Sunday, December 22, 2024

హైడ్రా బాదుడే

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/విద్యానగర్: రాంనగర్ మణెమ్మ వీధిలోని రెండు కట్టడాలను హైడ్రా యంత్రాంగం కూల్చివేసింది. రోడ్డును ఆక్రమించి నిర్మించారన్న ఆరోపణల నేపథ్యంలో విక్రమ్, సాయియాదవ్‌లకు చెందిన 50 గజాల స్థలంలో ఉన్న ఒక గది, ఎల్లయ్య పేరుతో ఉన్న మూడు అంతస్తుల భవనంలో సగభాగం కూ ల్చివేశారు. ఈ భవనంలోనే కింద కల్లు కాంపౌండ్ ఉండగా, పై అంతస్తుల్లో వైష్ణ వి బార్ అండ్ రెస్టారెంట్ నిర్వహిస్తున్నారు. శుక్రవారం ఉదయం ఎనిమిదిన్నర గంటలకే పెద్ద సంఖ్యలో హైడ్రా సిబ్బంది మణెమ్మ వీధికి మూడు బుల్డోజర్లతో చేరుకున్నారు. జిహెచ్‌ఎంసి సర్కిల్ 15 ఏసిపి దేవేందర్, సెక్షన్ అధికారి హఫీజ్ ల పర్యవేక్షణలో ముందుగా మణెమ్మ వీధి చివర ఉన్న విక్రమ్ యాదవ్ ఇంటిని కూల్చిన హైడ్రా సిబ్బంది అనంతరం వెనుక వైపు ఉన్న కల్లు కాంపౌండ్ రేకుల షెడ్డును కూల్చారు. డ్రిల్ మిషన్లతో వైష్ణవి బార్ మూడు అంతస్తుల స్లాబ్ లను తొలగించారు. ముషీరాబాద్ ఇన్‌స్పెక్టర్ రాంబాబు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోలీసులు మోహరించి బందోబస్తు నిర్వహించగా రాంనగర్ ప్రధాన మార్గంలో వాహనాల రాకపోకలను ట్రాఫిక్ పోలీసులు నియంత్రించారు.

రాంనగర్ చౌరస్తాకు సమీపంలో ఉన్న మణెమ్మ వీధి రోడ్డు 24 ఫీట్ల వెడల్పు ఉండగా పెద్ద ఎత్తున ఆక్రమణలు జరిగాయని స్థానికులు కొందరు హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు ఫిర్యాదు చేశారు. దీంతో బుధవారం సాయంత్రం బస్తీలో పర్యటించిన ఆయన ఇళ్ళ నిర్మాణాలకు సంబంధించిన దస్తావేజులు పరిశీలించి వాస్తవ ఆక్రమణలను గుర్తించి సమగ్ర నివేదిక ఇవ్వాలని రెవిన్యూ, టౌన్ ప్లానింగ్ అధికారులను ఆదేశించిన సంగతి తెలిసిందే. రెండు విభాగాల అధికారులు గురువారం సర్వే చేసి ఇచ్చిన నివేదికలకు అనుగుణంగా రోడ్డును ఆక్రమించి నిర్మించిన రెండు కట్టడాలను శుక్రవారం హైడ్రా, టౌన్ ప్లానింగ్ సిబ్బంది కూల్చివేసారు. అయితే 1966 నుంచి ఇక్కడ నివసిస్తున్నామని, నాలుగు దశాబ్దాల నుంచి ఆస్తిపన్ను కడుతున్నామని బాధితులు విక్రమ్, సాయి యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ మొత్తం 485 గజాల స్థలం తమకు ఉందని, రోడ్డు మధ్యలో నిర్మించామని చెపుతున్న ఇంటి పైన పర్మనెంట్ స్టే ఇస్తూ కోర్టు ఆదేశాలు ఉన్నాయని తెలిపారు. ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా, న్యాయస్థానం ఉత్తర్వులను కాదనీ, తమ ఇంటితో పాటు పక్కనే ఉన్న బంగారు మైసమ్మ ఆలయాన్ని సైతం కూల్చి వేశారని ఆందోళన వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News