Wednesday, January 22, 2025

హైడ్రా హడల్

- Advertisement -
- Advertisement -

చెరువులు, కుంటలు, నాలాలు, అడవులు మటుమాయం చేసి ఆకాశహర్మ్యాలు నిర్మించి వ్యాపారాలు చేస్తూ కోట్లకు పడగలెత్తిన బడా రాజకీయ నాయకులను ప్రశ్నించే వారి గొంతు నొక్కే పాలకులు ఉన్నంత వరకు వ్యవస్థ మారదు. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కి అవినీతి, అన్యాయంతో అధికారం దక్కించుకున్నవారు ప్రజా ప్రతినిధులా? కమ్ముకువస్తున్న కాలుష్యానికి, ఆకలి చావులకు, రుతువులు గతులు తప్పడానికి ప్రకృతిని ఏడిపించేవారు పాలకులా? ప్రజలే కళ్లుతెరిచి నిరంకుశ పాలనకు ఎదురు తిరిగి రాజును ఉరితీసిన సంఘటనలు చరిత్రలో నిలిచి ఉన్నాయి అన్నసంగతి అవినీతి పాలకులు మరచిపోరాదు. శతాబ్దాలు గడిచినా ఆక్రమణలకు కళ్లెం వేసే మగాడు దమ్ముధైర్యమున్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంకా పుట్టలేదా? అయితే ఎక్కడా? అన్న ప్రశ్నకు దీటుకు సమాధానం చెప్పడానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీన్‌లోకిదిగి హైడ్రాను శక్తివంతమైన, తిరుగులేని ఆయుధంగా వాడుతున్నారు అది ఆయనకే చెల్లింది.

ఆక్రమణలు చేసుకున్నవారికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. కనీవినీ ఎరుగని రీతిలో దూసుకుపోతున్నారు. ఇంక రోడ్లపై నీరు నిలిస్తే ఒట్టు, జలాశయాలే నీటిని ఒడిసిపట్టు. రాజకీయాలకు అతీతంగా హైడ్రా పంజావిప్పడం అందరూ హర్షించదగిన విషయం. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొడక్షన్ ఏజెన్సీ (హైడ్రా) ఒక స్వంతత్ర సంస్థగా జులై 2024లో ఏర్పాటు చేయడం రాజకీయ చరిత్రలో ఒక మైలురాయి వంటిది. పార్టీలకు అతీతంగా ఒత్తిడిలకు తలొగ్గని మంచి పేరున్న ఐపిఎస్ అధికారి ఎవి రంగనాథ్ ను ఏరుకొని కోరుకొని మొదటి కమిషనర్‌గా నియమించడం ప్రశంసనీయం. నీతినిజాయితీకి పెద్ద పీట వేసినట్లే. 1996 డిఎస్‌పి బ్యాచ్ గా కెరీర్ ప్రారంభించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ ప్రాంతాలలో పలు బాధ్యతలు నిర్వహించి రాష్ట్రపతి గ్యాలంటరీ అవార్డు సొంతం చేసుకున్నారు.

హైడ్రా ప్రధాన లక్ష్యం హైదరాబాద్‌లోని చెరువులు, పార్కులు, లే అవుట్లలోని ఖాళీస్థలాలు, ఆటస్థలాలు, నాలాలు, రహదారులు, ఫుట్‌పాత్‌ల పరిరక్షణ, వాటిలోని ఆక్రమణల తొలగింపు చర్యలు చేపట్టడం సాహసోపేతమైన, చాలెంజింగ్ టాస్క్‌గా చెప్పవచ్చు. జాతీయ విపత్తుల నిర్వహణ చట్టానికి అనుగుణంగా ఏర్పాటైన హైడ్రా వ్యవస్థాగత నిర్మాణం విధివిధానాలపై ప్రభుత్వ ఆదేశానుసారం మరింత లోతుగా అధ్యయనం చేయడం కూడా జరిగింది. దీనికి త్వరలోనే చట్టబద్ధత కల్పించడానికి తెలంగాణ ప్రభుత్వం నడుంబిగించింది. హైడ్రా ఏర్పాటైన కొద్ది రోజుల్లోనే రాకెట్ స్పీడ్‌తో ముందుకెళ్ళింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అక్రమ కట్టడాలను పాత, కొత్త అనే తేడా లేకుండా కబ్జా అని తేలితే చాలు సీన్‌లోకి ఎంట్రీ ఇచ్చేస్తున్నది. అక్రమ కట్టడాల విషయంలో ఉక్కు పాదంమోపుతుంది. నాలాలో కబ్జా జరిగిందని ఫిర్యాదు అందితే వెంటనే రంగంలోకి దూకి అసలు విషయాలు బట్టబయలు చేస్తున్నది. సామాన్యులు, పెద్దవాళ్లు అనే తేడా లేకుండా నిష్పక్షపాతంగా చర్యలు తీసుకుంటుందనే సందేశాన్నీ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నది. ఇది శుభపరిణామం.

టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్‌ను గంటల వ్యవధిలోనే నేలమట్టంచేసింది. ఈ నిర్మాణం చాలా ఏళ్లుగా ఫిర్యాదులు అందినప్పటికీ అడుగుముందుకు పడలేదు. హైడ్రాకు ఫిర్యాదు ఆధారంతో నేరుగా సీన్‌లోకి వెళ్ళింది గంటల వ్యవధిలోనే ఆక్రమణకు గురైన ప్రాంతంలో చేపట్టిన నిర్మాణాలను నేలమట్టంచేసింది. ఈ చర్యలతో హైదరాబాద్ ప్రస్తావన మరో లెవల్‌కు వెళ్ళిపోయింది. హైడ్రాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చైర్మన్‌గా బాధ్యతలు తీసుకోవడం, దానిపై అజమాయిషీ చేయడం వలన ప్రజాప్రతినిధులు కూడా నోరుమెదపడం లేదు. రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల మంత్రులతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డిజిపి, ప్రిన్సిపల్ సెక్రెటరీ, జిహెచ్‌ఎంసి మేయర్ కూడా దీంట్లో సభ్యులుగా ఉండడం హైడ్రాకు కొండంత బలాన్నిచేకూర్చింది. మునుపెన్నడూ లేనంతగా ప్రజల్లో సంతోషం వెల్లివిరిసింది. కాని గుడిసెలు వేసుకొని జీవనం సాగిస్తున్న శ్రామికులు మాత్రం భోరుమని విలపిస్తున్నారు. ఇదే అదనుగా చేసుకొని విపక్షాలు రాజకీయం చేస్తున్నాయి. నిరాశ్రయులైన వారికి స్థలం ఇప్పించే బాధ్యత ప్రభుత్వం పైనే ఉందనే సంగతి మరచి పోవద్దు.

నోటీసులు లేకుండా కూల్చివేయడంతో హైకోర్టు ప్రభుత్వ చర్యలు తప్పుపట్టి వివరణ కోరింది. చట్టబద్ధంగా విమర్శలకు తావివ్వకుండా మున్ముందు ఉండడానికి తెలంగాణ ప్రభుత్వం చర్యలు కూడా చేపడుతుందని ఆశిద్దాం. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో ఉన్న చెరువుల రికార్డులన్నింటినీ హైడ్రా పరిశీలిస్తున్నది. గత రికార్డుల ప్రకారం ఎన్ని ఎకరాల్లో విస్తరించి ఉండేది ప్రస్తుతం ఎంత ఉందనే దానిపై ఆరా తీస్తున్నది. క్షేత్రస్థాయిలో డేగ కన్నువేసింది. ఫిర్యాదులు స్వీకరించేందుకు త్వరలోనే ప్రత్యేక వ్యవస్థను కూడా తీసుకొని వచ్చే అవకాశం ఉంది. నిజానికి చెరువులు, పార్కులు, ప్రభుత్వ భూములను కాపాడడం అనుకున్నంత సులభం కాదు. ఇప్పటికే ఎన్నో భూములు ఆక్రమణలకు గురై భవనాలుగా అవతారం ఎత్తినాయి. ఇటీవల ఏర్పాటైన హైడ్రాకు ఎన్నో సవాళ్లు ఎదుర్కోవలసి ఉన్నది. తగ్గేదే లే అన్నట్లు ఉంటేనే హైడ్రా అనుకున్నది సాధించవచ్చు. నిజానికి హైదరాబాద్ పరిధిలో ఎన్నో కట్టడాలు రాజకీయ నాయకుల కనుసన్నలలో జరిగాయి అనడంలో అతిశయోక్తి లేదు. ఇప్పుడు వాటిని కూల్చివేయడం చాలా మంది నేతలకు మింగుడు పడడంలేదు.

అక్రమ నిర్మాణాలకు పర్మిషన్ ఇచ్చిన అధికారులపై కూడా చర్యలు ఉంటాయని హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్పడం నాయకుల గుండెల్లో గుబులు పుట్టిస్తుంది. ఇదే జరిగితే చాలా మంది అధికారుల బరితెగించిన బాగోతం బట్టబయలు అవుతుంది. మొదటగా ఎఫ్‌టిఎల్, ఆ తర్వాత బఫర్ జోన్‌పై ఫోకస్ ఉంటుందని కమిషనర్ నొక్కి వక్కాణించారు. హడలెత్తిస్తున్న హైడ్రా ఫిర్యాదులతో క్షేత్ర స్థాయిలో పరిశీలనలు చేస్తున్నది. మంచి పనులు చేసే హైడ్రాపై విమర్శలు గుప్పించే రాజకీయ పార్టీలు వారి హయాంలో ప్రభుత్వ భూములు కబ్జాలు చేసి, చెరువులు, కుంటలు, జలాశయాలు మాయం చేస్తే ఎందుకు కళ్లు మూసుకొని కూర్చుందో సమాధానం చెప్పాలి? రాజకీయాలకు అతీతంగా హైడ్రా కార్యక్రమాలకు అందరూ చేయూత నివ్వాలి. అప్పుడే భాగ్యనగరం ప్రపంచ పటంలో ఒక ప్రత్యేకతను సంపాదించుకుంటుంది.

పూసాల సత్యనారాయణ
9000792400

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News