Monday, December 23, 2024

నాకు కెటిఆర్ సర్టిఫికెట్ అవసరం లేదు : కిషన్‌రెడ్డి

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/ హైదరాబాద్ : తనకు మంత్రి కెటిఆర్ సర్టిఫికెట్ అవసరం లేదని, తెలంగాణ ప్రజల సర్టిఫికెట్ అవసరమని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మంగళవారం మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ కిషన్ రెడ్డి అసమర్థుడు, మోస్ట్ అన్ ఫిట్ లీడర్ అని విమర్శించారు. ఈ వ్యాఖ్యలపై కిషన్ రెడ్డి స్పందించారు. అక్టోబర్ 3న నిజామాబాద్ పట్టణంలోని జిజి గ్రౌండ్‌లో జరగనున్న ప్రధాని మోడీ బహిరంగ సభ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. అనంతరం కిషన్‌రెడ్డి మాట్లాడుతూ… రాష్ట్రంలో ప్రధాని మోడీ రెండు రోజుల పాటు పర్యటిస్తారన్నారు. అక్టోబర్ 1న మహబూబ్ నగర్‌లో జరిగే బహిరంగ సభలో, 3న నిజామాబాద్ బహిరంగ సభలో పాల్గొంటారన్నారు. పాలమూరు సభలో పలు అభివృద్ధి పనులకు, ప్రారంభోత్సవాలు, భూమి పూజ కార్యక్రమాల్లో పాల్గొంటారని తెలిపారు. ఇందూరులో 800 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన రూ.6 వేల కోట్ల విలువైన ఎన్టీపీసీ పవర్ ప్లాంటును మోడీ వర్చువల్ గా ప్రారంభిస్తారన్నారు. హైదరాబాద్ నుంచి మొదలు అదిలాబాద్ వరకు బిజెపి బలోపేతమైందన్నారు. ఖమ్మం జిల్లాలో కూడా పెద్ద ఎత్తున మార్పులు వస్తున్నాయని, గిరిజనులతో పాటు స్థానిక ప్రజలు బిజెపిని ఆధరించి మద్దతు తెలుపుతున్నట్లు చెప్పారు. తమ పార్టీ పై విమర్శలు చేసే నైతిక హక్కు కెటిఆర్, బిఆర్‌ఎస్ నేతలకు లేదన్నారు. మోడీ తెలంగాణ పర్యటన గురించి ప్రశ్నించేందుకు కెసిఆర్ ఎవరు? అని ధ్వజమెత్తారు. పసుపు బోర్డు ఏర్పాటుపై చర్చించి నిర్ణయిస్తామన్నారు.

రాష్ట్రంలో అగ్రనేతలు పర్యటిస్తారు…
రానున్న శాసనసభ ఎన్నికలలో బిజెపి విజయం లక్షంగా ప్రధాని నరేంద్ర మోడీతో పాటు హోంశాఖ మంత్రి అమిత్ షా, జాతీయ అధ్యక్షులు జెపి నడ్డా, కేంద్రమంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తారని కిషన్‌రెడ్డి వెల్లడించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రం లోని బస్వా గార్డెన్ లో జరిగిన పార్టీ పదాధికారుల సమావేశంలో నాయకులకు దిశనిర్దేశం చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News