Sunday, January 19, 2025

ఓటింగ్ యంత్రాలపై నమ్మకం లేదు : దిగ్విజయ్ సింగ్

- Advertisement -
- Advertisement -

వీవీ ప్యాట్ స్లిప్పులు ఓటర్లకు ఇవ్వాలని డిమాండ్

న్యూఢిల్లీ : ఓటింగ్ యంత్రాలైన ఈవీఎంలపై తనకు నమ్మకం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ మరోసారి అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో బ్యాలెట్ బాక్సులో వేసేలా వీవీప్యాట్ స్లిప్పులు ఓటర్లకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ఈవీఎంల వినియోగంపై ప్రశ్నలు లేవనెత్తిన ఒక వీడియోపై దిగ్విజయ్‌సింగ్ స్పందించారు. ఈవిఎంలపై నమ్మకం లేదని 2003 నుంచి చెబుతున్నానని అన్నారు. “ నేను ఎవరికి ఓటు వేయాలనుకున్నానో , నా ఓటు ఎక్కడ ఎవరికి వేశానో అన్నది నాకు తెలియదు. హ్యాక్ చేయలేని చిప్ ఉన్న యంత్రం ప్రపంచం లోనే లేదు. సాఫ్ట్ వేర్ ద్వారా ఆ చిప్ అన్ని ఆదేశాలను అనుసరిస్తుంది” అని తెలిపారు.

కాగా ఓటు ఎవరికి వేశామన్నది వీవీప్యాట్ మెషిన్‌లో ఏడు సెకన్ల పాటు కనిపించడం పైనా దిగ్విజయ్‌సింగ్ అనుమానం వ్యక్తం చేశారు ఈవీఎంలో హస్తం (కాంగ్రెస్ గుర్తు)పై నొక్కితే , సాఫ్ట్‌వేర్‌లో కమలం (బీజేపీ గుర్తు) అని కోడ్ ఇస్తే ఏమి జరుగుతుంది ? అని ప్రశ్నించారు. వీవీ ప్యాట్ యంత్రం 7 సెకన్లపాటు “హస్తం ” చూపిస్తుందని, మనం సంతోషంతో అక్కడి నుంచి వెళ్లిన తరువాత కమలం గుర్తుగా స్లిప్‌లో ముద్రించే అవకాశం ఉందన్నారు. రాహుల్ మెహతా వీడియో ద్వారా ఈ మాయాజాలాన్ని చూడవచ్చని ఎక్స్‌పోస్ట్‌లో పేర్కొన్నారు. అందుకే అన్ని అభివృద్ధి చెందిన దేశాల మాదిరిగా బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు నిర్వహించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయని పేర్కొన్నారు.

కౌంటింగ్‌కు ఇంకొంత సమయం పడితే వచ్చే నష్టం ఏముంటుందని ప్రశ్నించారు. తాము కోరుకున్న వ్యక్తికే ఓటు పడిందని ప్రజలు నమ్ముతారని పేర్కొన్నారు. బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు నిర్వహించాలన్న తమ డిమాండ్‌పై కేంద్ర ఎన్నికల సంఘం ను కలిసేందుకు ప్రతిపక్ష కూటమి ఇండియా బ్లాక్ గత ఏడాది ఆగస్టు నుంచి ప్రయత్నించినా, సమయం ఇవ్వలేదని దిగ్విజయ్ సింగ్ విమర్శించారు. సుప్రీం కోర్టును ఆశ్రయించడమో లేదా ఈవీఎంలకు వ్యతిరేకంగా రోడ్లు ఎక్కడమో చేయాల్సి ఉందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News