గద్వాల : అధికార బీఆర్‌ఎస్ పార్టీలో గత నాలుగేళ్లలో తాను అనేక అనుమానాలు ఎదుర్కొని తీవ్ర మనస్థాపానికి గురై.. ఆపార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ సరిత తిరుపతయ్య అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఓ హోటల్‌లో జడ్పీ చైర్‌పర్సన్ సరిత ఆధ్వర్యంలో పాత్రికేయులతో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… గడిచిన నాలుగు సంవత్సరంలో అధికార పార్టీలో ఉన్న తనకు జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి అధికారపార్టీ ప్రజా ప్రతి నిధులు అడ్డంకులు సృష్టించారని, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల సమావేశాల్లో కూడా నాయకులు తనను దూరంగా ఉంచారని ఆవేధన వ్యక్తం చేశారు
. స్థానికురాలు కాననే అపోహాలు కొంతమందిలో బలంగ ఉన్నాయని, గతంలో గద్వాలను పాలించిన పాలకులు స్థానికేతరులే కదా అని ఆమె ప్రశ్నించారు. బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం తాను కట్టుబడి ఉన్నానని, బలహీనవర్గాలకు రాజ్యాధికారం రావాలని తపనతో తాను రాజకీయాల్లోకి వచ్చినట్లు వెల్లడించారు. నడిగడ్డలో మార్పు తప్పకుండా వస్తుందని, ప్రజల ఆశీర్వాదంతో తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని, అందుకు ప్రజలు, మీడియా సోదరుల సహకారం కావాలని కోరారు. అంతేగాక జర్నలిస్టుల ఇళ్లస్థలాల కొరకు అహర్నిషలు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు బండ్ల చంద్రశేఖర్ రెడ్డి, అమరావాయి కృష్ణారెడ్డి, గట్టు సత్యనారాయణ, కృష్ణమూర్తి, తదితరులు పాల్గొన్నారు.