జింకను వేటాడి చంపిన హైనా
తిమ్మాజిపేట మండలంలో హైనాల సంచారం
ఫారెస్టు అధికారుల పరిశీలన
మనతెలంగాణ/నాగర్‌కర్నూల్ ప్రతినిధి: నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండల కేంద్రంలో హైనా కలకలం రేపింది. మండల కేంద్రానికి సమీపంలో చెన్నయ్య గుట్ట వద్ద శనివారం తెల్లవారుజామున చుక్కల జింకను హైనా వేటాడి చంపింది. జింక సగభాగాన్ని హైనా తిని వదిలేయగా ఉదయం స్థానికులు జింక కళేబరాన్ని గుర్తించి సర్పంచ్ వేణుగోపాల్ గౌడ్‌కు సమాచారం అందించారు. దీంతో సర్పంచ్ నాగర్‌కర్నూల్ అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.
అటవీశాఖ అధికారి పర్వేజ్ అహ్మద్ తన సిబ్బంది కలిసి ఘటనా స్థలానికి చేరుకొని ఆనవాళ్ళను సేకరించారు. ముందుగా చిరుత పులి జింకను వేటాడి చంపి ఉంటుందని భావించిన స్థానికులు అటవీశాఖ అధికారులు కాలి ముద్రలను గుర్తించి హైనాగా నిర్ధారించారు. ఇదిలా ఉండగా వారం రోజుల క్రితం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా టిప్పర్ నడుపుతున్న డ్రైవర్ చిరుతపులి కనిపించిందని తెలిపాడు. ఇదిలా ఉండగా తిమ్మాజిపేట మండలం గుట్టలు, అడవులు ఉండడంతో ఈ ప్రాంతంలో గతంలో జింకలు గుట్టలు, పొలాల్లో సంచరిస్తున్నట్లు పలువురు రైతులు తెలిపారు. గతంలో చేగుంట సమీపంలో చిరుతపులలు సంచరించిన విషయం విధితమే. ఇదిలా ఉండగా శనివారం హైనా దాడిలో మృతి చెందిన జింకకు పోస్టుమార్టం నిర్వహించి అటవీశాఖ అధికారులు దానిని స్వాధీనం చేసుకున్నారు. ఇదిలా ఉండగా తిమ్మాజిపేట పరిసరాలలో హైనాలు సంచరిస్తున్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు ఆయా గ్రామాల సర్పంచ్‌లకు, ప్రజలను సూచించారు.