చాలా నష్టపోయారు. వారికి ప్రభుత్వం పరిహారం అందిస్తుందా..? అనేది ప్రశ్న బలంగా వినిపిస్తుంది. కోట్లాది రూపాయలు వెచ్చించి నష్టపోయామనీ, ఫ్లాట్లు కొనుగోలు చేసిన వారు కూడా తమకు పరిహారమివ్వాలని కోరుతున్నారు.

రూ. 4.70 కోట్లు నష్టపోయా ః కళ్యాణ్.

అమీన్‌పూర్ మండటం కిష్టారెడ్డిపేట్‌లో ఎల్‌ఆర్‌ఎస్ ఉండి, గ్రామపంచాయితీ నుంచి జీ+2 అనుమతులు తీసుకుని బిల్డింగ్ పూర్తి చేసే సమయంలో రెవెన్యూ, హైడ్రా అధికారులు కలిసి కూల్చివేశారు. ఈ బిల్డింగ్ నిర్మాణం కోసం ప్లాట్‌ను రూ. 2 కోట్లు వెచ్చించి తీసుకున్నానని, రూ. 2.70 కోట్లు ఖర్చుచేసి భవనాన్ని నిర్మించినట్టు బిల్డర్ కళ్యాణ్ వెల్లడించారు. నిర్మాణ అనుమతులు ఉన్నా కూల్చివేడయంలో రూ. 4.70 కోట్లు నష్టపోయానని, తమకు ప్రభుత్వమే న్యాయం చేయాలని కళ్యాణ్ కోరుతున్నారు. తమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని ప్రాధేయపడుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News