న్యూయార్క్: ప్రముఖ నవలా రచయిత సల్మాన్ రష్దీ బతికిపోవడంపై… అతడిపై దాడి చేసిన ముష్కరుడు హాదీ మతార్(24) ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాడు. ప్రస్తుతం రష్దీ ఆసుపత్రిలో కోలుకుంటున్నారు. దాడికి పాల్పడిన హాదీ మతార్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జైల్లో ఉన్న హాదీ మతార్ ‘న్యూయార్క్ పోస్ట్’ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
తన దాడిలో తీవ్రగాయాలకు గురైన సల్మాన్ రష్దీ బతకడంపై అతడు ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. అతడు ప్రాణాలతో ఉన్నాడన్న వార్తలు చూసి విస్మయానికి గురయ్యానన్నాడు. సల్మాన్ రష్దీ అంటే తనకు అయిష్టమని, అతడు మంచివాడిగా తాను భావించడంలేదని హాదీ మతార్ వెల్లడించాడు. రష్దీ ఇస్లామ్ పై దాడికి పాల్పడడం ద్వారా, ఇస్లామిక్ విశ్వాసాలను, ఇస్లామిక్ వ్యవస్థలను దెబ్బతీశాడని ఆరోపించాడు. పైగా ఇరాన్ నేత ఆయతుల్లా ఖొమేనీని గొప్ప వ్యక్తిగా అభివర్ణించాడు.‘‘ది శాటానిక్ వర్సెస్’ పుస్తకం రాసిన సల్మాన్ రష్దీని చంపేయాలంటూ ఖొమేనీ జారీ చేసిన ఫత్వాను అనుసరించి ఈ దాడికి పాల్పడ్డారా?’’ అన్న ప్రశ్నకు మాత్రం హాదీ మతార్ సమాధానం ఇవ్వలేదు. అయితే ‘ది శాటానిక్ వర్సెస్’ పుస్తకంలో కొన్ని పేజీలు తాను చదివానని, తనకు ‘ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్’ తో ఎలాంటి సంబంధంలేదన్నాడు.