న్యూఢిల్లీ: ఆప్ మంత్రి కైలాశ్ గహ్లోత్ ఈడీ విచారణ తర్వాత తొలిసారి మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. “నన్ను అడిగిన ప్రవ్నలకు సమాధానం ఇచ్చాను. ప్రభుత్వం సివిల్ లేన్స్‌లో నాకు బంగ్లాను కేటాయించింది. కానీ నేను వసంత్‌కుంజ్ లోని ఇంట్లోనే ఉంటున్నాను. నా పిల్లలు అక్కడికి రావడానికి ఇష్టపడడం లేదు. దీంతో ఆ బంగ్లా లో విజయ్ నాయర్ ఉంటున్నాడు. ఈడీ ఎలాంటి క్రాస్ క్వశ్చన్స్ అడగలేదు. నాకు జారీ అయిన రెండు సమన్లకే స్పందించి విచారణకు హాజరయ్యాను. మరికొంత సమయం కోరాను. ఇక గోవా ఎన్నికల ప్రచారంలో నేను పాల్గొనలేదు. అక్కడ ఏం జరిగిందో నాకు తెలియదు’ అని పేర్కొన్నారు.
మంత్రి కైలాశ్ గహ్లోత్‌కు ఈడీ శనివారం నోటీసులిచ్చింది. విచారణ నిమిత్తం అదే రోజు దర్యాప్తు సంస్థ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. దీంతో ఆయన ఈడీ కార్యాలయానికి వెళ్లారు. కేసుకు సంబంధించి మంత్రిని ప్రశ్నించిన ఈడీ అధికారులు, ఆయన వాంగ్మూలాన్ని రికార్డ్ చేశారు. గహ్లోత్ ప్రస్తుతం కేజ్రీవాల్ కేబినెట్‌లో హోం రవాణా న్యాయశాఖ మంత్రిగా ఉన్నారు. మద్యం విధానంపై ముసాయిదాను తయారు చేసే సమయంలో అప్పటి ఆప్ కమ్యూనికేషన్ ఇన్‌ఛార్జి విజయ్ నాయర్, గహ్లోత్ అధికారిక నివాసాన్ని వినియోగించుకున్నట్టు ఆరోపణలు ఉన్నాయి.