షిగ్గాన్ (కర్ణాటక): కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీ పరాజయం పాలవడానికి ముఖ్యమంత్రిగా తానే పూర్తి బాధ్యత వహిస్తానని మరెవరూ దీనికి కారణం కాదని రాష్ట్రముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై వెల్లడించారు. రానున్న రోజుల్లో బాధ్యతాయుత విపక్షంగా పార్టీ పనిచేస్తుందని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ విజయానికి ప్రధాన కారణాల్లో ఆ పార్టీ సమర్ధనీయమైన ఎన్నికల వ్యూహం ఒకటని ఆయన అన్నారు.
ఎన్నికల ఫలితాలు తుది దశల్లో ఉన్నాయని, అయినా ప్రజాతీర్పును అత్యంత గౌరవంతో అంగీకరిస్తున్నానని చెప్పారు. పార్టీ ఓటమికి అనేక కారణాలు ఉన్నాయని, దీనిపై పూర్తిగా సమీక్షిస్తామని తెలిపారు. శనివారం ఇక్కడి విలేఖరులతో మాట్లాడుతూ ప్రతి నియోజక వర్గంలో పార్టీ నిర్వహణపై విశ్లేషణ జరుగుతుందని చెప్పారు. తమది జాతీయ పార్టీ అని ఓటమికి దారి తీసిన పొరపాట్లను సరిదిద్దుకుని సంస్థాపరంగా, పరిపాలనా పరంగా లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించడానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తామని చెప్పారు.
ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి అమిత్‌షా ప్రభావం ఈ ఎన్నికల్లో ఏమీ పనిచేయలేదా అని అడగ్గా, ఓటమికి అనేక కారణాలున్నాయని, క్షుణ్ణంగా విశ్లేషించిన తరువాతనే చెప్పడమవుతుందన్నారు. ఫలితాలు ఇంకా పూర్తికావలసి ఉందని, అలాంటప్పుడు దీని గురించి మాట్లాడడం సరికాదని వ్యాఖ్యానించారు. తనను ఎన్నుకున్నందుకు షిగ్గాన్ నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని, నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని బొమ్మై చెప్పారు.