Sunday, January 19, 2025

నేను జైలులో లేను.. ఎగిసి పడుతున్న ప్రజా చైతన్యంలో ఉన్నాను

- Advertisement -
- Advertisement -

తెలుగు ప్రజలకు చంద్రబాబు బహిరంగ లేఖ
ఆలస్యమైనా న్యాయం గెలుస్తుంది.. త్వరలోనే బయటికొస్తా
అందరికీ దసరా శుభాకాంక్షలు

మన తెలంగాణ/హైదరాబాద్ : జైలు నుంచి తెలుగు ప్రజలకు టిడిపి అధినేత చంద్రబాబు బహిరంగ లేఖ రాశారు. ‘తాను జైలులో లేను.. ప్రజల హృదయాల్లో ఉన్నాన’ని చెప్పుకొచ్చారు. ప్రజల నుంచి తనను ఒక్క క్షణం కూడా ఎవ్వరూ దూరం చేయలేరన్నారు. 45 ఏళ్లుగా తాను కాపాడుకుంటూ వస్తున్న విలువలు, విశ్వసనీయతని చెరిపేయలేరని స్పష్టం చేశారు. ఆలస్యమైనా న్యాయం గెలుస్తుంది తాను త్వరలో బయటకొస్తానని వెల్లడించారు. ములాఖతో భాగంగా తనను కలిసిన కుటుంబసభ్యులకు తెలుగు ప్రజలనుద్దేశించి తాను రాసిన లేఖని అందజేశారు. ప్రజల కోసం, రాష్ట్ర ప్రగతి కోసం రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తానని స్పష్టపర్చారు. తెలుగు ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న ప్రజా చైతన్యంలో ఉన్నానని, విధ్వంస పాలన అంతం చేయాలనే మీ సంకల్పంలో ఉన్నానని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రజలే తన కుటుంబం, జైలు గోడల మధ్య కూర్చుని ఆలోచిస్తూ ఉంటే 45 ఏళ్ల ప్రజా జీవితం తన కళ్లముందు కదలాడుతోందన్నారు. తన రాజకీయ ప్రస్థానమంతా తెలుగు ప్రజల అభివృద్ధి, సంక్షేమమే లక్షంగా సాగిందని చెప్పిన ఆయన దీనికి ఆ దేవుడితో పాటు మీరే సాక్షమని ప్రజలనుద్దేశించి వెల్లడించారు.

ఓటమి భయంతో తనను జైలు గోడల మధ్య బంధించి ప్రజలకు దూరం చేశామనుకుంటున్నారని విశ్లేషించారు. తాను మీ మధ్య తిరుగుతూ ఉండకపోవచ్చు, కానీ అభివృద్ధి రూపంలో ప్రతి చోటా కనిపిస్తూనే ఉంటానని వెల్లడించారు. సంక్షేమం పేరు వినిపించిన ప్రతీసారి తాను గుర్తుకొస్తూనే ఉంటానన్నారు. ప్రజల్నించి ఒక్క రోజు కాదు కదా ఒక్క క్షణం కూడా నన్ను దూరం చేయలేరన్నారు. కుట్రలతో తనపై అవినీతి ముద్ర వేయాలని ప్రయత్నించారు కానీ తాను నమ్మిన విలువలు, విశ్వసనీయతని ఎన్నడూ చెరిపేయలేరని వివరించారు. ఈ చీకట్లు తాత్కాలికమేనని ఆయన చెప్పుకొచ్చారు. సంకెళ్లు తన సంకల్పాన్ని బంధించలేవన్నారు. జైలుగోడలు తన ఆత్మ విశ్వాసాన్ని దెబ్బతీయలేవని, జైలు ఊచలు తనను ప్రజల్నించి దూరం చేయలేవనానరు. తాను తప్పు చేయనని, చేయనివ్వనని స్పష్టపర్చారు.

ఈ దసరాకి పూర్తిస్థాయి మ్యానిఫెస్టో విడుదల చేస్తానని రాజమహేంద్రవరం మహానాడులో ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. అదే రాజమహేంద్రవరం జైలులో తనను ఖైదు చేశారన్నారు. త్వరలో బయటకొచ్చి పూర్తిస్థాయి మ్యానిఫెస్టో విడుదల చేస్తానని వెల్లడించారు. తన ప్రజల కోసం, వారి పిల్లల భవిష్యత్తు కోసం రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తానన్నారు. ఎప్పుడూ బయటకు రాని నందమూరి తారకరామారావు బిడ్డ, తన భార్య భువనేశ్వరని తాను అందుబాటులో లేని ఈ కష్టకాలంలో ప్రజల్లోకి వెళ్లి వారి తరపున పోరాడాలని తాను కోరానని, ఆమె అంగీకరించిందని వెల్లడించారు. తన అక్రమ అరెస్టుతో తల్లడిల్లి మృతి చెందిన వారి కుటుంబాలని పరామర్శించి, అరాచక పాలనను ఎండగట్టడానికి ‘నిజం గెలవాలి’ అంటూ మీ ముందుకు వస్తోందని పేర్కొన్నారు.

జనమే తన బలం, జనమే తన ధైర్యం, దేశ విదేశాలలో తన కోసం రోడ్డెక్కిన ప్రజలు వివిధ రూపాల్లో మద్దతు తెలుపుతున్నారని వెల్లడించారు. తన క్షేమం కోసం కుల, మత, ప్రాంతాలకతీతంగా చేసిన ప్రార్థనలు ఫలిస్తాయన్నారు. న్యాయం ఆలస్యం అవ్వొచ్చునేమో కానీ అంతిమంగా గెలిచేది మాత్రం న్యాయమేనని చెప్పారు. మీ అభిమానం, ఆశీస్సులతో త్వరలోనే బయటికొస్తానన్న ధీమాను కనబర్చారు. అంతవరకు నియంత పాలనపై శాంతియుత పోరాటం కొనసాగించాలని పిలుపునిచ్చారు. చెడు గెలిచినా నిలవదు, మంచి తాత్కాలికంగా ఓడినట్లు కనిపించినా కాలపరీక్షలో గెలిచి తీరుతుందన్నారు. త్వరలోనే చెడుపై మంచి విజయం సాధిస్తుందని చంద్రబాబు తన బహిరంగ లేఖలో పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News