కోల్‌కత: పార్టీ అధినాయకత్వ వైఖరిపై తీవ్ర అసమ్మతిని వ్యక్తం చేసి శనివారం మధ్యాహ్నం తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తానని వెల్లడించిన తృణమూల్ కాంగ్రెస్(టిఎంసి) ఎంపి శతాబ్ది రాయ్ శుక్రవారం యు-టర్న్ తీసుకున్నారు. శుక్రవారం సాయంత్రం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు, పార్టీ నాయకుడు అభిషేక్ బెనర్జీతో సమావేశమైన తర్వాత ఆమె తన మనసు మార్చుకున్నారు. పార్టీ నాయకత్వం పట్ల తన విశ్వాసాన్ని పునరుద్ఘాటిస్తూ ఆమె శనివారం ఫేస్‌బుక్ పోస్టింగ్ ద్వారా వివరణ ఇచ్చారు.
పార్టీలో తనకు కొన్ని సమస్యలు తలెత్తాయని, అయితే ఇప్పుడవి తొలగిపోయాయని ఆమె తెలియచేశారు. తాను తృణమూల్ కాంగ్రెస్‌ను వీడే ప్రసక్తి లేదని ఆమె స్పష్టం చేశారు. పార్టీలో తలెత్తిన సమస్యలను తామే అంతర్గతంగా పరిష్కరించుకుంటామని, అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన తర్వాత వాటిని తాము విశ్లేషించుకుని తగిన చర్యలు తీసుకుంటామని ఆమె చెప్పారు. మమతా బెనర్జీ నాయకత్వంలో రానున్న అసెంబ్లీ ఎన్నికలను సమైక్యంగా ఎదుర్కొని వరుసగా మూడవసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఇప్పుడు తామందరం కృషి చేయాల్సిన అవసరముందని బీర్భమ్ నియోజకవర్గం నుంచి ఎంపీగా మూడు సార్లు వరుసగా ఎన్నికైన శతాబ్ది రాయ్ పేర్కొన్నారు.
I am with Trinamool Says MP Satabdi Roy clarifies